Share News

నషా ముక్త్‌ భారత్‌ సామాజిక ఉద్యమం!

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:45 AM

మత్తు పదార్థాలను వాడే యువత పట్ల సానుభూతితో వ్యవహరించాలని, వారిని నేరస్థుల్లా చూడకూడదని, ఆ తప్పు యువతది కాదని.. డ్రగ్స్‌దేనని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

నషా ముక్త్‌ భారత్‌ సామాజిక ఉద్యమం!

  • సరిహద్దుల్లో డ్రగ్స్‌ అక్రమ రవాణపై ఉక్కుపాదం..

  • బీఎస్ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, అసోం రైఫిల్స్‌ బలోపేతం

  • జాగిలాల సంఖ్య, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ కట్టుదిట్టం

  • డ్రగ్స్‌ తయారీ సంస్థలు, స్మగ్లర్లను అణచివేస్తాం: కిషన్‌రెడ్డి

  • నేటి నుంచి 3 రోజులూ హైదరాబాద్‌లో పాదయాత్రలు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలను వాడే యువత పట్ల సానుభూతితో వ్యవహరించాలని, వారిని నేరస్థుల్లా చూడకూడదని, ఆ తప్పు యువతది కాదని.. డ్రగ్స్‌దేనని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఏ విద్యార్థి అయినా డ్రగ్స్‌ బారిన పడ్డాడని తెలిస్తే తోటి విద్యార్థులు హేళన చేయొద్దని.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని వెలివేయొద్దని.. బయట ప్రచారం చేయకుండా వారిని అక్కున చేర్చుకొని ఆ ఊబిలోంచి గౌరవప్రదంగా బయటకు తీసుకురావాలని హితబోధ చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విదేశీ శక్తులే ఇక్కడి యువతను నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాయని ఆరోపించారు. 2029 నాటికి ‘నషా ముక్త్‌ భారత్‌’ సాధనే లక్ష్యంగా పటిష్ట కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.


సరిహద్దుల్లో డ్రగ్స్‌ రవాణాను అడ్డుకునేందుకు బీఎ్‌సఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, అసోం రైఫిల్స్‌ వంటి పారామిలిటరీ బలగాలతో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి, జాగిలాల సంఖ్య, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ‘నషా ముక్త్‌ భారత్‌ హైదరాబాద్‌ వాక్స్‌’ పాదయాత్ర సందర్భంగా మంగళవారం కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. ‘నషాముక్త్‌ భారత్‌’ లక్ష్యసాధన కోసం డ్రగ్స్‌ తయారు చేసే సంస్థలు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.


పట్టణ ప్రాంతాల్లోని యువతలో 25 శాతం ఏదో ఒక రూపంలో మత్తు పదార్థాలకు అలవాటు పడుతోందని గణాంకాలు ఘోషిస్తున్నాయని.. యువత ఫోన్లు, సోషల్‌ మీడియాలో గడుపుతూ కొత్త స్నేహాల ద్వారా డ్రగ్స్‌ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు. డ్రగ్స్‌ కేవలం ధనికుల పిల్లల సమస్య కాదని.. అంబర్‌పేట, బోరబండ వంటి బస్తీల్లోని పేద కుటుంబాల యువత కూడా గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని చెప్పారు. డ్రగ్స్‌ బానిసలైన పిల్లలకు ఉచిత వైద్యం కోసం దేశవ్యాప్తంగా ఉన్న 300 పునరావాస కేంద్రాలను 2000కు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది యువతకు అవగాహన కల్పించేందుకు తొలి దశలో లక్ష మంది ’నషా ముక్త్‌ భారత్‌ మిత్ర‘ వాలంటీర్లను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ‘నషా ముక్త్‌ భారత్‌‘ ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని.. 140 కోట్ల ప్రజల సామాజిక ఉద్యమంగా అభివర్ణించారు. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు, సోషల్‌ మీడియా వారియర్స్‌ భాగస్వాములై ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు.


అంబర్‌పేట నుంచి పాదయాత్ర ప్రారంభం

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం బుధవారం నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్‌లో ‘నషా ముక్త్‌ భారత్‌’ పాదయాత్రలు జరుగనున్నాయి. అంబర్‌పేటలోని మహంకాళి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సినీ నటుడు వెంకటేశ్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర ఫీవర్‌ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రి మీదుగా కశిష్‌ ఫంక్షన్‌ హాలు వద్ద ముగుస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 05:45 AM