Share News

వచ్చే 30 ఏళ్ల అవసరాల కోసమే క్యూర్‌

ABN , Publish Date - Sep 13 , 2026 | 06:09 AM

హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, రానున్న 30ఏళ్ల అవసరాల దృష్ట్యానే క్యూర్‌ బిల్లును ప్రవేశపెడుతున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

వచ్చే 30 ఏళ్ల అవసరాల కోసమే క్యూర్‌
Duddilla Sridharbabu

  • హైదరాబాద్‌ను బ్లూ, గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దుతాం

  • సమన్వయంతో పని చేసేందుకు చట్టబద్ధ వ్యవస్థ

  • ముఖ్యమంత్రి అధ్యక్షతన పాలక మండలి: దుద్దిళ్ల

  • అధికారాలను హరించడమే: పాల్వాయి హరీశ్‌

  • పాత బస్తీపై సవతి తల్లి ప్రేమెందుకు?: అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, రానున్న 30ఏళ్ల అవసరాల దృష్ట్యానే క్యూర్‌ బిల్లును ప్రవేశపెడుతున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌కు సంబంధించి కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌ బిల్లు-2026ను శనివారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మూసీ పునరుజ్జీవం చేపట్టామని తెలిపారు.


బెంగుళూరు, ముంబై, ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ చట్టంలోని సెక్షన్లను తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. అదే సమయంలో హైదరాబాద్‌లో రవాణా కోసం కాంప్రిహెన్సివ్‌ మొబిలిటీకి ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. క్యూర్‌ పరిధిలో (హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో) పరిపాలనా వ్యవస్థను భవిష్యత్‌ అవసరాల మేరకు పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ‘క్యూర్‌ బిల్లులో ఐదు భాగాలు, 43 చాప్టర్లు, 349 సెక్షన్లు, 9 షెడ్యూళ్లు ఉన్నాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లకు ఒకే రకమైన చట్టం ఉంటుంది. అన్ని సంస్థలు సమన్వయంతో పని చేసేలా చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నాం. దీనికి సీఎం అధ్యక్షతన అత్యున్నత స్థాయి పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నాం’ తెలిపారు. మూడు కార్పొరేషన్లలో మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేసే దిశగా యోచన చేస్తున్నట్లు చెప్పారు.


క్యూర్‌ బిల్లుతో తీరని హాని: పాల్వాయి హరీశ్‌

క్యూర్‌ బిల్లుతో తీరని హాని జరగనుందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. ఇది పూర్తిగా కార్పొరేషన్ల అధికారాన్ని హరించే చర్య అన్నారు. కొత్త బిల్లుతో మేయర్లు, కార్పొరేటర్లకు పరిమిత అధికారాలు ఉంటాయని చెప్పారు. క్యూర్‌ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. బీజేపీ నుంచి హరీశ్‌బాబు మాట్లాడుతూ ఆస్తిపన్ను రెట్టింపు అవడంతో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు. హైదరాబాద్‌లో నిర్మించే అన్ని కమర్షియల్‌ నిర్మాణాల్లో మహిళలకు టాయిలెట్‌ సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.


హైదరాబాద్‌లో ఉత్పత్తి అయ్యే చెత్తను తొలగించేందుకు ఒక మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని సూచించారు. రాష్ట్ర జనాభాలో 50ు పట్టణాల్లోనే నివసిస్తున్నారని, అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అవసరాల రీత్యా కొత్త మునిసిపల్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా... అధికారం సెంట్రలైజ్డ్‌గా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు విలువ ఉందా అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. ఏ ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యేల మాట వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్రానికి రాజు అయితే తాము నియోజకవర్గానికి రాజులమని, తమ దగ్గర నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా... ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌ ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహించాలని, తమ సలహాలు, సూచనలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. పాతబస్తీపై ఎందుకు సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. పాతబస్తీలో సరైన ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆస్తిపన్నులు ఇష్టానుసారంగా పెంచి వసూలు చేస్తున్నారని, పన్ను తగ్గింపుపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. క్యూర్‌ పరిధిలో నిర్మాణాల విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రేవంత్‌ పాపాల చిట్టా బయటపెడతా
3 శాతం కమీషన్‌తో కోట్లు కొల్లగొట్టేస్తారు..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 06:09 AM