సాగర్ జలాలపై కాక
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:28 AM
సాగర్ జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీల మధ్య కాక మొదలైంది. విమర్శలకు, ప్రతివిమర్శలకూ దారితీస్తోంది.
‘నాగార్జునసాగర్’ కుడి వైపున 3 ఇన్‌టేక్ వెల్స్‌ను నిర్మిస్తున్న ఏపీ
1200 కోట్ల వ్యయం, 160 ఎంఎల్డీ సామర్థ్యంతో..
1.86 టీఎంసీల తరలింపు లక్ష్యం.. 9 నెలలుగా పనులు
చర్యలకు ఉపక్రమించిన తెలంగాణ సర్కారు
పనులను నిలిపివేయించాలంటూ కేంద్రానికి, కృష్ణాబోర్డుకు సాగునీటి శాఖ లేఖలు
తగిన సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ సాగర్ ఎస్‌ఈ, ఈఈలకు షోకాజ్ నోటీసులు
తమకు కేటాయించిన 2.55 టీఎంసీల నీటిలోంచే
ఇన్‌టేక్ వెల్స్ నిర్మిస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్
0.57 టీఎంసీల నీటినే వాడుకుంటామని వెల్లడి
ఇంకో ఏడాదిన్నర తర్వాతే.. అదీ తాగునీటి కోసమే..
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తెలంగాణ కూడా సాగర్‌ను వాడుకుంటోందన్న ఏపీ ఇంజనీర్లు
అక్రమంగా చుక్కనీరు తీసుకెళ్లకుండా అడ్డుకుంటాం
కృష్ణా జలాల్లో నష్టం బీఆర్‌ఎస్ హయాంలోనే: ఉత్తమ్
నల్లగొండ/హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సాగర్ జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీల మధ్య కాక మొదలైంది. విమర్శలకు, ప్రతివిమర్శలకూ దారితీస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం కుడి వైపు(ఏపీ భూభాగం పరిధిలోకి వచ్చే రైట్ బ్యాంక్) నుంచి ఏపీలోని పల్నాడు, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం జలజీవన్ పథకం కింద చేపట్టిన ‘పల్నాడు వాటర్ గ్రిడ్’ ప్రాజెక్టు మొత్తం వివాదానికి కేంద్రంగా మారింది. రూ.1200 కోట్ల వ్యయంతో ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన దీనిని కేంద్రప్రభుత్వ జల్‌జీవన్ మిషన్ పథకం కింద ఏపీ సర్కారు దీన్ని ప్రారంభించింది. ప్రస్తుతం సాగర్ రైట్ బ్యాంక్ వద్ద 160 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) సామర్థ్యంతో మూడు ఇంటెక్‌వెల్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
200 వాటర్ ట్యాంకులు కట్టి... వాటిని సాగర్ జలాలతో నింపి పల్నాడు, గుంటూరు జిల్లాల గ్రామాలకు తాగునీరు పంపిణీ చేయాలన్నది ఏపీ లక్ష్యం. 1.86 టీఎంసీల జలాలను తరలించడానికి వీలుగా ఈ పనులు జరుగుతున్నాయి. విషయం తెలిసి రాష్ట్ర సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఆదేశం మేరకు.. ఏపీ చేపట్టిన ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటి పారుదలశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఇదే విషయంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాశారు. కృష్ణాబోర్డు చైర్మన్‌తోనూ మంత్రి ఉత్తమ్ ఫోన్‌లో చర్చలు జరిపి... పనులు నిలిపివేయాలని కోరారు. మరోవైపు సాగర్ ఎస్‌ఈతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)కి నీటిపారుదలశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏపీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవటంపై చర్యలు ఎందుకు తీసుకోరాదో వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
ఏపీ వాదన ఇదీ..
తమ రాష్ట్రంలో చెరువులు నింపేందుకు తమకు గతంలో కేటాయించిన 2.55 టీఎంసీల నీటిలోంచే 0.57 టీఎంసీల నీటిని వాడుకుంటూ ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఏపీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటెక్‌వెల్ పనులు మాత్రమే జరుగుతున్నాయని, పనులు పూర్తి కావటానికి మరో ఏడాదిన్నర పడుతుందని, ఆ తర్వాతే గ్రామాలకు తాగునీరిస్తామని పేర్కొంటున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగాణలోనూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాలను వాడుకుంటున్నారని, దీనికి అదనంగా సుంకిశాలను కూడా నిర్మాణం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ కోసం సాగర్ ప్రాజెక్టు, టెయిల్ పాండ్ డ్యామ్‌ల నుంచే నీటిని తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. తాము 70 టీఎంసీల నీళ్లను తరలించుకుపోతున్నామనే ఆరోపణ సరికాదన్నది ఏపీ అధికారుల వాదన.
ఏ పోరాటానికైనా సిద్ధం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాగర్ నుంచి 90 టీఎంసీలు కాదు కదా... ఒక్క చుక్క నీళ్లు కూడా ఏపీ అక్రమంగా తీసుకెళ్లకుండా అడ్డుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలను దగా చేసే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని, కృష్ణా జలాల్లో నష్టం, మోసం బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయని మండిపడ్డారు. బుధవారం సచివాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం 1.8 టీఎంసీలు తరలించడానికి వీలుగా ఏపీ పనులు చేపట్టిందనే సమాచారం అందగానే ఈనెల 16న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు లేఖ రాశామని గుర్తు చేశారు.
కృష్ణాబోర్డు చైర్మన్‌కు స్వయంగా తానే ఫోన్ చేసి ఫిర్యాదు చేశానని, దీనిపై ఏపీకి నోటీసులు పంపిస్తామని బోర్డు చైర్మన్ తెలిపారన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏ పోరాటానికైనా, త్యాగానికైనా సిద్ధమని చెప్పారు. 2004-2014 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో శ్రీశైలం నుంచి ఏపీ తరలించిన నీటి సామర్థ్యం 4.41 టీఎంసీలు కాగా... పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో అది 13.17 టీఎంసీలకు చేరిందని మంత్రి తెలిపారు. సాగునీళ్ల విషయంలో బీఆర్‌ఎస్ తెలంగాణ రైతాంగానికి, ప్రజానీకానికి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా... రూ.1.83 లక్షల కోట్లను నీటిపారుదల ప్రాజెక్టులపై వెచ్చించినప్పటికీ ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. 21 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే సాగర్‌ను, 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఎస్సారెస్పీ, జూరాల, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే నిర్మించామని గుర్తు చేశారు. సాగర్ కింద క్రాప్ హాలీడే ప్రకటించలేదని, వరి కాకుండా అరుతడి పంటలు సాగుచేసుకోవాలని రెతులను కోరామన్నారు.
జగన్‌తో కుమ్మక్కై కృష్ణా జలార్పణం
2023లో కేసీఆర్‌ను గెలిపించడానికే... ఎన్నికలకు ఒకరోజు ముందు సాగర్ కుడివైపు భాగాన్ని 3 వేల మంది పోలీసులతో నాటి ఏపీ సీఎం జగన్ అక్రమించారని.. జగన్, కేసీఆర్ కలిసి కుమ్మక్కై ఈ చర్యకు పాల్పడ్డారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. జగన్‌తో విందులు, వినోదాలు చేసి కృష్ణా జలాలను తాకట్టు పెట్టారన్నారు. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే... అందులో తెలంగాణకు 34 శాతం, 299 టీఎంసీలు చాలని నిస్సిగ్గుగా సంతకాలు పెట్టింది బీఆర్‌ఎస్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా... శాస్త్రీయంగా 555 టీఎంసీలు కావాలని ట్రైబ్యునల్‌లో వాదనలు వినిపిస్తున్నామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కృష్ణాలో 4,464 టీఎంసీలను ఏపీ వాడుకుంటే.... తెలంగాణ 1,093 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈఏడాది అక్టోబరు 30వ తేదీ దాకా ఏపీ వినియోగం 98.16 టీఎంసీలు కాగా తెలంగాణ వినియోగించుకున్నది 122.74 టీఎంసీలన్నారు.
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి..
కేటీఆర్‌కు బక్కని సూచన
పల్నాడు వాటర్‌గ్రిడ్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు విజ్ఞప్తి చేశారు. ఈ వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి జీఓలు, నీటి వినియోగ వివరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. నాగార్జునసాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం 90 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తోందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణ అర్థరహితమని బక్కని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్‌డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News