నవంబరులో కాళేశ్వరం పునరుద్ధరణ పనులు
ABN , Publish Date - Sep 27 , 2026 | 02:25 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను నవంబరు రెండో వారంలో ప్రారంభించి, 2027 జూన్‌లోపు (వర్షాకాలానికి ముందే) పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
వచ్చే ఏడాది వర్షాకాలానికి ముందే పూర్తి చేస్తాం..
అక్టోబరు 5న సీడబ్ల్యూసీ కమిటీ ముందుకు డిజైన్లు
అనుమతులు లభించాక టెండర్లు పిలవాలి
బ్యారేజీల భద్రత, నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను నవంబరు రెండో వారంలో ప్రారంభించి, 2027 జూన్‌లోపు (వర్షాకాలానికి ముందే) పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బ్యారేజీల పునరుద్ధరణపై అధికారులు, నిపుణులతో హైదరాబాద్‌లో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్‌డీఎ్‌సఏ, ఇతర నిపుణుల కమిటీల సిఫారసులు, సూచనలను పరిగణనలోకి తీసుకొని పునరుద్ధరణ డిజైన్లను ఖరారు చేశామని వెల్లడించారు.
పునాదుల కింద ఏర్పడిన రంధ్రాలను గ్రౌటింగ్ ద్వారా పూడ్చివేయడం, బ్యారేజీల గేట్ల నుంచి కిందికి దూకే ప్రవాహ వేగాన్ని నియంత్రించడం, దిగువ భాగంలో బ్యారేజీ దెబ్బతినకుండా స్టిల్లింగ్ బేసిన్(వరద పడే ప్రాంతం) పెంచడం, కొత్తగా కటాఫ్ వాల్స్ నిర్మాణం వంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రతిపాదిత డిజైన్లను పుణెలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)లో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ నమూనాల ద్వారా పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 5న సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందు ఈ డిజైన్లను ఉంచుతామని, వాటిని నిపుణులు పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తారని తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
పునరుద్ధరణ పనులకు సంబంధించిన నాణ్యత విషయంలో రాజీ ఉండబోదని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని నిర్దేశించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా, శాశ్వతంగా మూడు బ్యారేజీలను పునరుద్ధరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనులు పూర్తయ్యాక... డ్యామ్ బ్రేక్ అనాలసిస్ పరీక్షల అనంతరమే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తిరిగి నిర్వహణలోకి తీసుకొస్తామని తేల్చిచెప్పారు. డిజైన్ల పరిశీలన నుంచి టెండర్లు, పనుల నిర్వహణ, తుది భద్రతా ధ్రువీకరణ వరకు ప్రతి దశను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్‌డీఎ్‌సఏ ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటిస్తూ, ప్రతి దశను నిపుణుల పరిశీలనకు లోబడి నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నిర్వాసితులకు ఇచ్చిన హామీల అమలేది?
Read Latest AP News And Telangana News And International News And Telugu News