Share News

విజయ్‌కి అధికారికంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్..

ABN , Publish Date - May 06 , 2026 | 12:54 PM

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే(TVK) పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు ప్రకటించింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు తెలుపుతూ ఏఐసీసీ తమిళనాడు ఇన్‌ఛార్జ్ గిరీశ్ చోడంకర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

విజయ్‌కి అధికారికంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్..

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే(TVK) పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు ప్రకటించింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు తెలుపుతూ ఏఐసీసీ తమిళనాడు ఇన్‌ఛార్జ్ గిరీశ్ చోడంకర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మతతత్వ శక్తులను కూటమిగా దూరంగా ఉంచాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ మద్దతు ఇస్తున్నట్లు గిరీశ్ చోడంకర్ వెల్లడించారు.


తమిళనాడులో లౌకిక, అభ్యుదయ, సంక్షేమ ప్రభుత్వాన్ని అందించడమే తమిళనాడు ప్రజల తీర్పు ఉద్దేశమని గిరీశ్ వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే కాకుండా భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లోనూ టీవీకేతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలకు కాంగ్రెస్- టీవీకే పొత్తు తెరలేపినట్లు అయ్యింది.


ఏఐసీసీ ప్రకటన..

'తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు అందించాలని భారత జాతీయ కాంగ్రెస్‌ను అధికారికంగా కోరారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీవీకేకి తమ పూర్తి మద్దతు అందించాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ శాసనసభ పక్షం నిర్ణయించాయి. భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని ఏ మతతత్వ శక్తులను కూడా ఈ కూటమిలో చేర్చుకోకుండా టీవీకే దూరంగా ఉంచాలి. ఈ షరతుపైనే మా మద్దతు ఆధారపడి ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లోనూ, దశాబ్దాల్లోనూ పెరియార్‌ సామాజిక న్యాయ ఆదర్శాలకు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగ ఆదర్శాలకు దృఢమైన నిబద్ధతతో కట్టుబడి ఉంటాం. తమిళనాడులో పెరుంతలైవార్ కామరాజ్ హయాం నాటి రోజులను తిరిగి తీసుకురావడానికి టీవీకే, తమిళనాడు కాంగ్రెస్ మధ్య ఏర్పడిన ఈ కూటమి కృషి చేస్తుంది' అని ప్రకటనలో కాంగ్రెస్ ప్రస్తావించింది.


ఈ వార్తలు కూడా చదవండి

తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా.! మరి ఆ స్థానం ఎవరికి?

కామాంధుడిని ఎన్‌కౌంటర్ చేసిన యూపీ పోలీసులు..

Updated Date - May 06 , 2026 | 01:19 PM