Share News

తయారీ ప్రక్రియలోనే లోపాలకు చెక్‌!

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:46 AM

దేశ రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలంటే ఆయుధాలు, క్షిపణులు, యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేయడమే కాకుండా.. వాటి నాణ్యత, భద్రత, విశ్వసనీయతను నిర్ధారించే నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ (ఎన్‌డీటీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

తయారీ ప్రక్రియలోనే లోపాలకు చెక్‌!
NDE 2026

  • అప్పుడే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి: రాజ్‌నాథ్‌ సింగ్‌

  • చిన్నపొరపాటు కూడా సైనిక కార్యకలాపాలకు పెనుముప్పు

  • అధునాతన పరికరాలు దేశీయంగా అభివృద్ధి చేసుకోవాలి

  • ‘ఎన్‌డీఈ-26’ను వర్చువల్‌గా ప్రారంభించిన రక్షణమంత్రి

  • ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో అగ్రగామి తెలంగాణ: శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/అల్వాల్‌, నవంబరు 15, (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలంటే ఆయుధాలు, క్షిపణులు, యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేయడమే కాకుండా.. వాటి నాణ్యత, భద్రత, విశ్వసనీయతను నిర్ధారించే నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ (ఎన్‌డీటీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఇండియన్‌ సొసైటీ ఫర్‌ నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ (ఐఎస్ఎన్‌టీ) ఆధ్వర్యంలో ఆదివారం హైటెక్స్‌లో జరిగిన ‘నాన్‌ డిస్ట్రక్టివ్‌ ఎవాల్యుయేషన్‌ అండ్‌ ఎనేబ్లింగ్‌ టెక్నాలజీస్‌ (ఎన్‌డీఈ--2026)’ 36వ జాతీయ సదస్సు, ఎన్‌డీటీపై జరుగుతున్న అంతర్జాతీయ సింపోజియం ‘ఏరోఎన్‌డీటీ- 2026’ సదస్సును రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక అవసరమని పేర్కొన్నారు.


మానవ శరీరంలోని అంతర్గత పరిస్థితులు తెలుసుకునేందుకు ఎక్స్‌ రే, అలా్ట్రసౌండ్‌ పరీక్షలు ఉపయోగపడినట్లుగానే, పారిశ్రామిక, రక్షణ రంగాల్లో ఎన్‌డీఈ సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. క్షిపణుల అభివృద్ధి, నౌకా నిర్మాణం, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, రాడార్‌ వ్యవస్థల వంటి రంగాల్లో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించిందని, దేశీయ సాంకేతికతతో రూపొందించిన ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్‌’ దేశ సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. అయితే, రక్షణ వ్యవస్థలు ఎంత ఆధునికంగా, సంక్లిష్టంగా మారుతున్నాయో.. వాటి నాణ్యత, విశ్వసనీయతను నిర్ధారించాల్సిన బాధ్యత కూడా అంతే పెరుగుతోందని హెచ్చరించారు. చిన్నపాటి లోపం కూడా రక్షణ పరికరాల పనితీరును ప్రభావితం చేస్తుందని, అత్యంత కీలక సమయాల్లో సైనికుల విజయాన్ని కూడా ఇది ప్రమాదంలోకి నెట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తయారీ ప్రక్రియలోనే లోపాలు తలెత్తకుండా నివారించే నాణ్యతా సంస్కృతిని పెంపొందించాలని సూచించారు. అత్యాధునిక ఎన్‌డీటీ సాంకేతికత, ప్రత్యేక సెన్సార్లు, సంబంధిత సాఫ్ట్‌వేర్‌లను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.


1500కు పైగాఏరోస్పేస్‌ ఎంఎస్‌ఎంఈలు: శ్రీధర్‌బాబు

కార్యక్రమంలో విశిష్ఠ అతిథిగా ప్రత్యక్షంగా పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు.. ‘ఎన్‌డీఈ- 2026’ డిజిటల్‌ వెర్షన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘మేడ్‌ ఇన్‌ తెలంగాణ’ బ్రాండ్‌కు మరింత గుర్తింపును తీసుకొచ్చేందుకు తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేలా స్థానిక పరిశ్రమలను గ్లోబల్‌ మార్కెట్‌తో అనుసంధానం చేస్తున్నామన్నారు. టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ సంస్ధ తయారు చేస్తోన్న అపాచీ హెలికాఫ్టర్ల ఫ్యూజలేజ్‌లు, బోయింగ్‌ 737 విమానాల వర్టికల్‌ ఫిన్‌ నిర్మాణాలు సహా స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వంటి అంతరిక్ష సాంకేతిక సంస్థల పురోగతిని ప్రస్తావించారు.


తెలంగాణాలో 1500కు పైగా ఏరోస్పేస్‌ రంగాలకు సేవలందించే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉన్నాయని అన్నారు. 2024-25లో రాష్ట్ర మొత్తంఎగుమతుల్లో విమానాలు, అంతరిక్ష నౌకలు వాటి విడిభాగాలు 29.4 శాతం వాటాతో దాదాపు రూ. 63వేల కోట్ల విలువ కలిగి ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎన్‌డీఈ నిపుణులకు మరింత డిమాండ్‌ ఉండనుందని, ఆ దిశగా రాష్ట్ర యువతను ‘రెడీ టూ వర్క్‌ ఫోర్స్‌’ గా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఎన్‌డీఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయాలన్న ఐఎస్ఎన్‌టీ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మూడు రోజుల పాటు జరగనున్న సదస్సులో రెండు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటుండగా, ఆయా సంస్థలు 100పైగా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సదస్సులో భాగంగా పలువురు శాస్త్రవేత్తలకు ఎన్‌డీటీ అవార్డులు, హెచ్‌ఏఎల్‌ మాజీ సీనియర్‌ మేనేజర్‌ విజయరాఘవన్‌కు ఐఎస్ఎన్‌టీ జీవితసాఫల్య పురస్కారాన్ని అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:46 AM