Share News

అస్తిత్వానికి ఉస్మా‘నయా’ రూపం!

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:43 AM

అద్దంలో కనిపించే రూపం ఒకటి.. మనసులో తనను తాను చూసుకునే రూపం మరొకటి!.. బయటికి కనిపించే శరీరానికి, అంతరంగంలో కోరుకునే గుర్తింపునకు మధ్య నిత్యం సంఘర్షణే..

అస్తిత్వానికి ఉస్మా‘నయా’ రూపం!
Osmania Hospital

  • ఉస్మానియా ఆస్పత్రిలో లింగమార్పిడి చికిత్సలు

  • పురుషులుగా మారాలనుకున్న అమ్మాయిలూ ఎక్కువే!

  • ఒక్కొక్కరికి పది రకాల శస్త్రచికిత్సలు, హార్మోన్‌ థెరపీలు

  • రూ.20 లక్షల వరకూ ఖర్చు.. అయినా ఉచితమే!

  • లింగ మార్పిడి కోసం వేచి ఉన్న 400 మంది!

మంగళ్‌హాట్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): అద్దంలో కనిపించే రూపం ఒకటి.. మనసులో తనను తాను చూసుకునే రూపం మరొకటి!.. బయటికి కనిపించే శరీరానికి, అంతరంగంలో కోరుకునే గుర్తింపునకు మధ్య నిత్యం సంఘర్షణే.. అలాంటి వారు తమ సంఘర్షణ నుంచి బయటపడేందుకు లింగమార్పిడిని ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారికి ఆర్థిక భారం అవరోధంగా మారకుండా.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సలను ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి ఉచితంగా లింగమార్పిడి శస్త్రచికిత్సలు అందిస్తోంది. ఇప్పటికే 19 మందికి విజయవంతంగా ఆపరేషన్లు చేయగా.. మరో 400 మంది తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.


మొత్తం ప్రక్రియకు రెండేళ్ల దాకా పట్టొచ్చు..

లింగమార్పిడి ఒక్క ఆపరేషన్‌తో ముగిసిపోయేదో, కోరుకున్నప్పుడు ఆస్పత్రికి వెళ్లి చేయించేసుకో గలిగేదో కాదు. కౌన్సెలింగ్‌, వైద్య పరీక్షలు, హార్మోన్‌ థెరపీ, అవసరాన్ని బట్టి పలు శస్త్రచికిత్సలు.. ఇలా అనేక దశలు ఉంటాయి. ఉస్మానియా ఆస్పత్రిలో 2023 నుంచి ప్రతి బుధవారం ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. లింగమార్పిడి చేయించుకోవాలని కోరుకునేవారు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యులు వారి వివరాలు తీసుకుని పరిశీలిస్తారు. హార్మోన్‌ పరీక్షలు చేస్తారు. మానసిక నిపుణులతో (సైకియాట్రి్‌స్ట)తో కౌన్సెలింగ్‌ చేయిస్తారు.


మహిళగా లేదా పురుషుడిగా మారేందుకు సదరు వ్యక్తులు తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని నిర్ధారించుకుంటారు. భవిష్యత్తులో శరీరంలో వచ్చే మార్పులను ఎదుర్కొనగలరా, లేదా అన్నది పరిశీలిస్తారు. అంతా సానుకూలంగా ఉంటే.. లింగ మార్పిడికి అనుమతిస్తూ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. తొలుత పలు దశల్లో హార్మోన్‌్‌ థెరపీ ఇస్తారు. అవసరాన్ని బట్టి 10 వరకు శస్త్రచికిత్సలు చేస్తారు. పురుష లక్షణాలున్న వారిని మహిళగా మార్చేందుకు ఛాతీ పెంపు, గొంతు మార్పు, గడ్డం, మీసాల తొలగింపు, జననాంగ మార్పిడి చేస్తారు. మహిళా లక్షణాలున్న వారిని పురుషులుగా మార్చేందుకు రొమ్ములు, గర్భసంచి తొలగింపు, పురుషాంగం నిర్మాణం వంటివి చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను ఉస్మానియాలో ఎండోక్రైనాలజీ, సైకాలజీ, గైనకాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, అనస్తీషియా.. ఇలా ఆరు విభాగాల వైద్యుల సమన్వయంతో నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి దాదాపు రెండేళ్ల వరకు సమయం పట్టవచ్చు.


యువత, ఉన్నత విద్యావంతులే అధికం!

లింగమార్పిడి కోరుకుంటున్న వారిలో అధిక శాతం యువత, ఉన్నత విద్యావంతులే. లింగమార్పిడి కోసం నమోదు చేసుకుంటున్న వారిలో 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయసువారే ఎక్కువని ఉస్మానియా వైద్యులు తెలిపారు. అందులో ప్రస్తుతం ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారితోపాటు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల్లో స్థిరపడినవారు కూడా ఉన్నారని వెల్లడించారు. 19 మందికి ఏకకాలంలో సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని.. 11 మందికి పురుషులుగా, 8 మందికి మహిళలుగా లింగ మార్పిడి చేశామని తెలిపారు.


లింగ మార్పిడి కోరుకుంటున్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారని వైద్యులు వెల్లడించారు. లింగమార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి ఉస్మానియా ఖ్యాతిని పెంచిన ప్లాస్టిక్‌ సర్జరీ ప్రొఫెసర్‌ పల్కూరి లక్ష్మి, వైద్యులు దివ్య, ప్రియాంక, నాగభూషణం, సంతోష్‌ కుమార్‌, హరిక, నీలవేణి, యూరాలజీ విభాగాధిపతి మల్లికార్జున్‌లతోపాటు వైద్య బృందాన్ని ఆస్పపత్రి సూపరింటెండెంట్‌ రాకేశ్‌ సహాయ్‌ ప్రత్యేకంగా అభినందించారు. ‘‘శారీరకంగా అమ్మాయిని అయినా.. అంతరంగం అబ్బాయినని చెబుతోంది. రాజీపడుతూ బతికలేకపోయాను. లింగమార్పిడితో అబ్బాయిగా మారిపోయాను. ఇంట్లో రానివ్వలేదు. ఎప్పటికైనా వారు ఒప్పుకుంటారనే నమ్మకం’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ట్రాన్స్‌జెండర్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై సీఎం మౌనం వీడాలి

ఎల్‌నినోపై నేడు అఖిలపక్ష సమావేశం

నేడు రాష్ట్రంలో వర్షాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 05:43 AM