కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థిక సాయం
ABN , Publish Date - May 28 , 2026 | 09:45 AM
పోషించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి తీరని బాధ కలుగుతుంది. వారిని ఓదార్చడం ఎవరి తరం కాదు. ఇక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం పరిస్థితి ఊహాజనితం.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా రూ.20 వేలు
నిర్వహణ బాధ్యతలు మండల కార్యాలయాలకు అప్పగింత
మీ-సేవలో దరఖాస్తు చేసుకుంటే విచారణ
హైదరాబాద్: పోషించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి తీరని బాధ కలుగుతుంది. వారిని ఓదార్చడం ఎవరి తరం కాదు. ఇక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం పరిస్థితి ఊహాజనితం. ఇలాంటి కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించేందుకు ఓ పథకం అమలులో ఉంది. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్) కింద నిరుపేద కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం గురించి పెద్దగా ప్రచారం లేకపోవడం, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అనేక మంది తికమక పడుతుంటారు. అందులో కేంద్ర ప్రభుత్వం పథకం కావడంతో తమకు రాదులే అనే ఆలోచనలో ఉంటారు.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు అర్హులైన లబ్ధిదారుల ఎంపికను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ మేరకు నిర్వహణ బాధ్యతలను ఆయా మండల కార్యాలయాలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖైరతాబాద్, షేక్‌పేట మండలాల పరిధిలో అర్హులైన వితంతువులకు లబ్ధి చేకూరేలా తహసీల్దార్లు చర్యలు చేపట్టారు. పెండింగ్ దరఖాస్తులు, నూతనంగా వచ్చే వాటిని పరిశీలించి త్వరగా నిధులు విడుదలయ్యేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మీ-సేవలో దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోపు అర్హుల జాబితా పంపించాలని స్పష్టం చేశారు.
ఆరు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవాలి
కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల లోపు వ్యక్తి సహజంగా లేదా ప్రమాదవశాత్తూ మరణిస్తే కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. మరణించిన ఆరు నెలల్లోపు సంబంధిత పత్రాలతో మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ పత్రాలను మండల కార్యాలయాలకు పంపి, విచారణలో అర్హులని తేలితే ప్రభుత్వం నుంచి నేరుగా నామినీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఇందుకోసం ఏ మధ్యవర్తిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు చేసుకోగానే రెవెన్యూ అధికారులు గతంలో ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన, ఆపద్బంధు పథకం నుంచి లబ్ధి చేకూరలేదని ఽనిర్ధారించుకుంటారు. ఈ మేరకు ధ్రువపత్రం అందజేస్తారు. మూడు నాలుగు రోజుల్లో డబ్బులు ఖాతాకు వస్తాయి. ఈ పథకం కోసం షేక్‌పేట, ఖైరతాబాద్ మండల పరిధిలోని కార్యాలయాల్లో ప్రత్యేకంగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. ఆయా మండలాల కిందకు వచ్చే ప్రాంతవాసులు మీ-సేవలో దరఖాస్తు చేసుకుంటే విచారణ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు.
పథకానికి అర్హతలు ఇవే..
కుటుంబం తప్పనిసరిగా బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన) జాబితాలో ఉండాలి.
కుటుంబానికి ప్రధాన ఆదాయం అందించే వ్యక్తి అయి ఉండాలి.
ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు.
సహజ, ప్రమాదవశాత్తూ మరణిస్తేనే ఈ పథకానికి అర్హులవుతారు.
అవసరమైన ధ్రువపత్రాలు
మరణ ధ్రువీకరణ పత్రం(డెత్ సర్టిఫికెట్)
నామినీ ఆధార్ కార్డు
చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు
రేషన్ బీపీఎల్ కార్డు
బ్యాంక్ పాస్ పుస్తకం జీరాక్స్ కాపీ
నామినీ ఫొటో
మండల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కోసం అర్హులైన వారు సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్‌లో ఏదైనా మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. మండల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మీ-సేవ నుంచి దరఖాస్తు రాగానే తనిఖీ చేసి కలెక్టర్ కార్యాలయానికి సిఫారసు చేస్తాం. సెర్ప్ సీఈఓ ద్వారా లబ్ధిదారులకు నిధులు మంజూరవుతాయి. ప్రజాప్రతినిధులు కూడా ఈ పథకం గురించి విస్తృత ప్రచారం చేయాలి.
వై.అనితారెడ్డి, షేక్‌పేట తహసీల్దార్
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News