కవిత చేతుల్లో బీఆర్‌ఎస్ అక్రమాస్తుల బండారం
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:02 AM
బీఆర్‌ఎస్, ఎత్తాయిన (హరీశ్‌రావు) అక్రమాస్తుల వివరాలన్నీ కేసీఆర్ కుమార్తె కవితకే పూర్తిగా తెలుసునని, వాటి గుట్టు ఆమె ద్వారానే బయటకువస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చేతనయితే ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆమె అడిగే ప్రశ్నలకు ఎత్తాయిన సమాధానం చెప్పాలి..
బీఆర్‌ఎస్‌కు రూ.1,489 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?
దళితులు, రాష్ట్ర ప్రజలను కొల్లగొట్టి కూడబెట్టినవే అవి
22ఏ నిషేధిత జాబితా పేరుతో భూదోపిడీకి పాల్పడ్డారు
అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందు 580 ఎకరాలకు ఓఆర్‌సీలు
వాటిని పొరుగు రాష్ట్ర రాజులకు కట్టబెట్టారు
ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చలేదు
22ఏ సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్, ఎత్తాయిన (హరీశ్‌రావు) అక్రమాస్తుల వివరాలన్నీ కేసీఆర్ కుమార్తె కవితకే పూర్తిగా తెలుసునని, వాటి గుట్టు ఆమె ద్వారానే బయటకువస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చేతనయితే ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, ఎంపీ వేంనరేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సొంతింటి ఆడబిడ్డకే న్యాయం చేయలేని మీరు.. రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలను చూసుకుంటామంటే నమ్ముతారా? అని నిలదీశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనిరీతిలో బీఆర్‌ఎస్‌కు రూ.1,489 కోట్ల నిధులు ఎలా వచ్చాయో? ఆ పార్టీ నేతలు ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులు, రాష్ట్ర ప్రజలను కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అమాయక ప్రజలను, రైతులను 22ఏ నిషేధిత జాబితా పేరుతో బెదిరించి, ధరణి ద్వారా విలువైన భూములు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి అన్నారు. ఇప్పుడు ఆ భూములను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దీన్ని ఉపేక్షించబోమన్నారు. ఎన్నికలకు 3 నెలల ముందు 580 ఎకరాల భూములకు ఓఆర్‌సీలు (స్వాధీన హక్కుపత్రం) ఇచ్చి,, పొరుగు రాష్ట్రానికి చెందిన రాజులకు కట్టబెట్టారని ఆరోపించారు. దాని వెనుక పొడుగాటి నేత ఉన్నారని, ఆధారాలతోనే ఈ విషయాలు మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు. 22ఏ సమస్యలను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎ్‌స-బీజేపీ ఒకే తాను ముక్కలని అన్నారు.
మాది సంక్షేమ ప్రభుత్వం..
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని రూ.8.21 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత అప్పులకు తాము వడ్డీలు చెల్లిస్తూ, మరోవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. 2023లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోయామని అంగీకరించారు. ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నామని, అన్నింటినీ అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ తమ ప్రభుత్వం వచ్చాక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు సన్నబియ్యం, 15 లక్షల రేషన్‌కార్డులను మంజూరు చేసినట్టు చెప్పారు. త్వరలోనే 3 లక్షల మందికి కొత్తగా పింఛన్‌లు ఇవ్వబోతున్నామని చెప్పారు. నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌తో పాటు, ఒక్కొక్కటి రూ.200 కోట్లతో సమీకృత గురుకులాలను నిర్తిస్తున్నామని వెల్లడించారు. దొర పాలనలో వరి వేస్తే ఉరి అన్నారని.. తమ ప్రభుత్వంలో వరి పండించిన రైతుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఈ 1000 రోజుల్లో రైతులకు పలు పథకాల కింద 1.76లక్షల కోట్ల ప్రయోజనాలను అందించామన్నారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌లు ఇవ్వబోతున్నట్టు చెప్పా రు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసి తీరుతామన్నారు. తెలంగాణ ఇ చ్చిన సమయంలో కుటుంబ సమేతంగా వెళ్లి సోనియాను కలిసి దేవత అన్నవాళ్లు, ఇప్పుడు ఆమె తనయుడు రాహుల్‌ను ఎక్కడ చచ్చాడని అంటున్నారని.. ఇంత సంస్కారహీనంగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు క్షమించబోరన్నారు. అధికారంలోకి వస్తామంటూ బీఆర్‌ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆ పదవికి అర్హుడని తాము అనుకోవడంలేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్
శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News