హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైల్ ఓఆర్‌ఆర్ పక్క నుంచే..
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:18 AM
తెలంగాణ మీదుగా ముంబై, బెంగళూరు, చెన్నైలకు కేంద్రం ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాల్లోని హైస్పీడ్ రైలు అలైన్‌మెంట్‌లను ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలమీదుగా 93 కిలోమీటర్ల మేర హైదరాబాద్-ముంబై మార్గం
హైదరాబాద్-బెంగళూరు కారిడార్ రాష్ట్రంలో 205 కిలోమీటర్లు
అచ్చంపేటకు 8 కి.మీ దూరం నుంచి హైదరాబాద్-చెన్నై రూట్ 180 కి.మీ.
హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌కు సమాంతరంగా మార్గం
ప్రతిపాదిత అలైన్‌మెంట్లలో మార్కింగ్
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మీదుగా ముంబై, బెంగళూరు, చెన్నైలకు కేంద్రం ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాల్లోని హైస్పీడ్ రైలు అలైన్‌మెంట్‌లను ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గాలనే ఖరారు చేయాలని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌కు కూడా విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. కాగా, హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్‌మెంట్ విషయంలో ప్రజల్లో కొంత గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఎటువైపు నుంచి రైలు వెళ్లనుంది? ఎవరెవరి భూముల్లో నుంచి వెళ్తుందన్న అంశంపై జనం ఆందోళన చెందుతున్నారు.
మూడు రైల్వే లైన్లకు చెందిన స్టేషన్లు, బహుదూర్‌గూడలో హైస్పీడ్ రైల్ హబ్ ఏర్పాటు గురించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయిగానీ.. రైలు మార్గం ఎలా వెళ్లనుందన్నదానిపై స్పష్టత లేదు. తాజాగా హైస్పీడ్ రైల్ కోసమంటూ ఆయా మార్గాల్లోని భూముల్లో పసుపు, తెలుపు, ఎరుపు రంగులతో చేసిన మార్కింగులు రైతులు, భూ యజమానుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. భూములు కోల్పోతామన్న ఆవేదనలో వారు ఉన్నారు. అలైన్‌మెంట్లు ఎటు నుంచి వెళ్తున్నాయనేది తెలియకపోవడంతో స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే.. హైస్పీడ్ రైల్ కారిడార్‌లకు సంబంధించిన ప్రతిపాదిత స్టేషన్లు, అలైన్‌మెంట్ మార్గం వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. దీనిపై ప్రత్యేక కథనం.
హైదరాబాద్-ముంబై మార్గం ఇలా..
హైదరాబాద్-ముంబై-పుణె కారిడార్ మొత్తం 671 కి.మీ. దీంట్లో తెలంగాణలో 93 కి.మీ. మార్గం ఉంటుంది. రాష్ట్రంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోనే హైస్పీడ్ రైలు లైను ఉండనుంది. ఈ మార్గంలో బహదూర్‌గూడ, కోకాపేట, వికారాబాద్‌లలో స్టేషన్లు రానున్నాయి. వీటికి వరుసగా శంషాబాద్, సైబరాబాద్, అనంతగిరి హిల్స్‌గా పేర్లు పెట్టనున్నారు. ఈ మార్గం అలైన్‌మెంట్ ఎలా ఉంటుందంటే.. బహుదూర్‌గూడలో ప్రారంభమై హిమాయత్‌సాగర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి నియోపోలీస్ మీదుగా వట్టినాగులపల్లికి చేరుతుంది. అక్కడివరకు ఔటర్‌రింగ్‌రోడ్డు పక్కనుంచే హైస్పీడ్ రైల్ లైన్ ఉంటుంది. ఇక్కడి వరకు ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని గతంలోనే సేకరించిన భూమి అందుబాటులో ఉంది. దాంట్లోనే హైస్పీడ్ రైల్వే లైన్ నిర్మిస్తారు.
అంటే వట్టినాగులపల్లి వరకు రైల్వే లైన్ కోసం కొత్తగా భూసేకరణ చేయాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. ఇక వట్టినాగులపల్లి నుంచి ఎన్కేపల్లి జంక్షన్‌కు, అక్కడి నుంచి వికారాబాద్‌కు లైన్ వెళ్తుంది. ఈ మార్గంలో ఒక చోట 4.6 కి.మీ.ల టన్నెల్‌ను ప్రతిపాదించారు. ఈ టన్నెల్ గుండా రైల్వే లైను ఉండనుంది. మరోవైపు కోకాపేట ప్రాంతంలోని సైబరాబాద్ స్టేషన్‌లో భవిష్యత్‌లో హైస్పీడ్ రైలును మెట్రోను అనుసంధానించేలా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. హైదరాబాద్-ముంబై-పుణె హైస్పీడ్ రైలు కారిడార్‌ను 2031 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రాజెక్టులో భూసేకరణ అంశమే అత్యంత కీలకమైనది.
హైదరాబాద్-బెంగళూరు మార్గం
హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైల్ మార్గం...శంషాబాద్, భారత్ ఫ్యూచర్‌సిటీ, ఆమనగల్, మన్ననూరు, సోమశిల, శ్రీశైలం మీదుగా వెళ్లనుంది. తెలంగాణ పరిధిలో 205 కి.మీ.ల రైలు మార్గం ఉంటుంది. శంషాబాద్ నుంచి మొదలై ఓఆర్‌ఆర్‌కు 3-5 కి.మీ.ల దూరం నుంచి వెళ్లేలా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. అచ్చంపేట టౌన్‌కు 8 కి.మీ.లు, మహబూబ్‌నగర్ టౌన్‌కు 80 కి.మీ.ల దూరం నుంచి ఇది వెళ్తుంది. ఈ రూట్‌లో మన్ననూరు దగ్గర స్టేషన్‌ను ప్రతిపాదించారు.
దానిని నల్లమల స్టేషన్‌గా పేరు మార్చతూ రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌కు సమీపంలో ఈ స్టేషన్ ఉండనుంది. మరోవైపు సోమశిల టౌన్‌కు దగ్గర్లో సోమశిల స్టేషన్ ఉండనుంది. కృష్ణా నదిపై ప్రతిపాదించిన ఐకానిక్ బ్రిడ్జికి దగ్గర్లో దీనిని నిర్మించనున్నారు. రిజర్వ్ ఫారె్‌స్టలో కాకుండా దానికి అటుఇటు వైపు ఉన్న భూముల గుండా మార్గాన్ని ఖరారు చేయనున్నారు. రిజర్వ్ ఫారె్‌స్టకు ఎటువైపు అన్నది స్పష్టత రావాల్సి ఉంది. రంగారెడ్డి, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ఈ మార్గం అలైన్‌మెంట్ ఉంటుంది.
హైదరాబాద్-చెన్నై మార్గం
హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రతిపాదించిన మార్గం మొత్తం 760 కి.మీ.లు. తెలంగాణ పరిధిలో ఇది 180 కి.మీ.ల వరకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్-అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డుకు సమాంతరంగా దీనిని నిర్మించాలని నిర్ణయించారు. శంషాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ మార్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డ్రైపోర్టు, హాలియా, వాడపల్లి దగ్గర స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ పరిధిలో దాదాపు 40 గ్రామాల మీదుగా ఈ రైలు మార్గం ఉండనుంది. హైస్పీడ్ రైలు, 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పక్కపక్కనే వెళ్లేలా ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ఖరారు చేశాయి. ఈ మేరకు ఎడమవైపు రోడ్డు, కుడివైపు హైస్పీడ్ రైలును నిర్మించాలని తాజాగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంటే హైదరాబాద్-విజయవాడ వరకు ఉన్న ప్రస్తుత రోడ్డు వైపు ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. దీనికి కుడివైపు హైస్పీడ్ రైలు మార్గం ఉండనుంది. ఈ రెండింటికీ కలిపే భూసేకరణ చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News