సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ
ABN , Publish Date - May 06 , 2026 | 05:31 PM
టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు.
చెన్నై: టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో తక్షణం ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.
బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను విజయ్ కలుసుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, పలు పార్టీలుకూడా తమతో చేతులు కలుపనున్నాయని గవర్నర్‌కు విజయ్ వివరించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకుంటానని విజయ్ వివరించినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీవీకే వద్ద ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విజయ్ రెండు సీట్లలో గెలవడంతో ఒక సీటును వదులుకోవడం అనివార్యం. దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్టయింది. కాంగ్రెస్ బలం కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం.
ఏఐడీఎంకే 47 సీట్లలో గెలవగా, అందులోని ఒకవర్గం టీవీకే వైపు మొగ్గుచూపుతోంది. పీఎంకే-4, ఐయూఎంఎల్-2, సీపీఐ-2, సీపీఎం-2, డీఎండీకే, ఐఎంఎంకే చెరో సీటు కలిగి ఉన్నాయి. టీవీకేకు చిన్న పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశాలు బలంగానే ఉన్నాయి. అయితే అధికారికంగా మద్దతు ఇస్తేనే సంఖ్యాబలాన్ని విజయ్ చూపించుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. గవర్నర్‌ను కలిసి విజయ్
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు