ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:43 AM
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లు పూర్తి ..
పేదలందరికీ ఇల్లు.. పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మారుస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
జనగామలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జనగామ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పార్టీలకు, నియోజకవర్గాలకు అతీతంగా ఇది కొనసాగుతుందని, మొదటి, రెండో విడతలే కాకుండా మూడో విడత, నాలుగో విడత ఇళ్లను కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతీ పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఇంటి స్థలం లేని నిరుపేదలకు స్థలాలను పంపిణీ చేసి ఇందిరమ్మ ఇంటిని కూడా మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, దాంట్లో భాగంగా ఈ దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లను పూర్తి చేయనున్నామని పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. అక్కడితో ఆగిపోకుండా రెండో విడతలో నియోజకవర్గానికి 2000 చొప్పున ఇస్తున్నామన్నారు.
తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చాలన్న తపనతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే రెండో విడత కింద, గుడిసెల్లో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వీరి ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు. మరోవైపు, అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.2-3 లక్షల చొప్పున అందిస్తామని.. నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున దీనిని అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ఆ ఎమ్మెల్యేలను విస్మరించకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు.
గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో కొన్ని నియోజకవర్గాలకే ఇచ్చారని, తాము అలా చేయడం లేదన్నారు. పేదలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను తాము తీసేయలేదని పొంగులేటి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో రూపాయి అవినీతి లేకుండా చూస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో బటన్ నొక్కితే నేరుగా ఆడబిడ్డల ఖాతాల్లో ఇళ్ల బిల్లులు పడుతున్నాయని తెలిపారు. ప్రతీ ఇంటికి కేంద్రప్రభుత్వం రూ.72 వేల చొప్పున ఇవ్వాల్సి ఉందని, కేంద్రం చుట్టూ తిరగగా తిరగగా ఇటీవలే 2 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News