Share News

ఇటలీ రాజకీయ నాయకుడు ఫిలిబెక్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలి

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:14 AM

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన భారత్‌ సమ్మిట్‌ వేదికపై ఇటలీ రాజకీయ నాయకుడు, యూరోపియన్‌ సోషలిస్ట్స్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ జియాకోమో ఫిలిబెక్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా ‘‘ఓట్‌ చోర్‌.. గద్దీ చోడ్‌’’(ఓట్ల దొంగ అధికారం నుంచి దిగిపోవాలి) అంటూ నినాదం చేయడంపై ..

ఇటలీ రాజకీయ నాయకుడు ఫిలిబెక్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలి
Ramchander

  • మళ్లీ ఇండియాలో అడుగుపెట్టకుండా చేయాలి

  • ఓ విదేశీ నేత వచ్చి మన దేశ ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఏంటి?

  • ఆయన ఇమ్మిగ్రేషన్‌ రూల్స్‌ను ఉల్లంఘించారు

  • శంషాబాద్‌లోని ఫారినర్స్‌ రీజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీ‌స్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఫిర్యాదు

  • సమ్మిట్‌ నిర్వాహకులందరిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

  • డీజీపీకి ఫిర్యాదు చేసిన రాంచందర్‌రావు

హైదరాబాద్‌/పహాడిషరీఫ్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన భారత్‌ సమ్మిట్‌ వేదికపై ఇటలీ రాజకీయ నాయకుడు, యూరోపియన్‌ సోషలిస్ట్స్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ జియాకోమో ఫిలిబెక్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా ‘‘ఓట్‌ చోర్‌.. గద్దీ చోడ్‌’’(ఓట్ల దొంగ అధికారం నుంచి దిగిపోవాలి) అంటూ నినాదం చేయడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు సోమవారం పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి శంషాబాద్‌లోని ఫారినర్స్‌ రీజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్(ఎఫ్ఆర్‌ఆర్‌వో)లో ఫిర్యాదు చేశారు. ఫిలిబెక్‌ వీసా, ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయనపై ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌-2025లో సెక్షన్లు 23, 29ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు.


ఆయన ఇంకా ఇండియాలోనే ఉంటే దేశం నుంచి బహిష్కరించాలని, మళ్లీ భారత్‌లో అడుగుపెట్టకుండా బ్లాక్‌ లిస్టులో పెట్టాలని అన్నారు. ‘‘ఓ విదేశీ నేత భారతదేశానికి వచ్చి మన దేశ ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఏంటి’’ అని ప్రశ్నించారు. ‘‘ఫిలిబెక్‌ వ్యాఖ్యల వెనుక భారత్‌ సమ్మిట్‌ నిర్వాహకుల పాత్ర ఉందా’’ అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోరారు.


రాహుల్‌, రేవంత్‌లు చేసినదానికన్నా పెద్ద దేశ ద్రోహం లేదు

భారత్‌ సమ్మిట్‌ నిర్వహణకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ నుంచి అవసరమైన అనుమతులు, రాజకీయ క్లియరెన్స్‌లు పొందారా.. లేదా.. అన్నది కూడా పరిశీలించాలని రాంచందర్‌రావు తన ఫిర్యాదులో కోరారు. ‘‘భారత గడ్డపై ఒక విదేశీయుడు మన దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తూ మాట్లాడుతుంటే, వేదికపై ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చప్పట్లు కొడుతూ ఆనందించడం, సీఎం రేవంత్‌ రెడ్డి నవ్వుతూ ప్రోత్సహించడం కంటే పెద్ద దేశద్రోహ చర్య ఇంకొకటి ఉండదు’’ అని రాంచందర్‌ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


ఇప్పటికే రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్నారని, ఇప్పుడు ఏకంగా విదేశీయులను ఇక్కడికి రప్పించి భారత వ్యతిరేక నినాదాలు చేయించడం దౌర్భాగ్యమన్నారు. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, పెట్టుబడుల సదస్సు అని చెప్పి ‘భారత్‌ సమ్మిట్‌’ను భారత వ్యతిరేక సదస్సుగా మార్చారని, సమ్మిట్‌ నిర్వాహకులందరిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరుతూ రాంచందర్‌రావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 04:14 AM