డిసెంబరు నుంచి ఎన్నికల జాతర!
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:02 AM
రాష్ట్రంలో మరో రెండు నెలల తర్వాత ఎన్నికల సందడి మొదలు కానుందా? డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఎన్నికలు జరిగే అవకాశముందా? అంటే ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
పరిషత్, జీహెచ్‌ఎంసీతో పాటు.. మరికొన్ని కార్పొరేషన్లకు ఎన్నికలు
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో రెండు నెలల తర్వాత ఎన్నికల సందడి మొదలు కానుందా? డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఎన్నికలు జరిగే అవకాశముందా? అంటే ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ, కొన్ని జిల్లాల్లోని మునిసిపల్ కార్పొరేషన్‌న్లకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు కూడా జరగనున్నాయి. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపితే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ నడుస్తోంది. నవంబరు 5వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పలు మునిసిపల్ కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు సంబంధిత శాఖలకు వెళ్లినట్టు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 10న జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. మరోవైపు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు మరో ఒకటి, రెండు చోట్ల మునిసిపాలిటీల ఎన్నికలు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి.
వీటన్నింటికీ ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయి పాలకవర్గాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీహెచ్‌ఎంసీలో కీలక మార్పులు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విభజించింది. మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేలా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ మూడు కార్పొరేషన్లతో పాటే ఖమ్మం, వరంగల్, ఇతర మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేదంటే మొదట హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపి, ఆ తరువాత మిగిలిన వాటిలో ఎన్నికల వెళ్తారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఏ ఎన్నిక ఎప్పుడంటే..
డిసెంబరులో హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్లతో పాటు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి. ఆ తరువాత ఫిబ్రవరిలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆయా ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఫిబ్రవరి లేదా మార్చిలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఫిబ్రవరి-మార్చిలో ఖైరతాబాద్ ఉప ఎన్నికకు పచ్చజెండా ఊపితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, పరిషత్ ఎన్నికలను ఏప్రిల్ లేదా మే నెలకు వాయిదా వేసే అవకాశాలున్నాయి.
పీఏసీఎస్‌లు నామినేటెడా.. ఎన్నికలతోనా.!
పెండింగ్‌లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)కు కూడా పాలకవర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సొసైటీలను నామినేటెడ్ విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇలా నియామకాలు చేస్తే.. తరువాత ఏవైనా సమస్యలు వస్తే ఎలా అన్న చర్చ వచ్చిందని సమాచారం. ఆ కారణంగానే పీఏసీఎస్‌లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News