Share News

బుస్‌... బుస్‌.. సిటీలో 54 శాతం విష సర్పాలే..

ABN , Publish Date - May 07 , 2026 | 08:54 AM

హైదరాబాద్ నగరంలో స్నేక్‌ స్నాచర్స్‌ రెస్క్యూలో పట్టుబడుతున్న పాముల్లో 54శాతం విష సర్పాలే అని సీఎస్ఐఆర్‌ - సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ (ఎఫ్‌ఓఎస్‌) హైదరాబాద్‌ అధ్యయనం వెల్లడించింది.

బుస్‌... బుస్‌.. సిటీలో 54 శాతం విష సర్పాలే..
Snakes

  • రెస్క్యూలో కాపాడుతున్నవి వాటినే..

  • అందులోనూ 47.5 నుంచి 50 శాతం తాచుపాములే

  • జెర్రిపోతులు 24 నుంచి 27 శాతం

  • హైదరాబాద్‌లో 232 హాట్‌స్పాట్లు

  • సీఎస్ఐఆర్‌-సీసీఎంబీ, ఎఫ్‌ఓఎస్‌ అధ్యయనం స్పష్టం

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్ నగరంలో స్నేక్‌ స్నాచర్స్‌ రెస్క్యూలో పట్టుబడుతున్న పాముల్లో 54శాతం విష సర్పాలే అని సీఎస్ఐఆర్‌ - సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ (ఎఫ్‌ఓఎస్‌) హైదరాబాద్‌ అధ్యయనం వెల్లడించింది. 2013-22 (పదేళ్ల)లో 55,467 పాములను పట్టుకున్నారు. వాటి వివరాలను తాజాగా గ్లోబల్‌ ఎకాలజీ అండ్‌ కన్జర్వేషన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


పాములు తారసపడుతున్నాయ్‌..

పట్టణీకరణ, స్థానిక వాతావరణ ప్రభావం కారణంగా హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలలో పాములు తారసపడే సంఘటనలు ఇటీవల గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన పదేళ్లలో ఏటా 8-10శాతం వృద్ధి ఉంది. భూ వినియోగ విధానం, పట్టణీకరణ, పెరిగిన రెస్క్యూ యాక్టివిటీలు దీనికి కారణం. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రెస్క్యూ చేసిన పాములలో 54శాతం విషసర్పాలే అని, వీటిలోనూ తాచుపాములు (కోబ్రాలు) 47.5 శాతానికి పైగా ఉంటున్నాయి. విష సర్పం కాని జెర్రిపోతు (ర్యాట్‌ స్నేక్‌)ల సంఖ్య కూడా నగరంలో ఎక్కువే.. ఇవి 27శాతానికి పైగా ఉంటున్నాయని ఎఫ్‌ఓఎస్‌ సభ్యులు వెల్లడిస్తున్నారు. జనసాంద్రత అధికంగా కలిగిన పట్టణ వాతావరణంలో ఉంటున్నాయి. పాముల పరంగా హైదరాబాద్‌లో 232 హాట్‌స్పాట్స్‌ ఉన్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. వీటిలో దమ్మాయిగూడా, వనస్థలిపురం, మియాపూర్‌, మణికొండ లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ హాట్‌స్పాట్స్‌ అన్నీ వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాలేనని నివేదిక స్పష్టం చేసింది.


city3.2.jpg

అక్టోబర్‌లో ఎక్కువ

నగరంలో పాములు ఎక్కువగా జూలై-నవంబర్‌ మధ్య కాలంలో కనిపిస్తుండగా అక్టోబర్‌లో అత్యధికంగా దర్శనమిస్తున్నాయని ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. మేటింగ్‌, గుడ్లు పొదిగేందుకు అనుకూలమైన సమయం ఇదేనని పేర్కొన్నారు.

రెస్క్యూ పరంగా ఏటా 8-12శాతం వృద్ధి

సినాంత్రోపైజేషన్‌ (అటవీ జంతువులు మనుషులతో పాటుగా కలిసి ఉండటం) కు సాక్ష్యంగా ఈ అధ్యయనం నిలుస్తుంది. నగరంలో పాముల రెస్క్యూ పరంగా ఏటా 8-12శాతం వృద్ధి కనిపిస్తుంది.

  • అవినాష్‌ విశ్వనాథన్‌, ఎఫ్‌ఓఎస్‌


ఎలుకల సంఖ్య తగ్గించడంలో కీలకం

నగర వాతావరణంలో ఎలుకలు లాంటి వాటి సంఖ్య నియంత్రణలో పాములు కీలకం. ముఖ్యంగా జెర్రిపోతులాంటివి క్షీణిస్తే అవి ఎలుకల పెరుగుదలకు దారి తీయడంతో పాటుగా ఊహించని విపత్తులకూ దారి తీయొచ్చు.

  • సీఎస్ఐఆర్‌-సీసీఎంబీ లీడ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కార్తికేయన్‌ వాసుదేవన్‌


ఈ వార్తలు కూడా చదవండి:

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Read Latest Telangana News and National News

Updated Date - May 07 , 2026 | 08:54 AM