Share News

చిట్టీల గురువు.. 10 కోట్లతో ఉడాయింపు!

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:27 AM

చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు పైగా వసూలు చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుటుంబంతో పాటు పరారయ్యాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని లక్ష్మణ్‌నాయక్‌ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చిట్టీల గురువు.. 10 కోట్లతో ఉడాయింపు!
Suryapet chit fund fraud

  • సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం

  • చిట్టీల పేరిట 12 గ్రామాల ప్రజలకు కోట్లలో టోకరా

  • పక్కా స్కెచ్‌తో ఆస్తులు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌

  • ఇంటికి తాళం వేసి కుటుంబంతో పరార్‌

  • బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

చివ్వెంల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు పైగా వసూలు చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుటుంబంతో పాటు పరారయ్యాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని లక్ష్మణ్‌నాయక్‌ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహకు శనివారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఏనేగండి తండాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం శెట్టిగూడెం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబంతో కలిసి సూర్యాపేటలోని విద్యానగర్‌లో గల అద్దె ఇంట్లో నివాసముంటూ, ఆరేళ్లుగా చిట్టీల వ్యాపారం పేరిట నమ్మకం పెంచుకున్నాడు.


తన సొంత తండాతో పాటు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలు, బంధువులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.1.30 కోట్ల వరకు వసూలు చేశాడు. కొంతమందికి ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చి, మరికొందరికి నెలవారీ వాయిదాల పద్ధతిలో అధిక లాభాలు ఇస్తానని నమ్మబలికి రూ.10 కోట్లకు పైగా పోగుచేశాడు. అయితే, ఏడాదిగా డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితులు ఒత్తిడి తెస్తుండటంతో, వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో తనకున్న 4 ఎకరాల భూమిలో మెజారిటీ భాగాన్ని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించి, తన పేరిట 13గుంటల భూమిని మాత్రమే ఉంచుకున్నాడు.


హైదరాబాద్‌కు తీసుకెళ్లి చెక్కేసిన నిందితుడు

దాదాపు పది రోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ ప్రముఖ వ్యక్తిని కలవాలని చెప్పి తండాకు చెందిన ఇద్దరిని నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. అక్కడి ఓ హోటల్‌లో కూర్చొని మాట్లాడుతుండగా, తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని వారి వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లిన అతడు, తిరిగి రాకుండా పరారయ్యాడు. విషయం గ్రహించిన బాధితులు స్థానికంగా విచారించగా, సూర్యాపేటలోని అద్దె ఇంటితో పాటు తండాలోని ఇంటికి కూడా తాళాలు వేసి ఉన్నట్లు గుర్తించారు. కాగా, సేకరించిన మొత్తాన్ని నిందితుడు ఏం చేశాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చెస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అట్టహాసంగా ప్రారంభమైన విమలక్క ప్రజా కళా జాతర
పెరుగుతున్న గోదావరి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 04:27 AM