ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:24 AM
ప్రయాణికురాలి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కండక్టర్ ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
బ్యాంకు నుంచి రూ.కోటి బీమా: మంత్రి పొన్నం
హైదరాబాద్/గోషామహల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికురాలి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కండక్టర్ ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఉస్మానియా మార్చురీలో ఉన్న ప్రవళిక మృతదేహాన్ని బుధవారం ఆయన సందర్శించి నివాళులర్పించారు. మృతురాలి తల్లి విజయలక్ష్మిని ఓదార్చారు. ప్రభుత్వం తరఫున సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. మృతురాలి తల్లి విజలక్ష్మికి ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రభుత్వం, ఆర్టీసీ నుంచి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు.
అలాగే, బ్యాంకు నుంచి రూ.కోటి ప్రమాద బీమా అందిస్తామని చెప్పారు. కండక్టర్ మృతికి కారణమైన మహిళపై హత్య కేసు నమోదైందని, చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది పనితీరుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయాలే తప్ప ఇలా దాడులకు పాల్పడటాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రయాణికులు సంయమనంతో వ్యవహరిస్తూ ఆర్టీసీకి సహకరించాలని కోరారు. మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆరోగ్యం మెరుగుపడి తిరిగి విధులకు హాజరవుతారని భావించామని, ఇలా జరగడం బాధాకరమన్నారు. సిబ్బందిపై ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, యూనియన్ నేతలు గోపాల్, రఘు తదితరులు ప్రవళిక మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కండక్టర్ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు
స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఇక సులువుగా ఫైర్ ఎన్‌వోసీ!
7 గంటల్లో రూ.7.80 కోట్లు స్వాహా
Read Latest Telangana News And AP News And National News
And Telugu News