ఇరవై ఏళ్లుగా వెట్టి చాకిరి
ABN , Publish Date - Sep 13 , 2026 | 02:16 AM
ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నా, వేతనంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయం పెరగకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఏళ్ల తరబడి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తమ బతుకులు దయనీయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలని ఏళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేకుండా పోతున్నది.
- పెరగని వేతనం.. కరువైన ఉద్యోగ భద్రత
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నా, వేతనంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయం పెరగకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఏళ్ల తరబడి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తమ బతుకులు దయనీయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలని ఏళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేకుండా పోతున్నది. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా తమ విషయంలో హామీలకే పరిమితం అవుతున్నారే తప్ప ఆచరణలోకి రావడం లేదంటున్నారు. ఉదయం, సాయంత్రం వరకు సేవలు అందిస్తున్నా తమ గురించి ఆయా ప్రభుత్వాలు ఆలోచన చేయడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు. కరువు కాటకాల వల్ల సాగు నీరు కరువై గ్రామాల్లో కూలీలు, వ్యవసాయ కూలీలు, రైతులు వలస వెళ్లకుండా ఉండేందుకు 2005-06లో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుక వచ్చింది. ఈ పథకాన్ని చట్టబద్ధత కల్పించింది. పథకం అమలు కోసం కేటాయించే నిధుల్లో తప్పరిసరిగా 60 శాతం కూలీల వేతనాల కోసం, 40 శాతం నిధులను మెటీరియల్ కాంపోనెంట్ కింద విధించే విధంగా చట్టం చేశారు. అలాగే జాబ్ కార్డులు పొందిన కుటుంబాలకు ఏడాదికి తప్పనిసరిగా 100 రోజుల పనిదినాలను కల్పించాలని చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుతం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వీబీజీ రామ్‌జీగా మార్పు చేశారు. అలాగే 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచారు. గ్రామాల్లో కూలీలకు జాబ్ కార్డులు జారీ చేశారు. కూలీల సంఖ్యను బట్టి గ్రామాల్లో చేపట్టే పనులను గుర్తించి ప్రతిపాదనలు, అంచనాలను సిద్ధం చేసి క్రమంగా పనులు చేపడుతారు. ఈ పనులను గ్రామాల్లో పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో 182 మంది పనిచేస్తున్నారు.
ఫ అరకొరగా వేతనాలు
ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లకు మొదట నెలకు 2 వేల రూపాయల వేతనం మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత 5 వేలకు, ఆ తర్వాత 6 వేలకు పెంచారు. ప్రస్తుతం 11,900 రూపాయలు ఇస్తున్నారు. ఇందులో కూడా మూడు కేటగిరీలకు చెందిన వాళ్లు ఉన్నారు. మొదటి కేటగిరీ వాళ్లకు నెలకు 11,900, రెండవ కేటగిరీకి చెందిన వారికి 10,900, మూడవ కేటగిరీకి చెందిన వారికి 8,900 రూపాయలు ఇస్తున్నారు. తమకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పలుసార్లు పోరాటాలు చేశారు. విధులు బహిష్కరించి సమ్మె నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరిస్తానని, గౌరవప్రదమైన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయమే క్షేత్రస్థాయికి వెళ్లి పని చేసే చోట కూలీల పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక యాప్ ద్వారా పనికి వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు వారి ఫొటోలు తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఎంత మేరకు పని చేశారో కొలతలు తీసి వివరాలను నమోదు చేసి పంపించాల్సి ఉంటుంది. కూలీల బాగోగులను కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు చూసుకోవాల్సి ఉంటుంది. వెట్టి చాకిరి చేస్తున్నా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను గుర్తించడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసరాలు, కూరగాయల, తదితర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే వేతనం ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. కనీసం నెలకు 25 వేల రూపాయల వేతనం ఇస్తేనే గానీ కుటుంబాలను నెట్టుకురావడం కష్టమని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు నెలకు 25 వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫ భారంగా కుటుంబ పోషణ
- శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్, గుంపుల గ్రామం
వీబీజీ రామ్‌జీ ద్వారా పొద్దంతా కూలీలకు సేవలు అందిస్తున్నా కూడా, తమకు సరిపడా వేతనాలు ఇవ్వడం లేదు. ప్రైవేట్‌గా ఎక్కడ పని చేసినా కూడా నెలకు 20 వేల రూపాయలకు తక్కువ ఇవ్వరు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, ఆసుపత్రులు, పిల్లల చదువుల కోసం ఫీజులు, ఇతరత్రా అన్ని రకాల ఖర్చులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కానీ ఆ దిశగా వేతనాలు పెంచడం లేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నెలకు 25 వేల వేతనం ఇవ్వాలి.