Share News

22-ఏలో ప్రైవేటు భూములు!

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:03 AM

ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో ప్రైవేటు భూములు, స్థలాలు, లేఅవుట్లను కూడా 22-ఏ జాబితాలో చేర్చిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు వాటిని తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడం లేదు.

22-ఏలో ప్రైవేటు భూములు!

తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోని అధికారులు

వందల సంఖ్యలో దరఖాస్తులు

కాళ్లు అరిగేలా తిరుగుతున్న బాధితులు

గతంలో వుడా లేఅవుట్‌ల స్థలాలను కూడా నిషేధించబడిన భూముల జాబితాలో చేర్చిన వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో ప్రైవేటు భూములు, స్థలాలు, లేఅవుట్లను కూడా 22-ఏ జాబితాలో చేర్చిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు వాటిని తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడం లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా పరిస్థితి మారింది. ఎటువంటి ఇబ్బందులు, అడ్డంకులు లేకపోతే 22-ఏ జాబితా నుంచి తీసివేయాలంటూ జీఓ 444 ఇచ్చింది. ఈ సమస్యలకు సంబంధించి మండల తహశీల్దార్‌, ఆర్‌డీఓ, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ భూములను పరిశీలించి చర్యలు తీసుకుంటే సరిపోతుంది. కానీ రెవెన్యూ అధికారులు ఆ పని కూడా చేయడం లేదు.

22ఏ జాబితా నుంచి ఏ భూమినైనా తొలగించాలంటే గతంలో కలెక్టర్‌కు మాత్రమే అధికారం ఉండేది. అనేక పనుల్లో తలమునకలై ఉన్న వారికి ఇది అదనపు భారంగా భావించి జాయింట్‌ కలెక్టర్లు, ఆర్‌డీఓలకు బాధ్యత అప్పగించారు. వారు కూడా తీరిక లేకుండా ఉన్నారు. ఒక్క ఫైల్‌ కూడా ముట్టుకోవడం లేదు. వీఎంఆర్‌డీఏ వుడాగా ఉన్నప్పుడు వేసిన అధికారిక లేఅవుట్లను కూడా 22-ఏలో చేర్చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల భూములను కూడా అలాగే చేశారు. వాటి కోసం వందలాది మంది గత ఐదేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చేరుతున్నారు. వాటిని ఆ జాబితా నుంచి తొలగిస్తే వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని తెలిసినా అధికారులు జాప్యం చేస్తున్నారు. జీఓ 444 జారీ చేసి 70 రోజులు దాటింది. కనీసం పది దరఖాస్తులు కూడా క్లియర్‌ చేయలేదు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారికి అధికారికంగా పట్టాలు ఇస్తున్నారు. తమ స్థలంలో ఇల్లు కట్టుకుంటూ పొరపాటున ఏ గెడ్డ గట్టునో అడుగు స్థలం ఆక్రమిస్తే ఏకంగా 22-ఏలో చేర్చేశారు. అటువంటి నిర్మాణాల్లో ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముకోలేక వారంతా ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వారం రోజుల్లో అనేకం క్లియర్‌ అయిపోతాయి. కానీ ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదు. ఇకపోతే రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులు కూడా మొండికేస్తున్నారు. వుడా అనుమతించిన లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్టర్‌ చేయడానికి నిరాకరిస్తున్నారు. తమకు కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆదేశం వస్తే తప్ప చేయబోమని చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా 22-ఏ జాబితాలో ఉన్న ప్రైవేటు భూములకు మోక్షం కలిగించాలి. ఆ దిశగా ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Sep 27 , 2026 | 01:03 AM