Share News

ప్రపంచ పాలన మారాలి!

ABN , Publish Date - Sep 13 , 2026 | 02:52 AM

ప్రపంచ పాలన మారాలని బ్రిక్స్‌ దేశాలు పిలుపునిచ్చాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యూటీవో సహా అంతర్జాతీయ సంస్థలను పునర్వ్యవస్థీకరించి.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి. అదే సమయంలో ఏకపక్ష సుంకాలు, ఆర్థిక ఆంక్షలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

ప్రపంచ పాలన మారాలి!
modi with leaders

  • భద్రతామండలి, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులను పునర్వ్యవస్థీకరించాలి

  • అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కావాలి

  • ఏకపక్ష సుంకాలు, ఆంక్షలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం

  • అవి ప్రపంచ వాణిజ్యానికి విఘాతం

  • ‘బ్రిక్స్‌ పేమెంట్‌ టాస్క్‌ఫోర్స్‌’ పని వేగవంతం

  • స్థానిక కరెన్సీలలో పరస్పర చెల్లింపులు

  • బ్రిక్స్‌ ఎన్‌డీబీ బ్యాంకు మరింత బలోపేతం

  • పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరం

  • బలప్రయోగంతో కాదు.. దౌత్యంతో పరిష్కారం

  • పహల్గాం ఉగ్రదాడికి ఖండన.. ఉగ్రవాదాన్ని సహించొద్దు

  • 45 పేజీల్లో 140 అంశాలతో బ్రిక్స్‌ ‘న్యూఢిల్లీ డిక్లరేషన్‌’

bricks.jpg

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: ప్రపంచ పాలన మారాలని బ్రిక్స్‌ దేశాలు పిలుపునిచ్చాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యూటీవో సహా అంతర్జాతీయ సంస్థలను పునర్వ్యవస్థీకరించి.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి. అదే సమయంలో ఏకపక్ష సుంకాలు, ఆర్థిక ఆంక్షలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రపంచ వాణిజ్యానికి విఘాతం కలిగించే ఆంక్షలను తొలగించాలని డిమాండ్‌ చేశాయి. అంతేగాకుండా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయానికి వచ్చాయి. బ్రిక్స్‌ దేశాల మధ్య చెల్లింపులన్నీ స్థానిక కరెన్సీల్లో జరిగేలా చూడాలని తీర్మానించాయి. ఈ మేరకు బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్‌’కు ఆమోదం తెలిపాయి. రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్‌, జిన్‌పింగ్‌, ఇతర దేశాల నేతల సమక్షంలో ప్రధాని మోదీ ఈ డిక్లరేషన్‌పై ప్రకటన చేశారు. డిక్లరేషన్‌లో

సుంకాలు, ఆంక్షలు, అంతర్జాతీయ సంస్థలపై పెత్తనం అంశంలో అమెరికా తీరునే తప్పుబట్టినా.. ఎక్కడ అమెరికా పేరును ప్రస్తావించలేదు. ఢిల్లీలోని భారత మండపంలో ‘‘న్యాయమైన పోటీ దిశగా సహకారాన్ని బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధన మార్కెట్లలోనూ సహకారం’’ నేపథ్యంతో 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఏకపక్ష వాణిజ్య విధానాలపై నిరసన, బహుళధ్రువ ప్రపంచాన్ని బలోపేతం చేయడం, పరస్పర సహకారం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. .


అనంతరం మొత్తం 45 పేజీల్లో 140 అంశాలతో కూడిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్‌-2026’ను బ్రిక్స్‌ దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ మధ్య పలు అంశాల్లో పేచీలు తలెత్తినా.. సుదీర్ఘ చర్చలు, భారత్‌ జోక్యంతో అన్ని దేశాలూ ఏకగ్రీవంగా ఆమోదించేందుకు అంగీకరించాయని అధికార వర్గాలు వెల్లడించాయి

ప్రపంచ పాలన వ్యవస్థల్లో మార్పులు..

ఇప్పుడున్న అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక, జనాభా వాస్తవాలకు అనుగుణంగా లేవని.. ప్రపంచ పాలన వ్యవస్థలో మార్పులు అవసరమని బ్రిక్స్‌ దేశాలు స్పష్టం చేశాయి. ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి సహా అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొన్నాయి. భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని.. భారత్‌, బ్రెజిల్‌ సహా కీలక దేశాలకు మరింత ప్రాతినిధ్యం అవసరమని తెలిపాయి. డబ్ల్యూటీవో, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎ్‌ఫలను పునర్వ్యవస్థీకరించాలని.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి. సభ్య దేశాల మధ్య పరస్పర గౌరవం, సమానత్వం, ఐక్యత, ఏకాభిప్రాయం వంటి సూత్రాలపై నిబద్ధతతో ఉంటామని బ్రిక్స్‌ డిక్లరేషన్‌ పేర్కొంది. బ్రిక్స్‌ ఆధ్వర్యంలోని ‘న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ)’ మరింత బలోపేతం చేయాలని సభ్య దేశాలు తీర్మానించాయి. కృత్రిమ మేధ, డిజిటల్‌ టెక్నాలజీలు, ఔషధాలు, ఆరోగ్య సాంకేతికతలు, ఆహార భద్రత అంశాల్లో మరింతగా సహకరించుకోవాలని.. బ్రిక్స్‌ దేశాల మధ్య ఈ అంశాల్లో అంతరాలను తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి.

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరం

దేశాల మధ్య ఘర్షణలను నివారించాలని.. సైన్యంతో, బలప్రయోగంతో కాకుండా దౌత్యం, సంప్రదింపుల ద్వారా పరిష్కారాలను అన్వేషించాలని బ్రిక్స్‌ దేశాలు స్పష్టం చేశాయి. గాజాలో కాల్పుల విరమణకు అన్నిపక్షాలు కట్టుబడి ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా మానవతా సాయం అందేలా చూడాలని కోరాయి. 1967లో గుర్తించిన సరిహద్దుల మేరకు స్వతంత్ర పాలస్తీనాతో కూడిన రెండు దేశాల విధానానికి మద్దతును మరోసారి పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశాయి.


ఏకపక్ష సుంకాలు, ఆర్థిక ఆంక్షలు వద్దు

ఏకపక్షంగా అడ్డగోలు సుంకాల విధింపు, వాణిజ్యానికి విఘాతం కలిగించేలా ఇతర చర్యలు వంటివి పెరిగిపోయాయని బ్రిక్స్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అటువంటి చర్యలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నాయి. ఈ ఆంక్షలు అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు వ్యతిరేకమని.. వెంటనే ఆ ఆంక్షలన్నింటినీ తొలగించాలని కోరాయి. ఇక అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర రవాణాకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా కొంతకాలం శిలాజ ఇంధనాలపై ఆధారపడక తప్పనిపరిస్థితి ఉందని.. ఆ దేశాలకు ఇంధన భద్రత ఉండాలని బ్రిక్స్‌ దేశాలు డిక్లరేషన్‌లో స్పష్టం చేశాయి.

పహల్గాం ఉగ్రదాడికి ఖండన..

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఏమాత్రం సహించవద్దని, ఉగ్రవాద నిర్మూలనకు సభ్య దేశాలన్నీ కట్టుబడి ఉన్నాయని బ్రిక్స్‌ డిక్లరేషన్‌ స్పష్టం చేసింది. 2025 ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 26 మందిని బలిగొన్న ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఉగ్రవాదం పట్ల ఏమాత్రం ఉపేక్షించలేని (జీరో టాలరెన్స్‌) విధానాన్ని అనుసరించాలని, ఉగ్రవాదానికి సహకరించిన వారిని జవాబుదారీ చేయాలని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి సమగ్ర ఉగ్రవాద నిరోధక సదస్సు తీర్మానాన్ని త్వరగా ఆమోదించాలని కోరింది.


స్థానిక కరెన్సీలలో

చెల్లింపులకు ప్రాధాన్యం

బ్రిక్స్‌ దేశాల మధ్య స్థానిక కరెన్సీలలో చెల్లింపులకు ప్రాధాన్యమివ్వాలని డిక్లరేషన్‌లో సభ్యదేశాలు నిర్ణయించాయి. వాణిజ్య చెల్లింపులు, పెట్టుబడులు వంటివి బ్రిక్స్‌ సభ్య దేశాల స్థానిక కరెన్సీలలో జరిగేలా.. ఆయా దేశాల చెల్లింపుల వ్యవస్థలను అనుసంధానించాలని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ‘బ్రిక్స్‌ పేమెంట్‌ టాస్క్‌ ఫోర్స్‌’ పనులను స్వాగతించాయి. అయితే ముందుగా అంచనా వేసినట్టుగా యూరో తరహాలో బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీని తెచ్చే ప్రతిపాదన ఏదీ ముందుకు రాలేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

నేడు, రేపు 4 జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు

పెరిగిన బంగారం ధర

Updated Date - Sep 13 , 2026 | 03:41 AM