నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుదాం
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:36 AM
ప్రపంచ ఆర్థిక, రాజకీయ విధాన నిర్ణయాల్లో సమూల మార్పులకు బ్రిక్స్ దేశాలు నడుం బిగించాలని ప్రధాని మోదీ కోరారు. ఇకపై ఎంతమాత్రమూ నిర్ణయాలను అనుసరించే దేశాలుగా ఉండిపోకూడదని, విధాన నిర్ణయాలు తీసుకొనే శక్తులుగా ఎదుగుదామని పిలుపునిచ్చారు
మనవి కాని నిర్ణయాలకు ప్రభావితం అవుతున్నాం
వచ్చే 20 ఏళ్లకు బ్రిక్స్‌లో సంస్కరణలు అమలుచేయాలి
ఐరాస భద్రతా మండలిని విస్తరించే సమయమిదే
‘బ్రిక్స్’ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: ప్రపంచ ఆర్థిక, రాజకీయ విధాన నిర్ణయాల్లో సమూల మార్పులకు బ్రిక్స్ దేశాలు నడుం బిగించాలని ప్రధాని మోదీ కోరారు. ఇకపై ఎంతమాత్రమూ నిర్ణయాలను అనుసరించే దేశాలుగా ఉండిపోకూడదని, విధాన నిర్ణయాలు తీసుకొనే శక్తులుగా ఎదుగుదామని పిలుపునిచ్చారు. రెండు రోజుల బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా శనివారం ఆయన కూటమి అధ్యక్ష హోదాలో ప్రారంభోపన్యాసం చేశారు. అంతర్జాతీయ పాలనా విధానాల్లో సంస్కరణల కోసం 10 పాయింట్ల ఫార్ములాను ప్రతిపాదించారు. బ్రిక్స్‌లో సభ్యదేశాల మధ్య మరింత సమన్వయం కోసం త్రయోకా వ్యవస్థను సూచించారు. ‘అంతర్జాతీయ పాలనా విధానం ప్రస్తుతం ప్రత్యేక హక్కుల పిరమిడ్‌లా ఉంది. పిరమిడ్ శిఖరంపై ఉన్నవాళ్లు (దేశాలు) తీసుకొనే నిర్ణయాలను కిందిభాగంలో ఉండేవాళ్లు అనుసరిస్తున్నారు. దీనిని మార్చాలి. ఈ పిరమిడ్ స్థానంలో భాగస్వామ్య వేదికను ఏర్పాటు చేయాలి. విధాన నిర్ణయాలు తీసుకోవటంలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. ప్రస్తుతం అనేక అంతర్జాతీయ సంక్షోభాలు, ఘర్షణలకు దక్షిణార్థగోళంలోని దేశాలు బాధితులుగా ఉన్నాయి. మనవికాని నిర్ణయాలకు మనం ప్రభావితం అవుతున్నాం. ఈ పరిస్థితి ఇకపై కొనసాగకూడదు. దక్షిణార్థగోళ దేశాలు విధాన నిర్ణేతలుగా ఎదగాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.
బ్రిక్స్‌ను బలోపేతం చేయాలి
అంతర్జాతీయ వ్యవహారాల్లో బ్రిక్స్ కూటమి ఎంతో ప్రభావవంతంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. కూటమి మరింత బలపడేలా వచ్చే 20 ఏళ్ల కాలానికి ఉపయోగపడేలా సంస్కరణలు చేపట్టాలని సూచించారు. కూటమి దేశాల మధ్య మరింత సమన్వయం కోసం ‘త్రయోకా’ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ‘బ్రిక్స్‌లో అధ్యక్ష హోదా ఏటా మారుతుంది. దీనికి విఘాతం కలగకుండానే త్రయోకా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇందులో భాగంగా గత ఏడాది అధ్యక్షత వహించిన దేశం, ప్రస్తుతం అధ్యక్ష హోదాలో ఉన్న దేశం, వచ్చే ఏడాది అధ్యక్ష బాధ్యతలు చేపట్టే దేశాల మధ్య ప్రత్యేక సమాచార అనుసంధానత ఉండాలి. కూటమి చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ మూడు దేశాలు పరస్పరం పంచుకొని.. తర్వాతి ఏడాది కోసం ఉత్తమమైన కొత్త ఎజెండాను రూపొందించాలి’ అని సూచించారు.
నావికుల రక్షణ అత్యంత కీలకం
అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగి నావికులు మరణిస్తుండటంపై ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగాలంటే నావికుల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం ‘సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్‌వర్క్’ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని ద్వారా సముద్రాల్లో ప్రమాదంలో ఉన్న నావికుల నుంచి సందేశం రాగానే సమీపంలోని దేశాలు తక్షణం స్పందించి రక్షణ చ ర్యలు చేపట్టం బాధ్యతగా మారుతుందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలకు ఇదే సరైన సమయమని ప్రధాని పునరుద్ఘాటించారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా, మలేషియా ప్రధాని అన్వర్, ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో, అబూదాబి యువరాజు అల్ నహ్యాన్, ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసి తదితరులు పాల్గొంటున్నారు. భారత్ మంటపంలో తమిళనాడులోని చారిత్రక రామనాథస్వామి ఆలయ నమూనాతో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఈ నాయకులకు మోదీ స్వాగతం పలికారు. వారికి శనివారం రాత్రి తృణధాన్యాలతో చేసిన పసందైన భారతీయ వంటకాలతో విందు ఇచ్చారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా తపాలా విభాగం రెండు ప్రత్యేక పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పుతిన్‌కు మోదీ అందించిన విశిష్ట బహుమతి.. 'తిరుక్కురళ్'
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్' వృద్ధి: మోదీ