Share News

నిమ్స్‌లో అడుగడుగునా అవినీతి

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:38 AM

పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీలో అవినీతి.. సిబంది నియామకాల్లో అవకతవకలు.. క్యాంటీన్‌లో గడువు ముగిసిన ఆహారపదార్థాలు.. మందుల షాపులు, సెక్యూరిటీ టెండర్లలో అడ్డగోలు దందాలు!

నిమ్స్‌లో అడుగడుగునా అవినీతి

  • పేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు దందా

  • ఒక్కో రోగికి వారంలో 800 గ్లౌజులు

  • మరణించిన రోగుల పేర్లతో బిల్లులు

  • ఆపరేషన్‌ థియేటర్లలో రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, వైద్య సామగ్రి

  • సిబ్బంది నియామకాల్లో ఉల్లంఘనలు

  • ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి బాగోతాలు

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీలో అవినీతి.. సిబంది నియామకాల్లో అవకతవకలు.. క్యాంటీన్‌లో గడువు ముగిసిన ఆహారపదార్థాలు.. మందుల షాపులు, సెక్యూరిటీ టెండర్లలో అడ్డగోలు దందాలు! నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో కొందరు వైద్యులు, అధికారులు ప్రతి అంశాన్నీ అవినీతికి అవకాశంగా మార్చుకున్నట్టు ఏసీబీ వరుస తనిఖీల్లో వెల్లడవుతోంది. నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా. లక్ష్మీభాస్కర్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ తీగ లాగితే.. నిమ్స్‌ ఆస్పత్రిలో అల్లిబిల్లిగా అల్లుకున్న అవినీతి డొంక మొత్తం కదులుతోంది. టీజీ సేఫ్‌ (ఫుడ్‌ సేఫ్టీ), డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం, కార్మిక శాఖ అధికారులతో కలిసి నిమ్స్‌లో నిర్వహించిన వరుస తనిఖీలకు సంబంధించి ఏసీబీ అధికారులు సోమవారం వివరాలు వెల్లడించారు.


ఆ వివరాల ప్రకారం.. ఆరోగ్య శ్రీ పథకంలో చికిత్స పొందే వారు బిల్లుల విషయంలో ప్రశ్నించే అవకాశం ఉండదనే లాజిక్‌తో నిమ్స్‌లో కొందరు వైద్యులు, అధికారులు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారు. ఈ పథకం కింద చికిత్స పొందిన వారిలో ఒక్కో రోగికీ వారంలో 800 గ్లౌజులు ఉపయోగించినట్లు రికార్డుల్లో నమోదు చేసి గోల్‌మాల్‌ చేశారు. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి రోగులు డిశ్చార్జి అయిన తర్వాత.. చివరికి మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్‌ చేశారు. ఇలా.. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రోగులు డిశ్చార్జి అయిన తర్వాత సుమారు రూ.66 లక్షల విలువైన బిల్లులు నమోదు చేసినట్లు ఏసీబీ గుర్తించింది.


అపరేషన్‌ థియేటర్లలో 5 కోట్ల సామగ్రీ...

నిమ్స్‌లోని ఐదు ఆపరేషన్‌ థియేటర్లను తనిఖీ చేసిన ఏసీబీ బృందాలు.. అక్కడి అల్మారాల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర వైద్య సామగ్రిని వెండర్లు నిల్వ చేసినట్లు గుర్తించాయి. నిబంధనల ప్రకారం ఈ సామగ్రిని ప్రధాన స్టోర్‌లోనే నిల్వ చేయాల్సి ఉండగా, అందుకు విరుద్థంగా ఓటీలు, వాటి సబ్‌స్టోర్లలో అనుమతులు లేకుండా ఉంచినట్లు ఏసీబీ గుర్తించింది. అంతేకాదు.. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది ప్రధాన స్టోర్‌కు ఇండెంట్‌ పెట్టకుండానే నేరుగా వెండర్ల నుంచి ఇంప్లాంట్లను తీసుకుంటున్నట్లు గుర్తించారు. వాటిని వినియోగించిన తర్వాత యుటిలిటీ సర్టిఫికెట్‌ జారీ చేసి, వెండర్‌ ఇన్వాయిస్‌తో కలిపి ప్రధాన స్టోర్‌కు పంపి బిల్లులు ప్రాసెస్‌ చేస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ విధానం ద్వారా.. వినియోగించని ఇంప్లాంట్లకు సైతం యుటిలిటీ సర్టిఫికెట్లు సృష్టించి బిల్లులు పొందే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది.


క్యాంటీన్‌లో..

నిమ్స్‌ ప్రధాన క్యాంటీన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో గుర్తించారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) రిజిస్ట్రేషన్‌ లేకుండానే క్యాంటీన్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మిక చట్టాల ఉల్లంఘనలతోపాటు టెండర్‌ ప్రక్రియలోనూ అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది. అలాగే.. 2019 నుంచి 2025 వరకు టెండర్‌ ప్రక్రియను పూర్తిచేయకుండానే సిబ్బంది నియామకాలు చేపట్టినట్టు ఏసీబీ గుర్తించింది. కార్మికుల నియామకాలు, వారిని సెమీ స్కిల్డ్‌ కేటగిరీకి మార్చే విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు పేర్కొంది.


ఇక.. నిమ్స్‌లోని మెడికల్‌ షాపులు తప్పనిసరిగా నిర్వహించాల్సిన విక్రయ రికార్డులను నమోదు చేయకపోవడాన్ని, రిజిస్ట్రేషన్‌ లేని సిబ్బందిని నియమించుకోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. అలాగే.. మెడికల్‌ షాపుల కేటాయింపునకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను సైతం పరిశీలిస్తున్నట్లు ఏసీబీ తెలిపింది. మరోవైపు సెక్యూరిటీ సేవల టెండర్ల ఖరారులో అసాధారణ జాప్యం జరిగినట్టు, కాంట్రాక్టుల గడువు పదేపదే పొడిగించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ ఏజెన్సీకి సంబంధించిన రూ.28.13 లక్షల బ్యాంకు గ్యారంటీని జప్తు చేయలేదని వారు వెల్లడించారు. తనిఖీల సందర్భంగా వీటన్నింటికీ సంబంధించిన నోట్‌ ఫైళ్లు, ఒప్పంద పత్రాలు, ఇతర కీలక రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 05:38 AM