Share News

ధర్నాచౌక్‌ ఎత్తేసినవాళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా?

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:32 AM

ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కుల గురించి మాట్లాడుతన్న బీఆర్‌ఎస్‌ నేతలు గతంలో తమ పాలనలో అనుసరించిన విధానాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

ధర్నాచౌక్‌ ఎత్తేసినవాళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా?
Ponguleti Srinivas Reddy , Revanth Reddy

  • ఇప్పటికైనా బావ, బావమరుదులు భాష, తీరు మార్చుకోవాలి

  • ఢిల్లీలో నిరసనను అడ్డుకుంటున్నోళ్లు ఇక్కడ పాదయాత్రలు చేస్తారా?

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కుల గురించి మాట్లాడుతన్న బీఆర్‌ఎస్‌ నేతలు గతంలో తమ పాలనలో అనుసరించిన విధానాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ధర్నాలు, నిరసనలకు అవకాశం లేకుండా ఇందిరాపార్క్‌లో ధర్నాచౌక్‌ను ఎత్తేసిన బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంద ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొచ్చాక ధర్నా చౌక్‌ను పునరుద్ధరించిందని, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం కలిగించిందని చెప్పారు. నిరసనలను వ్యక్తపరిచినవారిని అణిచివేయించిన బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు.


ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకొనే బీఆర్‌ఎస్‌ నాయకులు, బావా-బావమరుదులు తాము మాట్లాడే భాషను, తీరును మార్చుకోవాలని హితవు పలికారు. తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం సచివాలయంలో గ్రూప్‌-1, కానిస్టేబుల్‌, ఎస్సై, తదితర పోస్టులకు పోటీపడే అభ్యర్థుల కోసం ‘పీఎన్‌ఆర్‌ యువనేస్తం’ పేరుతో ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాన్ని పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడారు. నవంబరు 2న హైదరాబాద్‌లో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షా పాదయాత్ర చేయనున్నారనే విషయమ్మీద స్పందిస్తూ ఢిల్లీలో నిరసనలకు ఆటంకాలు కలిగిస్తున్న వారే రాష్ట్రంలో పాదయాత్రలు చేపడుతున్నాయని ఎద్దేవా చేశారు.


సర్‌ ప్రక్రియతో ప్రజల ఓటు హక్కును తొలగిస్తున్నారని, ఓటు హక్కు పరిరక్షణ కోసం చేపట్టిన ఆందోళనల్లో భాగంగా ఢిల్లీలో 1న భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ, ఇండి కూటమి పిలుపునిచ్చాయన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు రైలు బోగీలను కేటాయించాలని కోరినా కేంద్రం అనుమతులివ్వలేదని విమర్శించారు. కాగా పీఎ్‌సఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ‘పీఎ్‌సఆర్‌ యువనేస్తం’ పేరుతో ఆన్‌లైన్‌ విధానంలో ఎంతమందికైనా ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఆర్సీ ఎగ్జామ్స్‌ సంస్థ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు బుధవారం నుంచి ఏడాది పాటు శిక్షణ అందుబాటులో ఉంటుందన్నారు. అవసరమైతే శిక్షణ కాలాన్ని పొడిగిస్తామని చెప్పారు.


త్వరలో మరో 15వేల ఉద్యోగాలు

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 72వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, త్వరలో మరో 15వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పొంగులేటి వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడుతాయని చెప్పారు. కాగా దీపావళి పండుగను పురస్కరించుకుని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌ సమ్మతించారని మంత్రి తెలిపారు. రేవంత్‌ను కలిసిన సమయంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం చర్చకు వచ్చిందని చెప్పారు. కాగా, తన జన్మదినం సందర్భంగా మంత్రి పొంగులేటి బుధవారం సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటికి.. రేవంత్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:32 AM