బతికున్నా చనిపోయాడన్నారు
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:48 AM
అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వృద్ధ రోగిని బతికుండగానే చనిపోయాడని వైద్యులు తేల్చిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
రోగి మృతి చెందాడని తేల్చిన వైద్యులు
అంబులెన్స్‌లో తరలిస్తుండగా లేచి కూర్చున్న వైనం
చందుర్తి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వృద్ధ రోగిని బతికుండగానే చనిపోయాడని వైద్యులు తేల్చిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన శంకరయ్య(66) ఈనెల 24న ఊపిరితిత్తుల వ్యాధితో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుల సూచనతో కరీంనగర్‌లోని ఓ పైవ్రేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ఈనెల 25న శంకరయ్య మృతిచెందాడని చెప్పారు.
దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయనలో కదలికలు కనిపించాయి. లేచి కూర్చున్న శంకరయ్యను వెంటనే వేములవాడలోని ఓ పైవ్రేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు శంకరయ్య ఆస్పత్రిలో మృతి చెందాడనే సమాచారంతో గ్రామంలో ఉన్న బంధువులు అంత్యక్రియల కోసం ఇంటి వద్ద ఏర్పాట్లు చేశారు. ఇంటి ముందు టెంట్‌తో పాటు కుర్చీలు కూడా వేశారు. తండ్రి మరణించాడని సమాచారం ఇవ్వడంతో శంకరయ్య ఇద్దరు కుమారులు దుబాయి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. ప్రస్తుతం శంకరయ్యకు చికిత్స కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
చిట్టీల గురువు.. 10 కోట్లతో ఉడాయింపు!
నయా భారత్ కాదు.. మోదీ నకిలీ నయా ఇండియా
Read Latest AP News And Telangana News And International News And Telugu News