Share News

తెలంగాణలో.. బీజేపీ ఉనికే లేదు!

ABN , Publish Date - Nov 21 , 2026 | 03:27 AM

తెలంగాణలో తమకు ప్రధాన ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ పార్టీయేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీకి ఇక్కడ ఉనికే లేదన్నారు.

తెలంగాణలో.. బీజేపీ ఉనికే లేదు!
Revanth Reddy

  • మా ప్రధాన ప్రత్యర్థి బీఆర్‌ఎస్సే

  • అమిత్‌షాకు దమ్ముంటే ఒవైసీపై గెలవాలి

  • మతాల ఓట్ల కోసం ఇద్దరు నేతల ప్రయత్నం

  • భ్రమల లోకంలో బీఆర్‌ఎస్‌ నేతలు

  • నా రాజకీయ కథలో కేసీఆర్‌ రావణాసురుడు

  • విపక్షం ఉండాలనే బీఆర్‌ఎస్‌ను కొనసాగిస్తున్నాం

  • లేకుంటే ఆ పార్టీని ఎప్పుడో ఖాళీ చేసేటోళ్లం

  • విజిటింగ్‌ ప్రధానిలా భారత్‌కు వస్తున్న మోదీ

  • పునర్విభజన దక్షిణాది ప్రాధాన్యానికి గొడ్డలిపెట్టు

  • ఉన్న 543 సీట్లలోనే మహిళలకు 181 ఇవ్వొచ్చు

  • ఓ మీడియా సంస్థ సమిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో తమకు ప్రధాన ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ పార్టీయేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీకి ఇక్కడ ఉనికే లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులంతా ఫూల్స్‌ ప్యారడైజ్‌ (భ్రమల లోకం)లో బతుకుతున్నారని, తన రాజకీయ కథలో కేసీఆర్‌ రావణాసురుడని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులే ఇప్పుడు ఆయన్ను చుట్టుకున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలన్న ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ను కొనసాగనిస్తున్నామని, లేకుంటే ఆ పార్టీని ఎప్పుడో ఖాళీ చేసి ఉండేవాళ్లమని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఒక మీడియా సంస్థ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి.. తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.


కేసీఆర్‌ను తాను రాజకీయ ప్రత్యర్థిగానే పరిగణిస్తానని, ఆయన కుమారుడు కేటీఆర్‌ను మాత్రం అసలు సీరియ్‌సగా తీసుకోనని అన్నారు. జడ్పీటీసీగా ప్రజా ప్రస్థానం ప్రారంభించిన తాను కేవలం 17 ఏళ్లలో స్వయం శక్తితో ఎదిగి సీఎం పదవి వరకు చేరుకున్నానని గుర్తు చేశారు. కేటీఆర్‌ మాత్రం తండ్రిని అడ్డం పెట్టుకుని ‘మేనేజ్‌మెంట్‌ కోటా’లో నాయకుడయ్యాడని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ విజిటింగ్‌ పీఎంలా మారారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన విదేశీ పర్యటనలకు లెక్కే లేకుండా పోయిందన్నారు. మోదీ తన జీవితంలో ఏనాడూ నిజం మాట్లాడలేదని వ్యాఖ్యానించారు.


‘‘బీజేపీ ఎప్పుడూ అబద్థాలే చెబుతూ అధికారం కోసం పాకులాడుతుంది. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. జాతి, మతం, భాష పేరుతో విభేదాలు సృష్టిస్తుంది’’ అని విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితంగానే ఈ దేశంలో పేద, ధనిక, కులం, మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వచ్చిందని, ఇప్పుడు పేదల ఓటు హక్కును తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.


చెగువేరా స్ఫూర్తే మాకు ఆదర్శం

చెగువేరా స్ఫూర్తే తమకు ఆదర్శమని రేవంత్‌ అన్నారు. పేదల హక్కుల కోసం ఏ దేశంలో సమస్య ఉంటే ఆ దేశానికి వెళ్లి చెగువేరా పోరాడారని గుర్తు చేశారు. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనల్లోనూ మోదీ సర్కారుపై విమర్శలు చేయడాన్ని ఎలా చూస్తారన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. రాహుల్‌ చేపట్టిన ‘ఓట్‌ చోర్‌.. గద్దీ చోడ్‌’ నినాదానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందన్నారు. 12 ఏళ్ల పాలనలో మోదీ రూ.120 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆయనకు ముందున్న ప్రధానులంతా కలిసి చేసిన అప్పులు రూ. 53 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసిన మోదీ.. దేశంలో ఒక్క ప్రాజెక్టును గానీ, ఒక్క ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థను గానీ నిర్మించలేదన్నారు.


తొలి ప్రధాని నెహ్రూ భాక్రానంగల్‌, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌ వంటి సంస్థలను నిర్మించారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ పేదరిక నిర్మూలన, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని, టెలికం విప్లవంతో రాజీవ్‌గాంధీ దేశంలో టెక్నాలజీకి నాంది పలికారని చెప్పారు. సరళీకృత ఆర్థిక విధానాలను పీవీ నరసింహారావు తీసుకొస్తే, మన్మోహన్‌ సింగ్‌ వాటిని కొనసాగించి దేశ ప్రగతికి కారకులయ్యారన్నారు. మోదీ మాత్రం ప్రజలను తిప్పలకు గురిచేస్తూ అప్పులు చేస్తున్నారని, ఆ డబ్బును నేరుగా అదానీ జేబులో వేస్తున్నారని ఆరోపించారు. ‘‘మేం అదానీ సొమ్ముతో ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాం. మోదీలా ప్రజల సొమ్మును అదానీ జేబులో వేయడం లేదు’’ అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటేనని, ప్రజలు ఉన్నంత కాలం మరో వెయ్యేళ్లు కాంగ్రెస్‌ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.


బీజేపీకి డిపాజిట్‌ కూడా దక్కలేదు

తాను ఏబీవీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ, దేశానికి రాహుల్‌గాంధీ నాయకత్వం అవసరమని భావించి కాంగ్రె్‌సలో చేరానని రేవంత్‌ తెలిపారు. రాష్ట్రంలో చాలా స్థానాల్లో పోటీ ఇచ్చే స్థాయి కూడా బీజేపీకి లేదన్నారు. బీజేపీ గెలిచే రాష్ట్రాల్లోనే ‘ఓట్‌ చోరీ’కి పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని జూబ్లీహిల్స్‌లో గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేక పోయిందని, ఇక వారు తమకు పోటీ ఏమిస్తారని ప్రశ్నించారు. తోటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల్లో కర్నాటక సీఎం డీకే శివకుమార్‌తో తన అనుబంధం చాలా ప్రత్యేకమని చెప్పారు. బీజేపీలో మోదీ, అమిత్‌షా తప్ప వేరే పేరే తనకు తెలియదని, కనీసం గుర్తుకు కూడా రావడం లేదని అన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశాలకు వెళ్లినప్పుడు బీజేపీ సీఎంల పేర్లు గుర్తుకు రాక నేమ్‌ బోర్డులు చూడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.


డీలిమిటేషన్‌.. దక్షిణాది ప్రాధాన్యానికి గొడ్డలిపెట్టు!

లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దక్షిణాది రాష్ట్రాల అవసరమే లేకుండా పోతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఉత్తరాది సీట్ల బలంతోనే అధికారం దక్కించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డీలిమిటేషన్‌ తర్వాత మొత్తం 850 సీట్లలో ఉత్తరాదికి 650, దక్షిణాదికి సుమారు 195 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. దక్షిణాదిలో ప్రస్తుతం 129 మంది ఎంపీలు ఉండగా, పునర్విభజన తర్వాత ఆ సంఖ్య 195కే పరిమితమవుతుందని చెప్పారు. ఇది దక్షిణ భారత ప్రాధాన్యాన్ని తుడిచిపెట్టే కుట్ర అని విమర్శించారు. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్‌ ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించిన సమస్య కాదని, యావత్‌ దక్షిణ భారత ప్రజల భవిష్యత్తుకు పెను సవాల్‌ అని అన్నారు.


ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం అత్యంత కీలకమని, గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో కూలిపోయిందని గుర్తు చేశారు. ‘‘ప్రస్తుతం కేరళలో 20 మంది, ఉత్తరప్రదేశ్‌లో 80 మంది ఎంపీలు ఉన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య 60 సీట్ల వ్యత్యాసం ఉంది. 50 శాతం సీట్లు పెంచితే కేరళలో 30, యూపీలో 120 అవుతాయి. అప్పుడు ఆ వ్యత్యాసం 90 సీట్లకు చేరుతుంది. ఇంత భారీ తేడా ఏర్పడితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకునేవారే ఉండరు’’ అని వివరించారు. ‘‘మొత్తం 850 సీట్లలో 650 ఉత్తరాదికే దక్కితే, బీజేపీ ఏ విధంగానైనా మెజారిటీ సాధిస్తే దక్షిణ భారత ప్రాధాన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. తాత్కాలిక రాజకీయ లబ్థి కోసం మోదీ చేస్తున్న ఈ ప్రయోగం రాబోయే రోజుల్లో దేశానికి పెద్ద ప్రమాదంగా పరిణమిస్తుంది’’ అన్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్రకు 175, తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు ఉండేవని, మెజారిటీ బలంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అందుకే పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రాలు, జనాభా, జీడీపీ ఆధారంగా ‘50 శాతం ఫార్ములా’ను అమలు చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రానికి నిజమైన చిత్తశుద్థి ఉంటే కొత్త చట్టాలు, రాజ్యాంగ సవరణలు అవసరం లేకుండానే వెంటనే అమలు చేయవచ్చని, ఇప్పుడున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 181 స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని చెప్పారు. 2023లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్‌ సహకరించిందని గుర్తు చేశారు. ఇప్పుడు సంఖ్యాబలం ఉందని బెదిరించి బిల్లు పాస్‌ చేయించుకున్నా, భవిష్యత్తులో డీలిమిటేషన్‌ అమలైతే దక్షిణాదికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు.


అమిత్‌షాకు దమ్ముంటే అసద్‌పై పోటీ చేయాలి

హిందువుల ఓట్ల కోసం మోదీ, అమిత్‌షా.. ముస్లింల ఓట్ల కోసం అసదుద్దీన్‌ ఒవైసీ ప్రయత్నిస్తుంటారే తప్ప వారి మధ్య నిజానికి పోటీ ఏమీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. అమిత్‌షాకు నిజంగా ధైర్యం ఉంటే హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని ఓడించాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్లే పార్టీ అని చెప్పారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 03:36 AM