హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్: అమెరికాపై ఇరాన్ ఆగ్రహం..
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:12 PM
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ (శనివారం) మళ్లీ మూసివేసింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శుక్రవారం రోజే ఈ మార్గాన్ని తెరిచిన ఇరాన్, కేవలం 24 గంటల వ్యవధిలోనే మళ్లీ పాత ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
టెహ్రాన్/వాషింగ్టన్, ఏప్రిల్ 18: ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ (శనివారం) మళ్లీ మూసివేసింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శుక్రవారం(నిన్న)రోజే ఈ మార్గాన్ని తెరిచిన ఇరాన్, కేవలం 24 గంటల వ్యవధిలోనే మళ్లీ పాత ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని, ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) కొనసాగిస్తోందని ఇరాన్ ఆరోపించింది.
లెబనాన్ ఒప్పందం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'జలసంధిని తెరవడాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ ఇరాన్ ఓడరేవులపై మా నౌకాదళ దిగ్బంధనం మాత్రం కొనసాగుతుంది' అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమం, ఇతర అంశాలపై పూర్తిస్థాయి ఒప్పందం కుదిరే వరకు ఈ దిగ్బంధనం తొలగించే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.
దీనిని 'సముద్రపు దొంగతనం'గా అభివర్ణించిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC), తమ ఓడరేవులపై ఆంక్షలు తొలగించే వరకు జలసంధిలో కఠినమైన నియంత్రణ ఉంటుందని ప్రకటించింది. అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో అమెరికా తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైందని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక ఆంక్షల సడలింపు, దౌత్యపరమైన వాగ్దానాలను అమెరికా తుంగలో తొక్కిందని ఇరాన్ పేర్కొంది. అమెరికా, దాని మిత్రదేశాల తీరు తమ జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది.
ట్రంప్ ఏం చెప్పారు?
ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. 'హార్ముజ్ జలసంధి వ్యాపారానికి, ప్రయాణానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలి. కానీ, ఇరాన్‌కు సంబంధించి మా నౌకాదళ దిగ్బంధనం మాత్రం 100 శాతం ఒప్పందం కుదిరే వరకు అమల్లోనే ఉంటుంది.' అన్నారు.
ఇరాన్ తాజా ఆంక్షలు ఇవే:
ఇరాన్ పార్లమెంటరీ కమిటీ హెడ్ ఇబ్రహీం అజీజీ తెలిపిన వివరాల ప్రకారం.. IRGC అనుమతి పొందిన వాణిజ్య నౌకలను మాత్రమే జలసంధి గుండా అనుమతిస్తారు.
ఈ మార్గం గుండా వెళ్లే నౌకలు కచ్చితంగా 'టోల్ ఫీజు'(Tolls) చెల్లించాల్సి ఉంటుంది. ఇరాన్ అనుమతించిన నిర్దేశిత మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇక, వచ్చే సోమవారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో ఏవైనా సానుకూల నిర్ణయాలు వస్తాయో లేదో అని ప్రపంచ దేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..
మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి: మోదీ
విపక్షాలు ఐక్యంగా ఉండి బీజేపీ కుట్రలను అడ్డుకున్నాయి: ప్రియాంక