నిమ్స్ టెండర్లపై ఏసీబీ విచారణ.. కోవిడ్ బెడ్ల కేటాయింపులపై లక్ష్మీ భాస్కర్ వాంగ్మూలం
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:15 PM
నిమ్స్ ఆస్పత్రిలో టెండర్ల వ్యవహారంపై అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ నుంచి ఏసీబీ అధికారులు వాంగూలాన్ని నమోదు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 18: నిమ్స్ ఆస్పత్రిలో టెండర్ల వ్యవహారం, కరోనా సమయంలో బెడ్ల కేటాయింపుల్లో అక్రమాల ఆరోపణలకు సంబంధించి అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ నుంచి ఏసీబీ అధికారులు వాంగూలాన్ని నమోదు చేశారు. క్యాంటీన్ నిర్వహణ, హౌస్‌కీపింగ్, మెడికల్ షాపులు, సెక్యూరిటీ తదితర సేవల కేటాయింపులకు టెండర్ల ప్రక్రియ చూసినట్లు లక్ష్మీ భాస్కర్ తెలిపినట్లు సమాచారం. కరోనా సమయంలో బెడ్ల కేటాయింపుల అక్రమాలు తనకు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది.
బెడ్‌కు లక్ష రూపాయలు వసూళ్లపై ఏసీబీ ప్రశ్నించగా.. శగుణమ్మ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు లేదని.. ప్రశాంత్ పేరు మాత్రమే ఉందని.. అతనెవరో తనకు తెలియదని భాస్కర్ చెప్పినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో నోడల్ అధికారిగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న బెడ్లు, వార్డుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్యను మాత్రమే చూసుకున్నానని భాస్కర్ తెలిపినట్లు సమాచారం. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు, ఇతర ప్రముఖుల నుంచి ఫోన్లు వచ్చాయని.. రోగి పరిస్థితి, అత్యవసరత, తీవ్రతను బట్టి బెడ్ కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది.
క్యాంటీన్ టెండర్ కమిటీలో సభ్యుడిగా నియామకంపై ప్రశ్నించగా.. క్యాంటీన్ టెండర్ల కమిటీ సభ్యత్వంపై తనకు గుర్తులేదంటూ భాస్కర్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. క్యాంటీన్ టెండర్లలో ప్రిజం, నక్షత్ర సంస్థలు టెండర్లలో ఉన్నాయని.. నక్షత్ర సంస్థ ఇప్పుడు నిమ్స్‌లో క్యాంటీన్ నిర్వహిస్తోందని వెల్లడించినట్లు సమాచారం.
2026 టెండర్ల షెడ్యూల్ తయారీలో కమిటీలో భాస్కర్ పాత్రపై ఏసీబీ ప్రశ్నించగా.. ‘నాకు దానిపై అవగాహనా లేదు. మెడికల్ షాప్స్ టెండర్లలో కమిటీ సభ్యుడిగా ఉన్నాను. మ్యాన్‌పవర్ టెండర్లపై నాకు తెలియదు. 2009లో సోమజిగూడాలో ప్లాట్ కోసం ఆర్టీజీఎస్ ద్వారా రూ.30 లక్షలు నవీన్‌కు బదిలీ చేశాను. నవీన్ డబ్బులు తీసుకొని మోసం చేయడంతో బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాను. ఆస్తుల కొనుగోలు సమయంలో ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వలేదు’ అంటూ భాస్కర్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గణేష్, అరుణ పేర్లతో ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై లక్ష్మీ భాస్కర్ నోరు మెదపనట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
క్రీడాకారులకు కోచ్‌లను నియమించండి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు విమర్శలు
షీ టీమ్స్ పేరుతో మాజీ ప్రియుడికి ఫేక్ నోటీసు.. హైదరాబాద్‌లో యువతి నిర్వాకం
Read Latest Telangana News And Telugu News