పాత పెన్షన్ పునరుద్ధరిస్తేనే అధికారం
ABN , Publish Date - Sep 14 , 2026 | 04:50 AM
డెహ్రాడూన్‌లో ఎన్‌ఎంవోపీఎస్ ఆధ్వర్యంలో పాత పెన్షన్ పునరుద్ధరణ కోరుతూ సీఎం నివాస ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతగా మారింది. ఓపీఎస్ అమలు చేయని ప్రభుత్వాలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
డెహ్రాడూన్‌లో ఎన్‌ఎంవోపీఎస్ హెచ్చరిక
ఉత్తరాఖండ్ సీఎం నివాసం ముట్టడి
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘జో కోయీ పురానీ పెన్షన్ బహాల్ కరేగే... వోహీ దేశ్ పే రాజ్ కరేగే’ (ఎవరైతే పాత పెన్షన్ పునరుద్థరిస్తారో వారే అధికారాన్ని దక్కించుకుంటారు) అనే నినాదంతో ఉత్తరాఖండ్ రాజధాని హోరెత్తింది. నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంవోపీఎస్) ఉత్తరాఖండ్ శాఖ ఆధ్వర్యంలో డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన పెన్షన్ మార్చ్, భారీ బహిరంగ సభ హోరు వర్షంలోనూ కొనసాగింది. ఎన్‌ఎంవోపీఎ్‌స జాతీయ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ నాయకత్వంలో జరిగిన ఈ మహాసభకు తెలంగాణ నుంచి ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
2027 ఫిబ్రవరిలో జరగబోయే ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఎంఓపీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఉత్తరాఖండ్‌లో ప్రత్యక్షంగా 1.6 లక్షలమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలో ఉన్నారని, వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 5 నుంచి 6 లక్షల ఓటు బ్యాంకు ఎన్నికల ఫలితాలను తలకిందులు చేసే శక్తిగా మారిందన్నారు. దక్షిణ భారతదేశంలో ఓపీఎస్ విధానాన్ని పునరుద్థరిస్తామని ప్రకటించిన పార్టీలకే ఉద్యోగ వర్గాలు పట్టం కట్టాయన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే... అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరిస్తామని ప్రకటించిన విషయాన్ని స్థితప్రజ్ఞ ప్రస్తావించారు.
ఎన్నికల హామీలతో సరిపెట్టకుండా ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలతో పాటు కేరళలోనూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఎన్‌పీఎస్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లోపభూయిష్టమైనదని నేతలు తోసిపుచ్చారు. తెలంగాణ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, లీగల్ అడ్వైజర్ ప్రవీణ్ హాజరై సంఘీభావం తెలిపారు. బహిరంగ సభ అనంతరం ‘పెన్షన్ మార్చ్’ పేరిట ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించారు. చివరకు సీఎం అధికారిక ప్రతినిధి వచ్చి నేతలతో మాట్లాడి వినతిపత్రాన్ని స్వీకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చరిత్రను తొక్కిపెడుతున్నారు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6 నెలల్లో రోబోటిక్ సర్జరీలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News