ఓబీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంపై రాహుల్‌తో చర్చించా: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:30 PM
దేశవ్యాప్తంగా, తెలంగాణలో ఓబీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఢిల్లీ, నవంబర్ 10: దేశవ్యాప్తంగా, తెలంగాణలో ఓబీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈరోజు రాహుల్‌తో సమావేశమైన పీసీసీ చీఫ్.. భారత్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వెనుకబడిన తరగతులకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని రాహుల్‌కు వివరించినట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలను వివరించానన్నారు.
బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై చర్చ జరిగిందని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు. నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే భారత్ సమ్మిట్‌కు రాహుల్ వస్తున్నట్లు మహేశ్ కుమార్ తెలిపారు. భారత్ సమ్మిట్‌తో పాటు గిగ్ వర్కర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో వారితో సమావేశం నిర్వహించాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గిగ్ వర్కర్లను ఉద్దేశించి ఏఐసీసీ అగ్రనేత ప్రసంగించే అవకాశం ఉందన్నారు.
హైదరాబాద్‌లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిర్వహించనున్న సభపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు పీసీసీ చీఫ్ చెప్పారు. తెలంగాణలో మెగా బీసీ ర్యాలీ నిర్వహణకు ఆహ్వానించానని తెలిపారు. మంత్రులు, ఎంపీల మధ్య విభేదాలు, ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఏఐసీసీ అగ్రనేతతో సమావేశంలో చర్చ జరగలేదన్నారు. ఈ అంశాలను పార్టీ ఇన్ఛార్జ్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని వెల్లడించారు. నవంబర్ చివరినాటికి తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని స్పష్టం చేశారు.
సోనియా గాంధీ జీవిత విశేషాలతో వెలువడిన పుస్తకాన్ని మహేశ్ కుమార్ గౌడ్ స్వాగతించారు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధం, భారతీయ సంప్రదాయాలను స్వీకరించిన అంశాలను పుస్తకంలో ప్రస్తావించారన్నారు. సోనియాగాంధీ ఆత్మ కథ పుస్తకంపై తెలంగాణలో కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్‌లకు నిప్పు.. సీసీటీవీలో రికార్డైన దుండగుల దృశ్యాలు
భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ.. ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News