సీఎం రేవంత్‌ను బద్నాం చేసేందుకు యత్నం.. హరీశ్‌పై ఎంపీ కిరణ్ ఫైర్
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:48 PM
సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశ ప్రజలను ఏకం చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ చామల కిరణ్ రెడ్డి విమర్శించారు. డీలిమిటేషన్ బిల్లును పెట్టి మహిళా బిల్లుగా బీజేపీ ప్రొజెక్ట్ చేసుకుంటోందని ఎంపీ అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 18: మాజీ మంత్రి హరీశ్ రావుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు రోజు ఏదో ఒకటి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ బిల్లును పెట్టి మహిళా బిల్లుగా బీజేపీ ప్రొజెక్ట్ చేసుకుంటోందని అన్నారు. బిల్లును అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయన్నారు. బీజేపీ కుట్రలను ఎండగట్టామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశ ప్రజలను ఏకం చేయడాన్ని హరీశ్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
‘మీ నాయకుడు ఫామ్ హౌస్‌లో ఉన్నారు. మీకు లోక్‌సభలో ఒక్క ఎంపీ లేరు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు పిలిస్తే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. దాన్ని హరీశ్ రావు తప్పుపడుతున్నారు. అక్కడ బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇద్దరు కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ వినతిపత్రం ఇచ్చారు. ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామని కళలు కన్నారు. మా మామ తర్వాత నేను సీఎం అవుతా లేకపోతే మా కుటుంబ సభ్యులు అవుతారని హరీశ్ రావు భావించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలో హరీశ్ రావు వేరే పార్టీల నాయకుల ఇళ్లకు వెళ్లలేదా అని ఎంపీ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం క్రాస్ బీడ్ అంటున్న హరీశ్ రావు... అసలు బీఆర్‌ఎస్ విధానం క్రాస్ బీడ్ అంటూ వ్యాఖ్యానించారు. క్రాస్ ఓటింగ్ చేసి తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను బీఆర్ఎస్ గెలిపించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ను ఓడించాలని బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందని ఆరోపించారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడారని ఎంపీ తెలిపారు. తాను స్వయంగా స్పీకర్ వద్ద సమయం తీసుకుని వెళ్లి తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఆందోళన చేశామని... స్పీకర్‌ను కలిసి తేజస్వి సూర్యపై ఫిర్యాదు చేశామని తెలిపారు. రేవంత్ రెడ్డి మళ్లీ, మళ్లీ ఉండాలి... కేసీఆర్ ఎప్పటికీ ఫామ్ హౌస్‌కు పరిమితం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. గత బీఆర్‌ఎస్ పాలన చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసని.. మీ కుటుంబ పాలనతో తెలంగాణకు ఎప్పటికీ మర్చిపోలేని గాయం అయిందంటూ ఎంపీ చామల కిరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్: అమెరికాపై ఇరాన్ ఆగ్రహం..
ఆ విషయాన్ని సీఎం రేవంత్ ముందే ప్రకటించారు: వేముల వీరేశం
Read Latest Telangana News And Telugu News