Share News

మూడు రోజుల్లోనే విద్యుత్‌ కనెక్షన్‌

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:46 AM

కొత్త విద్యుత్‌ కనెక్షన్ల మంజూరుకు గడువుపై కేంద్రం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. మెట్రోపాలిటన్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని నిర్దేశించింది.

మూడు రోజుల్లోనే విద్యుత్‌ కనెక్షన్‌

  • కార్పొరేషన్‌ పరిధిలో దరఖాస్తుదారులకు ఇవ్వాల్సిందే

  • మునిసిపాల్టీల్లో అయితే ఏడు రోజుల్లో..

  • గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లో కనెక్షన్‌

  • కనెక్షన్ల మంజూరుకు గడువుపై కేంద్రం కొత్త నిబంధన

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కొత్త విద్యుత్‌ కనెక్షన్ల మంజూరుకు గడువుపై కేంద్రం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. మెట్రోపాలిటన్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని నిర్దేశించింది. మునిసిపల్‌ ప్రాంతాల్లో ఏడు రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో15 రోజుల్లో, కొండ ప్రాంతాలున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాలకు 30 రోజుల్లో విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని పేర్కొంది. కొత్త లైన్లు వేయడం లేదా సబ్‌స్టేషన్ల ఏర్పాటు అవసరమైతే గరిష్ఠంగా 90 రోజుల వ్యవధిలో విద్యుత్‌ సరఫరా కల్పించాల్సి ఉంటుంది.


ఈ మేరకు విద్యుత్‌(వినియోగదారుల హక్కుల) సవరణ నిబంధనలు-2026ను కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. దీనిపై డిసెంబరు 23వ తేదీకల్లా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక వినియోగదారులకు అసాధారణ బిల్లులు వస్తే.. ఆ బిల్లులను 30 రోజుల్లోగా సరిచేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్దేశించింది. వినియోగదారులకు భారీగా లేదా అసాధారణంగా, తక్కువగా విద్యుత్‌ బిల్లులు వచ్చినప్పుడు డిస్కమ్‌లు స్వయంగా అప్రమత్తం కావాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్)లు ఏర్పాటు చేయాలని, ఒకటి కంపెనీ స్థాయిలో, మరొకటి జిల్లా లేదా మునిపాల్టీ స్థాయిలో ఉండాలని సూచించింది. సాధారణంగా 30 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరించాలని, గరిష్ఠంగా 45 రోజులు మించకూడదని నిబంధనల్లో పేర్కొంది.


రూఫ్‌టాప్‌ సోలార్‌ యూనిట్లకు వెసులుబాటు

ఇప్పటివరకు వినియోగదారుల తాము వినియోగిస్తున్న లేదా మంజూరైన విద్యుత్‌ లోడ్‌కు అనుగుణంగానే రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది. కొత్త ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ నిర్దేశించే పరిమితులకు లోబడి అంతకంటే ఎక్కువ సామర్థ్యంతోనూ సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే డిస్కమ్‌ ప్రత్యేక అనుమతి లేకుండా మంజూరైన లోడ్‌కు మించి గ్రిడ్‌కు విద్యుత్‌ సరఫరా చేయడానికి వీలుండదు. అదనంగా పంపిన విద్యుత్‌కు చెల్లింపులు కూడా ఉండవు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 03:50 AM