22ఏలో దొరల దోపిడీ
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:23 AM
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ సర్వే నెం.271లోని 4-32 ఎకరాల అసైన్డ్ భూమిని హరీశ్ రావు పరపతిని ఉపయోగించుకుని ఆయన మామ 1.8.2023న 22ఎ నుంచి తొలగించి పట్టా భూమిగా మార్పు చేసుకున్నారు.
గంటల్లో జాబితా నుంచి తీసి పెట్టారు..
ధరణిలో సీక్రెట్ లాక్స్.. అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు
దొరవారి ధరణికి బలైన వందలాదిమంది
ఎన్నికల ఖర్చు కోసం మెదక్ జిల్లాలో 372
ఎకరాలు ఆంధ్రా బడా కంపెనీకి కట్టబెట్టారు
మాకు వారసత్వంగా వచ్చిన సమస్యల్లో ఇదొకటి
జాబితాలో మేం కొత్తగా ఎకరా కూడా చేర్చలేదు
47,440 ఎకరాలను పరిష్కరించి తగ్గించాం
రూపాయి జీతంతో చేస్తున్న నేను రాజీనామా చేయాలా!?
21 కోట్లు తీసుకుని అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాలా?: పొంగులేటి
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ సర్వే నెం.271లోని 4-32 ఎకరాల అసైన్డ్ భూమిని హరీశ్ రావు పరపతిని ఉపయోగించుకుని ఆయన మామ 1.8.2023న 22ఎ నుంచి తొలగించి పట్టా భూమిగా మార్పు చేసుకున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లాపూర్‌లో 569-05 ఎకరాల ఇనాం భూ కుంభకోణం చేశారు. 2023 ఎన్నికలకు ముందు అక్టోబరు 5న 372 ఎకరాలను ఆంధ్ర బడా కంపెనీకి కట్టబెట్టారు. వాళ్లిచ్చిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక ఆ అక్రమ ఉత్తర్వులను రద్దు చేశాం.... గత ప్రభుత్వ హయాంలో కొల్లగొట్టిన భూముల వివరాల్లో కొన్ని సభ ముందు ఉంచుతున్నానంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాలివి!
ధరణితో నాటి దొరలు భూములను దోచేశారని, 22ఏ నిషేధిత జాబితాను ఇష్టారాజ్యంగా వాడుకున్నారని, ఇప్పుడు భూ భారతిపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. గంటల వ్యవధిలో అనేక భూములను ఆ జాబితా నుంచి తీసేసి.. రిజిస్ట్రేషన్లు అయ్యాక తిరిగి ఆ జాబితాలో పెట్టేశారని తెలిపారు. 22ఏపై శాసనసభలో జరిగిన స్వల్పకాల చర్చకు శనివారం అసెంబ్లీలో ఆయన సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు హరీశ్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు గతంలో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను వీడియో క్లిప్పింగ్ ద్వారా చూపిస్తూ సమాధానం ఇచ్చారు. 2023 ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా అనేక భూ ఆక్రమణలకు పాల్పడ్డారని వెల్లడించారు.
ఆయన వెల్లడించిన మరిన్ని వివరాలు..
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలోని సర్వే నెం.58,59 లోని 546ఎకరాలను 22ఏ నుంచి తొలగించి సిరిపురం సత్యనారాయణప్రసాద్, సిరిపురం జ్యోతి, సత్యనారాయణ ప్రసాద్, సిరిపురం శరత్‌చంద్రకు కట్టబెట్టేశారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నెం.186 నుండి 189లలో 29 ఎకరాల భూదాన్ భూమిని బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎం. వాసు, ఎం. వెంకట రాజు తదితరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని శంకర్‌హిల్స్‌లో సర్వే నెం.111 నుండి 191 వరకూ మొత్తం 460 ఎకరాలు ఉన్నాయి. ఒకాయన 1983లో వాటిని కొనుగోలు చేశారు. 3,333 ప్లాట్లుగా చేసి అమ్మారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ పెద్దల జోక్యంతో ఎకరాల లెక్కన మళ్లీ ఈ భూమిని ఇతరులకు కట్టబెట్టేశారు. ఈ భూముల రిజిస్ట్రేసన్ కోసం 22ఏ జాబితా నుంచి వీటిని ఒక గంటపాటు తొలగించారు. తర్వాత మళ్లీ 22ఏలో పెట్టేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరు మీద కూడా ఇందులో 5 ఎకరాల రిజిస్ట్రేషన్ ఉంది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూర్ గ్రామ సర్వే నం.44లో 40 ఎకరాల అసైన్డ్ భూమిని గత ప్రభుత్వ పెద్దలు 22ఎ నుంచి తీసేయించి అక్రమంగా వేరే వారికి రిజిస్ట్రేషన్లు చేసేశారు.
ప్రతి అంగుళం భూమికి క్యూఆర్ కోడ్‌తో లెక్క
శకుని మామ ప్రణాళిక వేస్తే.. అబద్దాల అగ్గిపెట్టెల రావు దాన్ని అమలు చేసి పేదల అసైన్డ్ భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములను కొట్టేశారని పొంగులేటి చెప్పారు. ‘‘తెలంగాణకు చెందిన 2.49 కోట్ల ఎకరాల భూమిని విదేశీ సంస్థ టెరాసిస్‌కు ధరణి పేరుతో తాకట్టు పెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రిదే. ధరణిని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి సైతం రిజిస్ట్రేషన్లు చేశారు. భూములు అమ్ముకోలేక అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వందలాదిమంది దొరవారి ధరణికి బలయ్యారు. ధరణిలోని అనేక మాడ్యుల్స్‌కు సీక్రెట్ లాక్‌లు ఏర్పాటు చేశారు. ఒకరిద్దరు రెవెన్యూ అధికారులు వారి మాట వినలేదని ఏకంగా వీఆర్‌ఏ, వీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారు’’ అని వివరించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ధరణిలో 2.46 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ధరణి నుంచి భూభారతికి మార్చే సమయానికి మరో మూడు లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటిని పరిష్కరిస్తున్నామని చెప్పారు. నిషేధిత జాబితా సమస్యను కేసీఆర్ పదేళ్ల పాలనలో పరిష్కరించకపోవడం వల్లే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ‘‘ప్రతి సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాం. ప్రతి అంగుళం భూమిని రికార్డుల్లోకి ఎక్కిస్తున్నాం. ప్రతి అంగుళం భూమికి క్యూఆర్ కోడ్‌తో కూడిన మ్యాప్ ఇస్తాం. అందరి సూచనలతో 22ఎ జాబితాను సరిచేస్తున్నాం. పేదవాడికి కష్టం కలగకుండా ఏవిధంగా చేస్తే మంచి జరుగుతుందో పరిశీలించి.. ఆ తీపి కబురు త్వరలో చెబుతాం’’ అని వివరించారు.
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా పట్టాలు లేని వారి సమస్యను భూ భారతితో పరిష్కరించామని, కేసముద్రం మండలం నారాయణపురంలో రైతులకు 1600 ఎకరాలకు, సూర్యాపేట మండలంలో 3,450 ఎకరాలకు క్యూఆర్ కోడ్‌తో సర్వే చేసి ప్రతి రైతుకు పాస్‌బుక్‌లు ఇచ్చామని తెలిపారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రాపురంలో గిరిజనులు, గిరిజనేతరుల సమస్యను గుర్తించి పది వేల ఎకరాలు పంపిణీ చేయబోతున్నామని, పాల్వంచలో 4,500 ఎకరాలు సర్వే ద్వారా రైతులకు అప్పగించనున్నామని, సత్తుపల్లి నియోజకవర్గంలోనూ 8 వేల ఎకరాల సర్వే చివరి దశలో ఉందని వివరించారు. ప్రతి జిల్లాలో సర్వే పూర్తి అయితే గట్ల పంచాయితీలు మాయమవుతాయన్నారు. ఇందుకోసం అధిక సంఖ్యలో సర్వేయర్లను నియమించుకుంటున్నామన్నారు. సీక్రెట్ లా క్‌లు లేకుండా చేశామన్నారు. ధరణిలో 80 మాడ్యుల్స్ ఉంటే ప్రస్తుతం వాటిని ఐదు చేశామన్నారు.
మేం కొత్తగా చేర్చిందేమీ లేదు
‘‘22ఏలో పెట్టింది మేము కాదు. పీవోటీ చట్టం ప్రకారం వాటిలోనే ఉన్నాయి. పరిష్కరించాల్సింది పోయి మామీద నిందలేస్తున్నారు. నిషేధిత భూముల జాబితాను బహిరంగ పరచాలని కోర్టు ఆదేశించింది. అభ్యంతరాలు వస్తే పరిష్కరించడానికి కమిటీ ఏర్పాటు చేయాలంది. ఈ క్రమంలోనే దాన్ని పబ్లిక్ డోమైన్‌లో పెట్టాం. జీఓ నెంబర్ 121 ప్రకారం ఆనాటి నిషేధిత జాబితాలో ఉన్న అదే కాపీని కలెక్టర్లు అప్‌లోడ్ చేశారు. కొత్తగా చేర్చిందేమీ లేదు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. పరిష్కారమైన కొన్ని ఇందులో ఉండటం ఆందోళన కలిగించింది. వాటిని పరిష్కరిస్తున్నాం.
ప్యూర్ పరిధిలో సమస్యను పరిష్కరించాం. ఫిర్యాదు వచ్చిన తర్వాత ఐదు రోజుల్లోనే సరిదిద్దుతున్నాం. మేం సరిదిద్దడం ప్రారంభించిన తర్వాతే వారు ఆరోపణలు చేస్తున్నారు’’ అని మంత్రి పొంగులేటి వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ నిషేధిత జాబితాలో 47,440 ఎకరాలు తగ్గాయని తెలిపారు. గతంలో పాస్ బుక్‌లు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధును దోచుకున్న దొరల లెక్కలన్నీ ఇప్పుడు బయట పడుతున్నాయని తెలిపారు. నాగార్జునసాగర్ మండలంలో 13 గ్రామాల్లో సర్వే చేస్తే 14 వేల ఎకరాలు తేలిందని, ఇందులో 4 వేల ఎకరాల్లో బోగస్ పాస్‌బుక్‌లు ఉన్నాయని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉండి 22ఏ పేరిట కడుపులు కొట్టారని, ధరణి పేరిట దందాలు చేశారని, దీనిపై మాట్లాడే ధైర్యం లేక చర్చలో పాల్గొనకుండా ఉండేందుకు గొడవలు సృష్టించి పారిపోయారని ఆరోపించారు.
రూపాయి జీతంతో పని చేస్తున్నా
బీఆర్‌ఎస్ నేతలు దురుద్దేశంతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పొంగులేటి చెప్పారు. ‘‘చీము, నెత్తురు, సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలని నన్ను అడుగుతున్నారు. ఇన్నేళ్లు అధికారాన్ని అనుభవించి,ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన వారు రాజీనామా చేయాలి కదా!? నేను కేవలం ఒక్క రూపాయి జీతం తీసుకుని అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రభుత్వ జీతం, ఇతర అలవెన్సులు రూ.21 కోట్లు తీసుకుని అసెంబ్లీకి, ప్రజలకు ముఖం చాటేసిన కేసీఆర్ రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తూ భూ సమస్యలను పరిష్కరిస్తున్న తాను రాజీనామా చేయాలా..? అసెంబ్లీలోకి అడుగు పెట్టని కేసీఆర్ రాజీనా చేయాలా? అని ప్రశ్నించారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఆస్తులను పెంచుకోవడం మీదే శ్రద్ద పెట్టారని విమర్శించారు. అధికారంలో ఉంటే అవినీతి, ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్‌మెయిల్ హరీశ్ నైజమన్నారు. ధరణి వంటి దరిద్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ కిందపడి పోర్లాడినా మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని స్పష్టం చేశారు. చర్చ పెట్టాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అడుగుతున్నారని, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే, మీరు స్ర్కిప్ట్ రాస్తే వాళ్లు చదివి.. వాళ్లు రాస్తే మీరు చదవడం మానుకోవాలని హితవు పలికారు.
ప్రతి సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాం. ప్రతి అంగుళం భూమిని రికార్డుల్లోకి ఎక్కిస్తున్నాం. క్యూఆర్ కోడ్‌తో కూడిన మ్యాప్ ఇస్తాం. 22ఎ జాబితాను సరిచేస్తున్నాం. పేదవాడికి కష్టం కలగకుండా ఏ విధంగా చేస్తే మంచి జరుగుతుందో పరిశీలించి.. ఆ తీపి కబురు త్వరలో చెబుతాం.
- మంత్రి పొంగులేటి
ఈ వార్తలు కూడా చదవండి:
సురేఖనెందుకు తొలగించారు!?
Read Latest AP News And Telangana News And International News And Telugu News