మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి
ABN , Publish Date - Sep 27 , 2026 | 02:38 AM
తెలంగాణ రాష్ట్ర బిల్లుపై సంతకం చేసి తమ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీనిసీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే భరతమాత ముద్దు బిడ్డకు భారతరత్న ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరమో అర్థం కావడం లేదన్నారు.
ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రానికి అభ్యంతరమెందుకో అర్థం కావట్లేదు
దేశం గర్వించే రత్నాన్ని గుర్తించకపోవడం విషాదం
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో స్మారక పార్కు, విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పార్కులో తెలంగాణ బిల్లుపై మన్మోహన్ చేసిన సంతకం నిక్షిప్తం
వ్యవస్థలను పటిష్ఠం చేసిన మన్మోహన్
మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర బిల్లుపై సంతకం చేసి తమ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీనిసీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే భరతమాత ముద్దు బిడ్డకు భారతరత్న ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరమో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో జంక్షన్ వద్ద 2.9 ఎకరాల్లో మన్మోహన్ సింగ్ స్మారక పార్కును ఏర్పాటుచేశారు. శనివారం మన్మోహన్ జయంతి సందర్భంగా పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన మన్మోహన్ విగ్రహాన్ని మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌తో కలిసి సీఎం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా, సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘దేశాన్ని ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన మన్మోహన్ సింగ్‌కు అద్భుతమైన గుర్తింపు ఉండాలి. ఆయన జ్ఞాపకార్థం ఢిల్లీలో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. మన్మోహన్‌ను గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. మనలో ఉన్న ఒక గొప్ప మేధావిని భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు విజ్ఞత ఉండాలి. జెండాల గురించో.. పార్టీల గురించో ఆలోచించడం సమంజసం కాదు. మన్మోహన్ లెగసీని కొనసాగించాలి. ఆయన చేసిన రీసెర్చ్ ఎనాలసిస్, మేధస్సును భవిష్యత్ తరాలకు అందించడానికి ఢిల్లీలో అద్భుతమైన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’’ అని సూచించారు.
ఈ అంశాన్ని లోక్‌సభ, రాజ్యసభలో ప్రస్తావించే విధంగా ఖర్గే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దేశమే గర్వించదగిన జాతి రత్నాన్ని రాజకీయ కారణాలతో గుర్తించకపోవడం విషాదకరమని తప్పుబట్టారు. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన దశ నుంచి ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు నాయకత్వంలో మన్మోహన్ సింగ్ తన అనుభవాలను రంగరించి ఆర్థిక సరళీకృత విధానాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ‘‘యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ రాజకీయ ఎత్తుగడలు సమకూరిస్తే.. మన్మోహన్ గొప్ప పరిపాలనదక్షుడిగా రాణించారు. నెహ్రూ, పటేల్ జోడి తర్వాత మళ్లీ గొప్ప కాంబినేషన్ వీరిదే. సరళీకృత విధానాలు, విద్యాహక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఉపాధిహామీ పథకం, పునరావాస భూసేకరణ చట్టం-2013, అటవీ హక్కుల చట్టం ఇలా ఎన్నో వారు తీసుకొచ్చారు’’ అని వివరించారు. తెలంగాణను ఏర్పాటు చేస్తూ బిల్లుపై మన్మోహన్ సింగ్ పెట్టిన సంతకాన్ని ఈ పార్క్‌లో నిక్షిప్తం చేశామని, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆయన సంతకం కనిపించేలా ముద్రించామని తెలిపారు.
మన్మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్‌వీ రమణ
నెహ్రూ తర్వాత రాజ్యాంగాన్ని అత్యంత గౌరవించి, దాని విలువలను, వ్యవస్థలను పటిష్ఠం చేసిన వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటూ మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తే కూలీలు దొరకరనే ఆందోళన వ్యక్తం చేసినా.. దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకు ఆహారం లభించేలా పని కల్పించేందుకు చట్టాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని ప్రపంచం కీర్తించేలా మన్మోహన్ నిలబడ్డారని గుర్తు చేశారు. 2013లో దేశ దౌత్యవేత్తను అమెరికాలో అవమానించారని, అప్పుడు దేశంలో ఉన్న అమెరికన్ దౌత్యవేత్తలకు ఆ గౌరవాన్ని తీసేశారని.. అమెరికా ప్రభుత్వం దిగి వచ్చి క్షమాపణలు చెప్పి భారతీయులని గౌరవించడం నేర్చుకుందని వివరించారు.
ఇటీవలి కాలంలో దేశాన్ని, దేశ ప్రధానిని అవమానిస్తున్న అమెరికన్ ప్రెసిడెంట్‌ని కనీసం ఖండించడానికి కూడా ఏ రాజకీయ పార్టీ ముందుకు రాని పరిస్థితి ఉందని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు సీజేగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తనని నియమిస్తే ఆయన్ని కలిసి కృతజ్ఞతలు చెప్పాలని ప్రయత్నించానని, వ్యక్తిగతంగా కలిసేందుకు అనుమతివ్వని గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని తెలిపారు. మన్మోహన్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఏరోజూ అవకాశం రాలేదంటూ కార్యక్రమంలోకృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి అతిథులుగా హాజరైన రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, మన్మోహన్ సింగ్‌తో పని చేసిన ఆర్థికవేత్త మోహన్ గురుస్వామి ప్రసంగించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నవంబరులో కాళేశ్వరం పునరుద్ధరణ పనులు
నిర్వాసితులకు ఇచ్చిన హామీల అమలేది?
Read Latest AP News And Telangana News And International News And Telugu News