Share News

పెరుగుతున్న గోదావరి

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:19 AM

గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం 40 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పెరుగుతున్న గోదావరి
Godavari flood

  • నేడు భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరే అవకాశం..

  • ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వరద

  • సమ్మక్క సాగర్‌ నుంచి 7.01 లక్షల కూసెక్కుల విడుదల

  • వాజేడు మండలంలో మునిగిపోయిన అప్రోచ్‌ రోడ్డు

  • ఛత్తీ్‌సగఢ్‌తో పాటు 25 గ్రామాలకు రాకపోకలు బంద్‌

  • పొంగిన రేకుమాకు వాగు.. 163 హైవేపై నిలిచిన వాహనాలు

భద్రాచలం/చర్ల/ఏటూరునాగారం రూరల్‌/కన్నాయిగూడెం/వాజేడు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం 40 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 20 అడుగులకు చేరుకున్న నీటిమట్టం శుక్రవారం అర్ధరాత్రికి 19.7 అడుగులకు తగ్గింది. నాలుగు గంటల పాటు నిలకడగా ఉండి మళ్లీ క్రమేపీ పెరుగుతూ వచ్చింది. శనివారం ఉదయం 5 గంటలకు 19.9 అడుగులు ఉండగా సాయంత్రం 6 గంటలకు 28.6 అడుగులకు చేరింది. ఆదివారం సాయంత్రానికి 40 అడుగులకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.


భద్రాచలంలోని స్నానఘట్టాలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలోనూ గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద నీటిమట్టం శనివారం సాయంత్రానికి 13.20 మీటర్లకు చేరింది. ఎగువన వర్షాలకు తోడు ప్రధాన ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో మంగపేట మండలం కమలాపురం ఇన్‌టేక్‌ వెల్‌ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్‌ బ్యారేజీ వద్ద కూడా క్రమేపీ పెరుగుతోంది.


మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వరద వచ్చి చేరుతోంది. 7.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా బ్యారేజీ మొత్తం 59 గేట్లకు 54 గేట్లు ఎత్తి 7.01 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వాజేడు మండలం చీకుపల్లి-పెద్దగొల్లగూడెం మధ్య తాత్కాలిక అప్రోచ్‌ రోడ్డు నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఛత్తీ్‌సగఢ్‌తో పాటు వాగు అవతల ఉన్న 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దులోని టేకులగూడెంవద్ద రేకుమాకు వాగు పొంగడంతో 163వ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.


150 మంది కూలీలు సురక్షితం

భద్రాద్రి జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లి శివారులోని గోదావరి పాయల మధ్య పొలాల్లో పనులకు వెళ్లి చిక్కుకుపోయిన సుమారు 150 మంది కూలీలను అధికారులు మరపడవల్లో ఒడ్డుకు చేర్చారు. శనివారం కూలీలు పనులకు వెళ్లగా గోదావరి ప్రవాహం ఆ ప్రాంతాలను చుట్టుముట్టింది. స్థానికుల సమాచారంతో చర్ల తహసీల్దార్‌ శ్రీనివాసులు, పోలీసులు కూలీలను మరపడవల్లో ఒడ్డుకు చేర్చారు.


నిండుకుండలా ఎల్లంపల్లి

  • ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశం

మంచిర్యాల/పెద్దపల్లి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో 3 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఎగువ నుంచి 8407 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.980 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ స్కీం కోసం 258 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, ఎన్టీపీసీ అవసరాలకు 121 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా నంది మేడారంలోని నంది పంప్‌ హౌస్‌లోకి 15,750 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి మిడ్‌ మానేరుకు తరలిస్తున్నారు. వరద కొనసాగుతుండటంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అట్టహాసంగా ప్రారంభమైన విమలక్క ప్రజా కళా జాతర
పర్యాటక రంగానికి కృత్రిమ మేధను జోడించాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 04:19 AM