గాంధీ పరివారానికి బానిసత్వం కాంగ్రెస్ నైజం
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:38 AM
గాంధీ పరివారానికి బానిసత్వం కాంగ్రెస్ నైజమని, నేషన్ ఫస్ట్ అనేది తమ సిద్ధాంతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ అంటూ సీఎం రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
నేషన్ ఫస్ట్.. మా సిద్ధాంతం: రాంచందర్ రావు
సీఎం రేవంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని ధ్వజం
హైదరాబాద్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): గాంధీ పరివారానికి బానిసత్వం కాంగ్రెస్ నైజమని, నేషన్ ఫస్ట్ అనేది తమ సిద్ధాంతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ అంటూ సీఎం రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నడిపే కుటుంబ స్వార్థ రాజకీయాలకు, సంఘ్ పరివార్ నమ్ముకున్న నిస్వార్థ దేశ భక్తికి మధ్య చాలా తేడా ఉందన్నారు.
‘‘కాంగ్రెస్ పార్టీకి రాజకీయం అంటే ఒకే ఒక్క కుటుంబంతో మొదలవుతుంది.. ఆ కుటుంబంతోనే ముగుస్తుంది. కానీ మాకు వ్యక్తి లేదా కుటుంబం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం. సంఘ్ పరివార్ ఏ ఒక్కరి ఇంటి పేరు మీదో, ఒక కుటుంబం వారసత్వం మీదో నడిచేది కాదు. సమాజ సేవ, దేశ నిర్మాణం, క్రమశిక్షణ కోసం జీవితాలను త్యాగం చేసిన తరతరాల కార్యకర్తల త్యాగాలతో నిలబడిన వ్యవస్థ సంఘ్’’ అని వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాలు ఎప్పుడూ ‘గాంధీ కుటుంబం’ చుట్టూనే తిరగాలని కాంగ్రెస్ కోరుకుంటుందని పేర్కొన్నారు.
‘‘గాంధీ కుటుంబం కాళ్ల దగ్గర పడి తన బానిసత్వాన్ని నిరూపించుకోవడానికి రేవంత్‌రెడ్డి ఎంతైనా పాకులాడవచ్చు. కానీ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది కుటుంబ పాలన కాదు.. ప్రజా సంక్షేమం. వంశపారపర్య పెత్తనం కాదు.. దేశ ప్రయోజనాలు’’ అని రాంచందర్‌రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కాగా, గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య హాస్యాస్ప దమని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని చూసిన కేటీఆర్
హైఎండ్ మెషిన్లన్నీ పీపీపీ పద్ధతిలో ఏర్పాటు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News