అట్టహాసంగా ప్రారంభమైన విమలక్క ప్రజా కళా జాతర
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:08 AM
అరుణోదయ సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ఉద్యమ ప్రస్థానం నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో 50 గంటల ప్రజా కళాజాతర కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది.
ఆటపాటలతో ఆకట్టుకున్న కళాకారులు
సుందరయ్య పార్కు నుంచి ఆర్టీసి కళాభవన్ వరకు భారీ ర్యాలీ
రాంనగర్, సెప్టెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): అరుణోదయ సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ఉద్యమ ప్రస్థానం నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో 50 గంటల ప్రజా కళాజాతర కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత అరుదోదయ సమాఖ్య ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఆజాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్ వరకు ప్రజా కళాజాతర నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు బోనాలు ఎత్తుకొని కోలాటం ఆడి సందడి చేశారు.
డప్పువాయిద్య కళాకారులు డప్పులు కొడుతూ స్టెప్పులు కలుపుతూ ముందుకు సాగారు. కోయ కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. అందరూ ఆర్టీసీ కళాభవన్‌కు చేరుకున్న తర్వాత తొలుత సభాప్రాంగణ ఆవరణలో ఏర్పాటు అరుణోదయ సాంస్కృతిక జెండాను అరుణోదయ సీనియర్ కార్యకర్త అంబిక ఆవిష్కరించారు. అనంతరం కళాభవన్‌లో ఏర్పాటు చేసిన విమలక్క 50 సంవత్సవాల విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమం, బహుజన బతుకమ్మ కార్యక్రమాలకు సంబందించిన ఫొటో గ్యాలరీని ఆమె ప్రారంభించారు. అనంతరం ప్రజాకళాజాత సభా కార్యక్రమాన్ని సినీ దర్శకుడు ఉమామహేశ్వర్‌రావు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో ప్రజాసాంస్కృతిక ఉద్యమం వైపు నిలవటం చాలా కష్టమైన పని అని అన్నారు.50 ఏళ్లుగా విమలక్క ప్రజాసాంస్కృతిక ఉద్యమం వైపు నిలవడం గొప్ప విషయమని కొనియాడారు. 50 ఏళ్లుగా జనంలో ఉంటూ వారితో మమేకమయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమె ఫొటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో న్యూఢిల్లీ జర్నలిస్టు బాషాసింగ్, ప్రజాకళాజాతర ఆహ్వాన సంఘం ప్రతినిధి ప్రొఫెసర్ జయదీర్ తిరుమల్‌రావు,. ప్రొఫెసర్ చక్రధర్‌రావు, కట్టా భగవంత్‌రెడ్డి, ప్రొఫెసర్ వినయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎర్రవల్లి భూముల సర్వేపై ఉత్కంఠ
పర్యాటక రంగానికి కృత్రిమ మేధను జోడించాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News