కామాంధుడిని ఎన్‌కౌంటర్ చేసిన యూపీ పోలీసులు..
ABN , Publish Date - May 06 , 2026 | 12:33 PM
ఓ కామాంధుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపేశారు. ఏడేళ్ల బాలుడిపై హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్: ఓ కామాంధుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపేశారు. ఏడేళ్ల బాలుడిపై హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ చేశారు. పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై కాల్పులకు తెగపడ్డాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపగా కామాంధుడు హతమయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
మంగళవారం నాడు హర్దోయ్ జిల్లా మతియమౌలోని మొక్కజొన్న పొలంలో ఏడేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. చిన్నారిని అపహరించిన మెహనూర్ (32) అత్యాచారం చేశాడు. అనంతరం హత్య చేసి మృతదేహాన్ని అక్కడే పడేశాడు. ఈ నేరాన్ని లైంగిక దాడిగా కాకుండా డబ్బుల కోసం చేసిన కిడ్నాప్‌గా చిత్రీకరించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఈ మేరకు దొంగిలించిన సిమ్ కార్డు సహాయంతో బాధిత కుటుంబానికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే, వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ మేరకు మెహనూర్‌పై రూ.50 వేల రివార్డును పోలీసులు ప్రకటించారు. అయితే, హర్దోయ్ జిల్లా మల్లావన్ ప్రాంతంలో నిందితుడు మెహనూర్ ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అతన్ని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్త బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు ఉన్న ప్రాంతానికి చేరుకుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. ఈ సందర్భంగా మెహనూర్ ఏకంగా పోలీసులపైకే కాల్పులకు తెగపడ్డాడు. కామాంధుడి దాడిలో సీనియర్ ఎస్ఓజీ అధికారి రాజేశ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.
ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపగా.. మెహనూర్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. అతని మృతదేహం వద్ద రెండు తుపాకులు దొరికినట్లు వెల్లడించారు. నిందితుడిని కన్నౌజ్ జిల్లావాసిగా గుర్తించినట్లు చెప్పారు. అతనికి నేర చరిత్ర ఉందని.. పలు జిల్లాల్లో దాదాపు పన్నెండు కేసులు మెహనూర్‌పై నమోదైనట్లు ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన అన్నాడీఎంకే షణ్ముగం వర్గం..?
ప్రజాప్రతినిధుల పేర్ల ముందు గౌరవ పదాలు తప్పనిసరి: అలహాబాద్ హైకోర్టు