కచ్చితంగా, పూర్తి నమ్మకంతో చెబుతున్నాం.. మోదీని ఓడిస్తాం!
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:04 AM
‘‘ద్వేషించం.. అసహ్యించుకోం.. అణచివేయం.. అవమానించం.. విద్వేషం, హింస లేకుండా.. ప్రేమ, కరుణ, సత్యం, అహింసలే మేము ఎంచుకున్న మార్గం, సిద్ధాంతంతోనే బీజేపీని ఓడిస్తాం. కచ్చితంగా, పూర్తి నమ్మకంతో చెబుతున్నాం. రానున్న ఎన్నికల్లో మోదీని ఓడిస్తాం. ఇది ఇప్పటికే నిశ్చయమైపోయింది’’ అని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఇప్పటికే మోదీ, అమిత్ షాలో ఓటమి భయం చూశాం
2014 ఎన్నికల్లో కోట్లు కుమ్మరించి.. సరికొత్త ప్రచార పద్ధతులు, నాటకీయ రాజకీయ వ్యూహాలను తెరపైకి తీసుకొచ్చారు
అర్థం చేసుకోవడానికి దశాబ్దం పట్టింది.. కారణాలను గుర్తించాం
ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది
రాజకీయాల్లో దశాబ్దంగా నెలకొన్న సంక్షోభానికి ఇదే కారణం
రాజకీయ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయమిదే
భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
మమ్మల్ని ఆపగలమని అనుకుంటే అది వారి భ్రమే రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘‘ద్వేషించం.. అసహ్యించుకోం.. అణచివేయం.. అవమానించం.. విద్వేషం, హింస లేకుండా.. ప్రేమ, కరుణ, సత్యం, అహింసలే మేము ఎంచుకున్న మార్గం, సిద్ధాంతంతోనే బీజేపీని ఓడిస్తాం. కచ్చితంగా, పూర్తి నమ్మకంతో చెబుతున్నాం. రానున్న ఎన్నికల్లో మోదీని ఓడిస్తాం. ఇది ఇప్పటికే నిశ్చయమైపోయింది’’ అని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో నిరసనలతో మోదీ, అమిత్ షాల్లో ఓటమి భయాన్ని ఇప్పటికే చూశామన్నారు. దేశంలో ఫాసిస్టు శ క్తులను ఓడించడానికి ప్రగతిశీల శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. భారత్ సమ్మిట్ 2.0 ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన ప్రసంగించారు.
‘‘ఫాసిస్టు ధోరణులు కలిగిన రాజకీయ శక్తులను కోపం, ద్వేషం, హింసతో ఎదుర్కోలేము. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయ పార్టీల మధ్య కాదు. ఇది భిన్నమైన రెండు భావజాలాల మధ్య జరుగుతున్న సంఘర్షణ. ఒకవైపు, తమకే అన్నీ తెలుసని, ఎదుటివారి మాట వినకుండా గట్టిగా అరుస్తూ ఆధిపత్యం చెలాయించే శక్తులు ఉన్నాయి. మరోవైపు ప్రశ్నించేతత్వం, వినే స్వభావం, సానుభూతి, వినయంతో వ్యవహరించే సమూహం ఉంది. సమాజంలోని ఆ చిన్న సమూహం తమకన్నీ తెలుసని, ప్రతి దానికీ తమ వద్దే సమాధానాలున్నాయని భావిస్తుంది. మెజారిటీ ప్రజలు మాత్రం ప్రశ్నిస్తూ, ఇతరుల అభిప్రాయాలను వింటూ, అవసరమైతే తమ తప్పులను దిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రెండు వర్గాల మధ్యే అసలు పోరాటం జరుగుతోంది’’ అని వివరించారు.
వ్యాపార, విద్యా, రాజకీయ రంగాల్లోనూ తమకే అన్నీ తెలుసనే భావనతో వ్యవహరించే వ్యక్తులు ఉంటారని, రాజకీయాల్లో ఇటువంటి ధోరణినే ఫాసిజంగా పరిగణిస్తామని వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంగా ఇటువంటి శక్తులు బలంగా చలామణి అవుతున్నాయని, విశాల ప్రజానీకం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోలేక అయోమయానికి గురైందని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా లౌకిక, ప్రగతిశీల ఉద్యమాలకు ఫాసిస్టు రాజకీయ శక్తుల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయని, ప్రేమ, కరుణ, సత్యం, అహింస, పరస్పర గౌరవం పునాదులుగా కొత్త ప్రపంచ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహాత్మా గాంధీ బోధించిన అహింస, సత్యం అనే ఆయుధాలతో ముందుకు వెళుతున్నామని, ప్రస్తుత, భావి తరాల కోసమే పోరాటం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన పలువురు ప్రతినిధులకు క్షమాపణలు కోరుతూ.. వీరిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని, దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కొందరు రాలేకపోయారని విచారం వ్యక్తం చేశారు.
అట్టడుగు నుంచి రెండో స్థానానికి అదానీ
‘‘దేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా 600 మంది అత్యంత ధనికుల జాబితాలో అట్టడుగున ఉన్నవారు.. మోదీ అధికారంలోకి రాగానే ప్రపంచ ధనికుల్లో రెండో స్థానంలోకి వచ్చారు. విమానాశ్రయాలు, సిమెంట్, పోర్టులు, రోడ్లు, రక్షణ వ్యవస్థలను అదానీ చేతుల్లో మోదీ పెట్టారు. ఎన్నికల్లో భారీగా డబ్బు వెదజల్లే శక్తులు అడుగుపెట్టాయి. రాజకీయ వ్యవస్థలోకి కోట్లాది రూపాయలు కుమ్మరించారు. సరికొత్త ప్రచార పద్ధతులు, నాటకీయ రాజకీయ వ్యూహాలు తెరమీదికి వచ్చాయి. ఈ పరిణామాలు ప్రతిపక్షాలను తీవ్ర దిగ్ర్భాంతికి, ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు దాదాపు దశాబ్ద కాలం పట్టింది. క్రమంగా కారణాలను గుర్తించాం’’ అని రాహుల్ గాంధీ వివరించారు. ఇందుకు 2014 ఎన్నికలే ప్రధాన సాక్ష్యమని, అటువంటి ఎన్నికలను మునుపెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ధ్వంసమైందని, మిలియన్ల కొద్దీ డాలర్లను ఎన్నికల వ్యవస్థలోకి చొప్పించారని ఆరోపించారు. పోటా పోటీగా ఎన్నిక ఉన్న ఫలితాలు దిగ్ర్భాంతికి గురి చేశాయని గుర్తు చేశారు. ఆ తర్వాత నుంచి ప్రజాస్వామ్య సంస్థలు, ఎన్నికల ప్రక్రియ బలహీనపడుతున్నాయని చెప్పారు. ‘‘బీజేపీ ఆస్తులు 12 ఏళ్లలోనే 11 రెట్లు పెరిగాయి. ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బు ప్రభావం చూపుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు మొదట తమను తాము, తమ పార్టీని, తమ సిద్ధాంతాలను ప్రశ్నించుకోవాలి. భారత రాజకీయాల్లో దశాబ్ద కాలంగా నెలకొన్న సంక్షోభానికి ఇదే ప్రధాన కారణం’’ అని అభిప్రాయపడ్డారు.
ఓటు వేసిన నెలల్లోనే గాయబ్
2024 ఎన్నికల్లో ఓటు వేసిన కోట్లాది మందిని కొన్ని నెలల తర్వాత చెల్లని లేదా ఉనికిలో లేని ఓటర్లుగా పరిగణించే పరిస్థితి ఏవిధంగా ఏర్పడిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల్లో ఎన్నికల సంఘం చేసిన మార్పులపై అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘మహారాష్ట్రలో మహాఘట్బంధన్ కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన మూడు నెలలకే రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అకస్మాత్తుగా భారీ సంఖ్యలో ఏకంగా 70 లక్షల కొత్త ఓటర్లు జాబితాలో చేరారు. ఆ ఓట్లు చేరిన చోటల్లా బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి’’ అని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓటు వేసిన 14 కోట్ల మందిని కొన్ని నెలలకే ఓటర్ జాబితా నుంచి తీసేశారని ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఓటు వేసిన 14 కోట్ల మందిని ఎన్నికల సంఘం ఆ తర్వాత తొలగించిందని, చట్టవిరుద్ధమైన ఓటర్లుగా ప్రకటించిందని, అప్పుడు ఆ ఎన్నికలు ఏవిధంగా చట్టబద్ధమవుతాయని ప్రశ్నించారు. ఈ పరిణామాలు ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు క్రమంగా ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారాయన్నారు.
ప్రజలతో ప్రత్యక్ష సంబంధమే అసలైన బలం
‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇంతకాలం ఉపయోగించిన సంప్రదాయ రాజకీయ సాధనాలతో ఆశించిన ఫలితాలు రాలేదు. మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు, బహిరంగ సభలు వంటి ప్రజల్లోకి వెళ్లే మార్గాలన్నీ విఫలమయ్యాయి. ప్రధాని మోదీ, ఆయన పార్టీ 24 గంటలూ టెలివిజన్, సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం, అనివార్యత ఏర్పడింది. ఈ క్రమంలో ఓ కీలక విషయాన్ని గుర్తించాం. వ్యవస్థలపై ఎంతటి నియంత్రణ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటమే అత్యంత శక్తిమంతమైన ఆయుధం. అందుకే కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల మధ్యకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టింది’’ అని రాహుల్ గాంధీ వివరించారు. రాజకీయాల్లో ప్రజల మాట వినడం అంటే కేవలం వారితో మాట్లాడటం కాదని, వారి సమస్యలు, ఆలోచనలు, భావాలను నిజంగా అర్థం చేసుకోవడమని తెలిపారు. ద్వేషం, కోపం, హింసతో కూడిన రాజకీయాలు ఎప్పటికీ విజయం సాధించలేవని, ప్రేమ, సత్యం, అహింస, కరుణ, పరస్పర గౌరవంతోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని అన్నారు. ఫాసిస్టు ధోరణులను ఎదుర్కోవడానికి ద్వేషం లేదా అణచివేత మార్గాలను అనుసరించాల్సిన అవసరం లేదని, తమ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల మద్దతుతోనే వాటిని ఓడించవచ్చనే విశ్వాసం వ్యక్తం చేశారు.
రాహుల్ నాయకత్వంలోనే మార్పు: రేవంత్
రాహుల్ నాయకత్వంలోనే మార్పును తీసుకురాగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు సంపన్నుల కోసం పనిచేయడం మానుకోవాలని, సామాన్యుల కోసం పని చేయాలని అన్నారు. భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు శక్తుల మధ్య పోరాటం జరుగుతోంది. ఒకటి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంటే.. మరొకటి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తోంది. మేం రాజ్యాంగం, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం. రెండో శక్తి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ప్రజలపై నియంతృత్వాన్ని రుద్దాలని చూస్తోంది. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు ఉండాలని మేం కోరుకుంటున్నాం. నచ్చిన కొన్ని వర్గాలకే ఓటు హక్కు కల్పించాలని వారు చూస్తున్నారు. మేం పర్యావరణాన్ని కాపాడాలనుకుంటుంటే... పర్యావరణాన్ని నాశనం చేయాలని వారు చూస్తున్నారు. పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని మేం కోరుకుంటున్నాం. తమ సంపన్న మిత్రులను మాత్రమే కాపాడుకోవాలని వాళ్లు చూస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని మేం కోరుతున్నాం. కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం కావాలని వారు చూస్తున్నారు. చర్చలు, సంప్రదింపులను మేం కోరుకుంటున్నాం. ఒకే వ్యక్తి నుంచి ఆదేశాలు రావాలని వారు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్న శక్తులు.. ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న మమ్మల్ని ఆపగలమనుకుంటే అది భ్రమే. ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్నంత కాలం ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు’’ అని తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అందరం ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందరమూ కలిసి పోరాడదామని భారత్ సమ్మిట్లో పాల్గొన్న ప్రతినిధులకు పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పోరాడితేనే విజయం సాధిస్తామని, దేశంలో ఈ పోరాటానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. ప్రతి పౌరునికీ ఓటు హక్కు కల్పించడానికి, దళితులు, మైనారిటీలు, ఓబీసీలకు సామాజిక న్యాయం కల్పించడానికి ఆయన పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News