మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్
ABN , Publish Date - Sep 02 , 2026 | 07:24 PM
మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 02: మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆర్థిక సాయం, ఉపాధి పరికరాలను పంపిణీ చేశారు. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అలాగే, తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీకి చెందిన 13 మందికి రూ. 60 వేల విలువైన జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన కుట్టు మిషన్లు, జనరేటర్లు, టూల్ కిట్లను సద్వినియోగం చేసుకొని మహిళలు, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
మైనారిటీల సంక్షేమంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. ముస్లింల హజ్ ఏర్పాట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 7 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. పాతబస్తీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కమ్యూనిటీ పెద్దలు యువతకు సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. చేపలు పట్టడం నేర్పించినట్లుగా యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించి వారికి తమకు తాముగా, ఇతరులకు అండగా నిలిచేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
నిధుల డిమాండ్ల విషయమై స్పందిస్తూ.. తాను టెస్ట్ ప్లేయర్ లాంటివాడినని, పదవిలో ఉన్నంతకాలం ప్రజల సంక్షేమం కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తానని తేల్చిచెప్పారు. టీజీఎంఎఫ్‌సీ (TGMFC) చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్‌తో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్
కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్