ఎర్రవల్లి భూముల సర్వేపై ఉత్కంఠ
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:57 AM
మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లోని ఎర్రవల్లి గ్రామ భూముల సర్వేపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కదిలిన జిల్లా రెవెన్యూ, సర్వే విభాగం అధికారులు 9రోజుల పాటు సర్వే చేపట్టారు.
అధికారుల నివేదికపైనే అందరి చూపు..
325 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిపై వీడని చిక్కుముడులు
కేసీఆర్ కుటుంబ సభ్యుల
భూములపై ప్రాథమిక విచారణ
సోషల్ మీడియాలో చక్కర్లు
కొడుతున్న ఫాంహౌస్ మ్యాప్
కొండపోచమ్మసాగర్ కాలువ నుంచి
ఫాంహౌస్‌లోకి పిల్ల కాలువ
భారీ బావిలోకి నీటి మళ్లింపు
సంగారెడ్డి/గజ్వేల్/మర్కుక్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లోని ఎర్రవల్లి గ్రామ భూముల సర్వేపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కదిలిన జిల్లా రెవెన్యూ, సర్వే విభాగం అధికారులు 9రోజుల పాటు సర్వే చేపట్టారు. సర్వే నంబర్ 325 సరిహద్దులను గుర్తించారు. రికార్డుల్లో నమోదై ఉన్న 244మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం రైతు వారీగా భూసర్వే చేపట్టారు. మొత్తంగా ఇక్కడి భూములపై అధికారులకు స్పష్టత వచ్చినప్పటికీ నివేదిక అంశంలో స్పష్టత రావడం లేదు. నివేదికలో ఏయే అంశాలు ఉంటాయి, భూముల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ రైతులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పాండురంగ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములపై ప్రాథమిక విచారణ!
ఎర్రవల్లిలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న భూములపై సైతం అధికారులు ప్రాథమిక విచారణ జరిపినట్టు సమాచారం. కేసీఆర్ కుటుంబానికి, బంధువులకు సంబంధించి ఎంత భూమి ఉందనే విషయంపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. కానీ వివరాలేమీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే కేసీఆర్ ఫాంహౌస్, చుట్టుపక్కల భూముల వివరాలతో ఒక శాటిలైట్ మ్యాప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేసీఆర్‌తోపాటు కేటీఆర్, ఆయన కుమారుడు హిమాన్షురావు, కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, కేటీఆర్ కుమార్తె అలేఖ్య, మాజీ ఎంపీ జోగినపల్లి సంతో్‌షరావు, ఆయన తండ్రి జోగినపల్లి రవీందర్‌రావు, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు, టీన్యూస్ పేరిట భూములు ఉన్నట్టుగా ఆ మ్యాప్‌లో మార్కింగ్స్ చేసి ఉన్నాయి. కానీ దానిపై స్పష్టత రాలేదు.
కొండపోచమ్మ కాలువ నుంచి ఫాంహౌస్‌లోకి పిల్ల కాలువ
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మించిన వరదరాజపూర్ కాల్వతో గంగాపూర్, యూసు్‌ఫఖాన్‌పల్లి మీదుగా ఎర్రవల్లికి సాగునీరు వచ్చేలా నిర్మాణం చేపట్టారు. అయితే ఆ కాల్వ నుంచి ఒక పిల్ల కాల్వను నేరుగా కేసీఆర్ ఫాంహౌస్‌లోకి ఏర్పాటు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పిల్ల కాల్వ ద్వారా కేసీఆర్ ఫాంహౌస్‌లో మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన పెద్ద బావిలోకి నీటిని నింపుతున్నట్టుగా తేల్చినట్టు సమాచారం. కేసీఆర్ ఫాంహౌస్‌కు ఈశాన్యంలో వాస్తు ప్రకారం 14 ఏళ్ల క్రితమే కేసీఆర్ భారీ బావిని తవ్వించారని, కాలంతో సంబం ధం లేకుండా అందులో నీళ్లు నిల్వ ఉండేలా చూసుకుంటున్నారని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
Read Latest AP News And Telangana News And International News And Telugu News