Share News

కోటి ఓట్లు.. 90 సీట్లు

ABN , Publish Date - Nov 23 , 2026 | 02:51 AM

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 95 లక్షల ఓట్లు, 65 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 119 స్థానాలకే జరిగితే.. తమ టార్గెట్‌ కోటి ఓట్లు, 90 సీట్లు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

కోటి ఓట్లు.. 90 సీట్లు

  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టార్గెట్‌..

  • రాష్ట్రంలో 15 లోక్‌సభ సీట్లు సాధిస్తాం

  • పార్టీలో కష్టపడ్డవారికి పదవి దానంతట అదే వస్తుంది

  • చెడగొట్టేవాళ్లను మాత్రం గుర్తుంచుకుంటాం

  • సంక్రాంతి తర్వాత 5 నెలలు ప్రజాబలం కార్యక్రమం

  • ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • 20 వేల మెగావాట్ల డిమాండ్‌ ఉన్నా పంటల్ని కాపాడాం

  • అధికారం కోసం బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాలు

  • కేసీఆర్‌ హయాంలోనే ఏపీ పల్నాడు వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు

  • టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 95 లక్షల ఓట్లు, 65 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 119 స్థానాలకే జరిగితే.. తమ టార్గెట్‌ కోటి ఓట్లు, 90 సీట్లు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో 15 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడాలని.. వ్యూహాలు, ఎత్తుగడలను తాము చూసుకుంటామని చెప్పారు. పార్టీలో కష్టపడ్డవాళ్లను తప్పనిసరిగా గుర్తిస్తామని, చెడగొట్టేవాళ్లను గుర్తుపెట్టుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ లైన్‌లో ఉన్నవారికి పదవి దానంతట అదే వస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తప్పుడు ప్రచారాల ద్వారా అధికారంలోకి రావాలని చూస్తోందని విమర్శించారు.


అప్పట్లో కేసీఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ లేదని, పార్టీని పెరగనివ్వకుండా అడ్డుకుంటానని విర్రవీగారని.. కానీ ఇప్పుడు వాళ్ల బీఆర్‌ఎస్‌ పార్టీకే భవిష్యత్తు లేకుండా పోయిందని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏపీ పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పథకం ప్రారంభించిందని చెప్పారు. ఆదివారం ఉదయం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీల ఉమ్మడి సమావేశం, సాయంత్రం విస్తృత కార్యవర్గ సమావేశం జరిగాయి. సీఎం రేవంత్‌ ఈ రెండు సమావేశాల్లో పార్టీ నాయకులకు దిశానిర్దేశనం చేశారు. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిననాటికి.. అప్పటి సీఎం కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చాలా మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారని రేవంత్‌ గుర్తు చేశారు.


నయానా, భయానా గ్రామ స్థాయి నుంచి ఎంపీల వరకు నాయకులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ లేదని, పార్టీని పెరగనివ్వకుండా అడ్డుకుంటానని విర్రవీగారని పేర్కొన్నారు. తాను టీపీసీసీ చీఫ్‌ అయ్యాక కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వం కార్యక్రమం చేపట్టి 90 రోజుల్లో 48 లక్షల సభ్యత్వం చేశామని, అది దేశంలోనే అత్యధికమని చెప్పారు. రాష్ట్రంలోని 45 లక్షల మంది క్రియాశీల సభ్యులు అదనంగా ఒక్కో ఓటు తీసుకువచ్చినా 90 లక్షల ఓట్లు, 65 సీట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బీజేపీకి 240 సీట్లు దాటబోవని చెప్పానని.. ఎన్నికల్లో బీజేపీ 240 దగ్గరకి వచ్చి ఆగిపోయిందని చెప్పారు. ఆ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు మరో పాతిక లోక్‌సభ సీట్లు వచ్చినా, బీజేపీకి పాతిక సీట్లు తగ్గినా.. కేంద్రంలో ఇండి కూటమి అధికారంలో ఉండేదన్నారు.


నమ్మకంతో పనిచేసినవారికి గుర్తింపు..

రాజకీయాల్లో విశ్వాసం, నమ్మకం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తాయని రేవంత్‌రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలపై కొట్లాడాలని, బీఫామ్‌ ఇంటికి తీసుకువచ్చి ఇస్తామని వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్‌, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, బీర్ల అయిలయ్య వంటి బలహీన వర్గాల నాయకులకు చెప్పామని వివరించారు. నమ్మకంతో పనిచేసిన వారికి ఇళ్లకే బీఫామ్‌లు పంపామన్నారు. అలాగే కష్టకాలంలో పార్టీ జెండా మోసిన 70శాతం డీసీసీ అధ్యక్షులకు బీఫారాలను ఇంటికి పంపామని.. వారు గెలిచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, విప్‌లుగా అయ్యారని చెప్పారు. టికెట్లు ఇవ్వలేక పోయినవారిని తర్వాత ఆదుకుంటామని మాటిచ్చామని.. అలా పార్టీ మాట విన్న బల్మూరి వెంకట్‌ను ఎమ్మెల్సీగా, అనిల్‌ యాదవ్‌ను రాజ్యసభ సభ్యుడిగా చేశామని వివరించారు. పార్టీ కార్యకర్తల బాగోగులు తాను చూసుకుంటే.. తన బాగోగులు పార్టీనే చూసుకుంటుందని నమ్మిన మహేశ్‌గౌడ్‌కు టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కిందన్నారు. అధికారంలోకి రావాలంటే ఉపాయాలూ ఉండాలని చెప్పి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్దకు వెళ్లానని.. రాహుల్‌గాంధీ నాయకత్వంపై నమ్మకంతో కాంగ్రెస్‌లో చేరాలని చెప్పానని.. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారని వివరించారు. సంజీవరెడ్డికి టికెట్‌ త్యాగం చేసిన సురేశ్‌ షెట్కార్‌ ఎంపీ అయ్యారని.. పార్టీని నమ్మితే గుర్తింపు ఉంటుందనడానికి ఇవన్నీ ఉదాహరణలని వివరించారు.


TG copy.jpgచెడగొట్టేవాళ్లను గుర్తు పెట్టుకుంటాం

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడ్డవాళ్లను గుర్తిస్తామని, చెడగొట్టేవాళ్లను గుర్తు పెట్టుకుంటామని చెప్పారు. ‘‘పార్టీలో ఎవరెవరు కష్టపడుతున్నారన్నది నిశితంగా గమనిస్తున్నాం. ప్రతి ఒక్కరి కృషి, మాటతీరు, ముందు ఏం మాట్లాడుతున్నా.. వెనుక ఏం మాట్లాడుతున్నరన్న సమాచారం పార్టీ దగ్గర ఉంది. పార్టీ లైన్‌లో ఉన్నవారికి పదవి దానంతటదే వస్తుంది. గాంధీభవన్‌ చుట్టూ తిరిగితే, ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయని చెప్పి పదవులు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది అపోహ మాత్రమే’’ అని రేవంత్‌ స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌, కేసీఆర్‌ తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలనూ అమలు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. రేషన్‌పై సన్నబియ్యం, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి మంచి పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.


రైతులకు విద్యుత్‌ ఇచ్చి పంటలు కాపాడాం

ఎల్‌నినోతో వానలు తగ్గాయని, రైతుల తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సీఎం రేవంత్‌ సూచించారు. అయితే రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు కొరత లేదన్నారు. వానాకాలంలోనే ఏకంగా 20వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైనా కూడా.. రైతులకు విద్యుత్‌ అందించి పంటలు ఎండిపోకుండా కాపాడామని చెప్పారు. ఎల్‌నినోను ఎదుర్కొనడానికి రూ.30 వేల కోట్లు అవసరమని.. ఈ మేరకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతామని రేవంత్‌ చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పని కల్పించడమే లక్ష్యంగా సంక్రాంతి తర్వాత ఐదు నెలల పాటు ప్రజాబలం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి పని కల్పిస్తామని, నిధులకు కొరత లేకుండా చూస్తామని తెలిపారు.


TG copy.jpgకేసీఆర్‌ హయాంలోనే పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పథకం

ఏపీ పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పథకం 2022లో కేసీఆర్‌ హయాంలోనే మొదలైందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు కూడా వైఎ్‌సఆర్‌ మంత్రివర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నప్పుడే మొదలైందని గుర్తు చేశారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలకు అంగీకరిస్తూ కేసీఆర్‌ సంతకం చేశారని, దాని ఆధారంగానే బీఆర్‌ఎస్‌ హాయంలోనే ఏపీలో ప్రాజెక్టులు ప్రారంభించారని.. ప్రజాప్రభుత్వం వచ్చాక ఏపీలో ఒక్క ప్రాజెక్ట్‌ కూడా చేపట్టలేదని చెప్పారు.


ఈసారి లాగు కూడా విప్పిస్తా!

అంబేడ్కర్‌ ప్రాణహిత- చేవెళ్ల పేరు, అంచనాలు మార్చి లక్ష కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్‌.. ఆ పాపం పోగొట్టుకోవడానికే సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాడని సీఎం రేవంత్‌ ఆరోపించారు. అయినా గోదావరిలో కలిశారని వ్యాఖ్యానించారు. ‘‘తమకు భవిష్యత్తు లేదని గ్రహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. తప్పుడు ప్రచారాల ద్వారా అధికారంలోకి రావాలని చూస్తోంది. అసెంబ్లీ ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వారంతట వారే బట్టలు విప్పుకుని నిలబడేలా చేసిన. మొన్న అంగీ మాత్రమే విప్పించిన. ఈ సారి లాగు కూడా విప్పిస్తా! ఎల్బీనగర్‌లో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకున్న శ్రీకాంతాచారి అమరుడైతే... అగ్గిపెట్టె దొరకని హరీశ్‌రావు తెలంగాణకు గుదిబండగా మారారు’’ అని విమర్శించారు.


పిల్లిగుడ్డిదైతే ఎలుక ఎదురొచ్చి డిస్కోడాన్స్‌ చేసిందట!

‘‘పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎదురొచ్చి డిస్కో డాన్స్‌ చేసిందట! నువ్వేం చేయగలవని ప్రశ్నించిందట! మాలాంటి నాయకులు చూసీ చూడనట్లుంటే కొంతమంది ఇలాగే వ్యవహారాలు చేస్తుంటరు. అలాంటి వ్యవహార శైలి వల్ల ఉపయోగం ఉండదు’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను ప్రజలకు సీఎంను కావచ్చని, కానీ పార్టీలో కార్యకర్తనని చెప్పారు. నాయకులు మంచిని మైక్‌లో చెప్పి.. చెడును చెవిలో చెబితే మంచిదని సూచించారు.


కొత్త రాష్ట్ర ఇన్‌చార్జికి స్వాగతం

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన బీఎం సందీప్‌ ఆదివారం తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఇక గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో బీఎం సందీప్‌కు సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఆయన పర్యవేక్షణలో రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని చెప్పారు.


TG copy.jpgఇందిరమ్మ సూక్తులు పుస్తకం ఆవిష్కరించిన సీఎం

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పలు సందర్భాల్లో చేసిన ప్రసంగాల్లోని ముఖ్యమైన సూక్తులతో రూపొందించిన ‘ఇందిరమ్మ సూక్తులు’ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. సోనియా గాంధీ ముందుమాటతో వెలురించిన ఈ పుస్తకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలుగులో ప్రచురించారు. ఇంగ్లీ్‌షలోని ‘ఇందిరా గాంధీ సెలెక్టెడ్‌ సేయింగ్స్‌’ పుస్తకాన్ని పొన్నం రవిచంద్ర, మామిడి హరికృష్ణ తెలుగులోకి అనువదించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి బి.ఎం.సందీప్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 03:06 AM