ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:32 AM
త్వరలో జరగబోయే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నిలబడతాం..
ఉగాది తరువాత రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తా
బీఆర్‌ఎస్.. మూసివేసిన పుస్తకం
2023 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి కాళేశ్వరం అవినీతే కారణం
రేవంత్‌రెడ్డిది విఫల ప్రభుత్వం
ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో తెలంగాణ
రక్షణ సేన అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగబోయే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. వచ్చే ఉగాది పర్వదినం తరువాత రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహిస్తానని తెలిపారు. తన బస్సుకు భైరవ అనిపేరు పెట్టినట్లు చెప్పారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ముఖాముఖిలో ఆమె తన భవిష్యత్ కార్యాచరణపై పలు అంశాలను పంచుకున్నారు.
రాష్ట్రంలో రానున్న అన్ని ఎన్నికల్లోనూ పోటీచేస్తామని తెలిపారు. సామాజిక తెలంగాణ ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తుందని చెప్పారు. తాను ఇప్పటికే సగం తెలంగాణలో పర్యటించానని, రానున్న రోజుల్లో మిగిలిన సగం ప్రాంతంలో పర్యటిస్తానని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీలో మంచి జరిగితే వారి గొప్పగా చెప్పుకుంటారని, చెడు జరిగితే ఇతరుల మీదకు నెట్టేస్తారని విమర్శించారు. తన కుటుంబంలో ఏ సమస్యా లేదని.. రాజకీయంగా మాత్రమే విభేదిస్త్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ మూసివేసిన పుస్తకమని అన్నారు. తన జీవితంలో మరోసారి ఆ పార్టీకోసం పని చేయబోనని, రాజకీయంగా కలిసేదే లేదని స్పష్టంచేశారు. తాను జైల్లో ఉండగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య విలీన చర్చలు జరిగాయని తెలిపారు. 2023లో బీఆర్‌ఎస్ ఓడిపోవడానికి వెయ్యిశాతం కాళేశ్వరంలో జరిగిన అవినీతే కారణమని కుండబద్ధలు కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మధ్య బంధం విడదీయలేనిదని అన్నారు.
రేవంత్‌రెడ్డిది విఫల ప్రభుత్వం
సీఎం రేవంత్‌రెడ్డిది చేతకాని, అసమర్థ ప్రభుత్వమని కవిత ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో పసికందుల మరణం తరువాత వైద్యారోగ్యశాఖ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో ఓ మిత్రుడు ఆధారాలతో సహా తనకు వివరాలు పంపారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2020-21లో 6 వేలమంది, 2022-23లో 4,933 మంది, 2024-25లో 3,853 మంది పిల్లలు చనిపోయారని తెలిపారు. పాలన చేతకాకపోతే తప్పుకోవాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి అంశంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రె్‌సపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, తెలంగాణలో ప్రజలతో ఇన్ని తిట్లు తిన్న సీఎం మరొకరు లేరని అన్నారు.
బీఆర్‌ఎస్‌పై ప్రజలకు నమ్మకం లేదని చెప్పారు. కేటీఆర్, హరీశ్‌రావు పోటీ పడి కార్యక్రమాలు పెడతారే తప్ప ప్రజల కోసం పని చేయరని విమర్శించారు. తన ఆస్తులు ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన దానికన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా తిరిగి ఇచ్చేస్తానని కవిత సవాల్ చేశారు. తన ఫామ్‌హౌస్ లీగల్‌గా కట్టుకున్నదేనని, ప్రతిపైసా చట్టానికి లోబడి సంపాదించుకున్నదేనని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ ఇంటి డబ్బుతో నడవదని.. ఎవరైనా చందాలతోనే నడుపుతారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఫామ్‌హౌస్‌లకు సంబంధించి వేసిన సిట్ ఉత్తదేనని, అంతర్గత ఒప్పందాలు జరిగే వరకు టైంపాస్ సిట్‌లు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు.
తీహార్ జైలు ఘోరంగా ఉంటుంది
తీహార్ జైల్లో పరిస్థితులు ఘోరంగా ఉంటాయని.. అందుకే తన తండ్రి కేసీఆర్‌ను, అమ్మను, అత్తమామలను జైలుకు రావద్దని చెప్పినట్లు కవిత తెలిపారు. గోడల నుంచి నీటి చెమ్మ వస్తూంటుందని, ఓసారి పాము వచ్చిందని ఒకరు ఫిర్యాదు చేస్తే.. జైలు అధికారులు పాములు రాక ఏం వస్తాయని సమాధానం ఇచ్చారని తెలిపారు. 2,000 మంది ఖైదీలు ఉండాల్సిన చోట10 వేల మంది ఉంటారని పేర్కొన్నారు. పార్టీ కోసం తాను జైలు శిక్ష అనుభవిస్తే.. ఆ పార్టీ నుంచే తనను బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జైలుశిక్ష కంటే బాధాకరమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ , కేటీఆర్ మధ్య బంధం ఏంటో తనకు తెలియదని.. నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికల్లో తన వార్తలు వేయరని చెప్పారు. కాగా, టీఆర్‌ఎస్ విస్ర్తృత స్థాయి సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయని, నాలుగు రోజుల్లో 8 ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతతో కవిత సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైల్ ఓఆర్‌ఆర్ పక్క నుంచే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News