బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసమే.. సర్ : మమతా బెనర్జీ
ABN , Publish Date - Sep 26 , 2026 | 08:12 PM
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడానికే ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్వహించిందని మాజీ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా నుంచి ఓటర్లను తొలగించారని ఆమె అన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడానికే ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్వహించిందని ఆ రాష్ట్ర మాజీ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితాల నుంచి అసలైన ఓటర్ల పేర్లను తొలగించారని ఆమె అన్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యతవహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శనివారం సేరంపోర్‌లో నిర్వహించిన ర్యాలీలో మమత మాట్లాడారు. సర్ ప్రక్రియపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు నిజం బయట పడిందన్నారు. సీఈసీ రాజీనామా చేయాలని, లేకపోతే బెంగాల్ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఈనెల 30న ఇండియా కూటమి సమావేశం ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
మా లీడర్లను నిర్బంధించారు
తమ వర్గానికి చెందిన టీఎంసీ నాయకులు, కార్యకర్తలు సేరంపోర్‌లో ర్యాలీకి హాజరుకాకుండా వారిని పోలీసులు గృహ నిర్బంధం చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. అంతేకాకుండా తనను కూడా ర్యాలీ వేదిక వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సేరంపోర్‌కు వచ్చి ర్యాలీలో పాల్గొన్నానని చెప్పారు. ‘‘సేరంపోర్ ర్యాలీకి రాకుండా నన్ను అడ్డుకునేందుకు బీజేపీ గూండాలు నా మార్గాన్ని ఆక్రమించారు. వారు నా మార్గాన్ని బ్లాక్ చేస్తే, ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. అలాగే, సేరంపోర్ ర్యాలీకి వస్తున్న మా నేతలపై దాడి జరిగింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులు విధి నిర్వహణలో విఫలమయ్యారు’ అని మమత పేర్కొన్నారు. కాగా.. మమత ఆరోపణలను బీజేపీ కొట్టివేసింది. టీఎంసీ నేతలపై జరిగిన దాడిలో బీజేపీ హస్తం లేదని బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి దేవ్‌జిత్ సర్కార్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం షాపుల్లో సీసీ టీవీ కెమెరాలు.. ట్రాకింగ్ విధానంతో పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర
టీడీపీ కన్నతల్లిలాంటిది.. వైసీపీ కసాయి పార్టీ: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
Read Latest National News And Telugu News