Share News

ప్రశాంతంగా నిమజ్జనం

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:55 AM

హైదరాబాద్‌ మహానగరంలో గణేశ్‌ విగ్రహాల నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగియటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎక్కడా పెద్దగా సమస్యలు తెలెత్తకుండా పక్కా ప్రణాళికతో ఈ మహా క్రతువును పూర్తిచేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు.

ప్రశాంతంగా నిమజ్జనం
CP Sajjanar

  • సహకరించినవారందరికీ ధన్యవాదాలు

  • కలర్‌ పేపర్‌ షాట్స్‌తో రోడ్లన్నీ కలుషితం

  • వచ్చే ఏడాది శోభాయాత్రలో నిషేధిస్తాం

  • హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

హైదరాబాద్‌ మహానగరంలో గణేశ్‌ విగ్రహాల నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగియటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎక్కడా పెద్దగా సమస్యలు తెలెత్తకుండా పక్కా ప్రణాళికతో ఈ మహా క్రతువును పూర్తిచేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. శనివారం సచివాలయం సమీపంలో ఉన్నతాధికారులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు 48 గంటలపాటు వైభవంగా సాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసిందని ప్రకటించారు.


ఇందుకోసం మూడు నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఖైరతాబాద్‌ మహా గణపతిని సుమారు 30 లక్షల మంది, బాలాపూర్‌ గణనాథుడిని 15 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. మహా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగియటానికి సహకరించిన పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఆర్‌అండ్‌ బీ, టీజీఎస్పీడీసీఎల్‌, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి, ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హోంగార్డు నుంచి ఐపీఎ్‌సల వరకు అందరూ రాత్రి పగలూ తేడాలేకుండా రోడ్లపైనే ఉన్నారని చెప్పారు. గణేశ్‌ శోభాయాత్రలు, ఊరేగింపుల్లో కలర్‌ పేపర్‌ షాట్స్‌ వాడటం వల్ల రోడ్లపై విపరీతంగా వ్యర్థాలు పేరుకుపోయాయని, వీటి వినియోగాన్ని వచ్చే ఏడాది నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.


సీపీ తీన్మార్‌ డ్యాన్స్‌..

మీడియా సమావేశం అనంతరం సిబ్బందిలో ఉత్సాహం నింపేందుకు సజ్జనార్‌ వారితో కలిసి తీన్మార్‌ డ్యాన్స్‌ చేశారు. డీసీపీలు వైభవ్‌ గైక్వాడ్‌, శిల్పవల్లి, రక్షితామూర్తి, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులంతా కలిసి డ్యాన్స్‌ చేశారు. పలువురు సిబ్బంది సజ్జనార్‌ను ఎత్తుకొని డ్యాన్స్‌ చేశారు. కాగా, గణేశ్‌ నిమజ్జనం కారణంగా నగరంలోని జలాశయాల్లో నీటి కాలుష్యంపై అధ్యయనం చేస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలోని గణేశుడిలడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో భీంరా గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు మోహీన్‌ రూ.4.45 లక్షలకు దక్కించుకున్నాడు.


నిమజ్జనంలో విషాదం.. నలుగురి మృతి

వినాయక నిమజ్జనంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ వద్ద శనివారం తెల్లవారుజామున వినాయకుడిని తరలిస్తున్న లారీకింద పడి కర్ణాటకకు చెందిన దీపక్‌ (35) మరణించాడు. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన పార రమేష్‌ (38), నవీన్‌ (26) శుక్రవారం రాత్రి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దచెరువులో వినాయకుడిని నిమజ్జనం చేసిన అనంతరం వీరు స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించారు.


పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్లన్న కాలనీ సేవాలాల్‌ తండాకు చెందిన యువకులు టస్కర్‌ (టిజి08ఎక్స్‌2330) వాహనంపై వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా శనివారం తెల్లవారుజామున ఎన్‌హెచ్‌-44పై కండ్లకోయ వద్ద వారి వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన ముడావత్‌ వెంకటేష్‌(18) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో నిమజ్జన ఊరేగింపులో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ నర్సిహులుపై తరుణ్‌ అనే యువకుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తరుణ్‌ను అరెస్టు చేశారు. భద్రాచలంలోని ఆదర్శనగర్‌ కాలనీకి చెందిన రోహిత్‌ (12) గణేశ్‌ మండపం విప్పుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యానికి దాదాపు 7 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అతడి తల్లిదండ్రులకు అంతటి స్తోమత లేకపోవటంతో దాతలు సాయం చేయాలని కోరారు. రోహిత్‌ అమ్మమ్మ దుర్గ ఫోన్‌పే నెంబరు 62812 56052కు సహాయం పంపాలని విన్నవించారు.


ఈ వార్తలు కూడా చదవండి:
బతికున్నా చనిపోయాడన్నారు

చిట్టీల గురువు.. 10 కోట్లతో ఉడాయింపు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 04:55 AM