నేడు ప్రధానితో సీఎం రేవంత్ భేటీ
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:32 AM
నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలతో పాటు ఎల్‌నినో ప్రభావంపై చర్చించి కేంద్ర సహాయాన్ని కోరేందుకు ప్రధాని నరేంద్రమోదీతో న్యూఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు.
ఎల్‌నినోతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చ
మంత్రులు ఉత్తమ్, వాకిటి, ఇతరులతో కలిసి ఢిల్లీకి
‘ఖేలో ఇండియా’ వేడుకలకు ఆహ్వానించనున్న సీఎం
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలతో పాటు ఎల్‌నినో ప్రభావంపై చర్చించి కేంద్ర సహాయాన్ని కోరేందుకు ప్రధాని నరేంద్రమోదీతో న్యూఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. అందుకోసం ఆదివారం ఉదయం మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, తదితరులతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానిని కలిసి... పలు అంశాలను నివేదించి, వినతిపత్రం అందించనున్నారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితులను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నివేదించి, కేంద్ర సహాయాన్ని కోరనున్నారు.
దాంతో పాటు 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి, సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నుంచి సమ్మతి ఇప్పించాలని కోరే అవకాశాలున్నాయి. గోదావరి- కావేరీ అనుసంధానం ప్రాజెక్టును సమ్మక్కసాగర్ లేదా ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని, ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో 50 శాతం వాటాను తెలంగాణకు ఇవ్వాలని కోరనున్నారు. సీతమ్మసాగర్ బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించేలా చొరవ తీసుకోవాలని కూడా కోరనున్నట్లు సమాచారం. తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 తేదీ వరకు నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవం లేదా ముగింపు వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News