Share News

హైఎండ్‌ మెషిన్లన్నీ పీపీపీ పద్ధతిలో ఏర్పాటు!

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:24 AM

సర్కారీ దవాఖానాల్లో ఎంతో ఖరీదైన హైఎండ్‌ వైద్య యంత్ర పరికరాలను ఇక నుంచి పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

హైఎండ్‌ మెషిన్లన్నీ పీపీపీ పద్ధతిలో ఏర్పాటు!
Telangana PPP medical equipment

  • కొనుగోలు బాధ్యతల నుంచి

  • ఔషధ కార్పొరేషన్‌ అవుట్‌

  • మూడు చోట్ల పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంఆర్‌ఐ యంత్రాలు

  • ఖమ్మం, పాలమూరు, నిజామాబాద్‌ బోధానాస్పత్రుల్లో ఏర్పాటు

  • తీసిన స్కానింగ్‌లకు ఆరోగ్యశ్రీ రేట్ల ప్రకారం చెల్లింపులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సర్కారీ దవాఖానాల్లో ఎంతో ఖరీదైన హైఎండ్‌ వైద్య యంత్ర పరికరాలను ఇక నుంచి పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పైలెట్‌ ప్రాజెక్టు కింద మూడు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో హైఎండ్‌ మెషిన్లను పీపీపీ పద్ధతిలో అందుబాటులోకి తేనుంది. ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ( టీజీఎంఎ్‌సఐడీసీ) హైఎండ్‌ మిషనరీలను టెండరు పద్ధతిలో కొనుగోలు చేసే బాధ్యత నుంచి సర్కారు తప్పించింది. ప్రజలకు మెరుగైన వైద్యమందించేందుకు సర్కారు ఏటా రూ.కోట్లాది విలువైన వైద్య యంత్ర పరికరాలను ఆస్పత్రుల కోసం కొంటున్నా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా అవి రోగులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు.


అఖరికి రోగులు మళ్లీ ప్రైవేటు డయాగ్నస్టిక్‌ కేంద్రాలకే వెళ్లి స్కానింగ్స్‌ లాంటివి చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే అత్యంత ఖరీదైన వైద్య పరికరాలను కొనుగోలు చేయకుండా పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 బోధనాస్పత్రులకు రూ.799 కోట్ల వ్యయంతో హైఎండ్‌ వైద్య యంత్ర పరికరాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జనరల్‌ సర్జరీకి సంబంధించి 10 అడ్వాన్డ్స్‌ రోబొటిక్‌ సర్జికల్‌ మెషిన్లు కొనుగోలు చేయాలని, అందుకోసం రూ.300 కోట్లు బడ్జెట్‌ అవుతుందని అంచనా వేశారు. అలాగే ఎంఆర్‌ఐ (మ్యాగ్నటిక్‌ రిసోనెన్స్‌ ఇమేజ్‌) 3 టెస్లా మెషిన్లు ఎనిమిదింటిని రూ.192 కోట్లతో, సీటీ 128, సీటీ 16 స్లైస్‌ యంత్ర పరికరాలను ఎనిమిదింటిని రూ.57 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.


హైఎండ్‌ మెషిన్లు ఇవే...

రాష్ట్రవ్యాప్తంగా కేవలం 9 ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 9 ఎంఆర్‌ఐ యంత్రాలున్నాయి. అలాగే 48 సర్కారీ దవాఖానాల్లో 50 సీటీ స్కాన్‌ యంత్రాలున్నాయి. వాస్తవానికి 33 బోధనాస్పత్రులుండగా.. వాటిల్లో కేవలం 5 చోట్లే ఎంఆర్‌ఐ యంత్రాలున్నాయి. హైఎండ్‌ క్యాటగిరీలో ముఖ్యంగా ఎంఆర్‌ఐ యంత్రాల్లో 3 టెస్లా మెషిన్లు బాగా ఖరీదైనవి. వీటి ఒక్కో యంత్రం సగటు ఖరీదు రూ.20-25 కోట్లు ఉంటాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అందుకోసమే వీటిని పీపీపీ పద్ధతిలో ప్రొక్యూర్‌ చేయాలని సర్కారు భావిస్తోంది. ఇక క్యాన్సర్‌ రోగుల కోసం వినియోగించే పెట్‌ స్కాన్‌, లినాక్‌, సీటీ స్కాన్‌ యంత్రాలు కూడా బాగా ఖరీదైనవి.. ముందుగా పైలెట్‌ ప్రాజెక్టు కింద నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ బోధనాస్పత్రుల్లో ఎంఆర్‌ఐ యంత్రాలను అందుబాటులోకి తేనున్నారు.


నిర్వహణ అంతా ప్రైవేటు సంస్థలదే...

ఈ పీపీపీ విధానంలో కోట్ల విలువ చేసే యంత్రాలను ప్రైవేటు కంపెనీలే ఏర్పాటు చేస్తాయి. ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలు, రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు, టెక్నిషీయన్స్‌, నర్సింగ్‌ సిబ్బంది నియామకమంతా ఆయా కంపెనీలే చూసుకుంటాయి. సాంకేతిక సమస్యలు ఎదురైతే వాటిని ఒక్కరోజులోనే మరమ్మతులు చేసే బాధ్యత కూడా ఆ సంస్థనే చూసుకోవాల్సి ఉంటుంది. సీజీహెచ్‌ఎ్‌స, ఆరోగ్యశ్రీ రేట్ల ప్రకారం తీసిన స్కాన్‌కు ప్రైవేటు సంస్థకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. నకిలీ బిల్లులకు చెక్‌ పెట్టేందుకు డిజిటల్‌ పీఎ్‌సఎస్‌ రేడియాలజీ సిస్టమ్‌తో అనుసంధానిస్తారు. దాంతో స్కాన్‌ రిపోర్టులు ఆన్‌లైన్‌లో సంబంధిత వైద్యులకు అందుబాటులోకి వస్తాయి. అలాగే ప్రతి స్కాన్‌కు రోగి బయోమెట్రిక్‌, ఐరిస్‌ లాంటివి తీసుకుంటారు. ఈ విధానం వల్ల రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందడమే కాకుండా సర్కారీ దవాఖానాల్లో కీలక వైద్య యంత్ర పరికరాలు పనిజేయవన్న అపవాదు కూడా తొలగిపోనుంది. కాగా, పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని సర్కారు ఆస్పత్రుల్లో పీపీపీ విధానంలోనే యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. రోగులకు ఉచితంగానే టెస్టులు చేస్తున్నారు. ఆయా ప్రైవేటు కంపెనీలకు టెస్టుకు ఇంత చొప్పున అక్కడి సర్కారే డబ్బులు చెల్లిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:
విద్యార్థులు రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యమివ్వాలి

గచ్చిబౌలి ‘అంతేరా’ సహా.. 11 రెస్టారెంట్ల లైసెన్స్‌లు రద్దు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 05:24 AM