Share News

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:11 PM

ఏపీలో శనగల సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరిగిన విషయాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌కు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. శనగల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: అచ్చెన్నాయుడు
Minister Atchannaidu

అమరావతి, ఏప్రిల్ 18: రాష్ట్ర రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన అచ్చెన్నాయుడు.. రాష్ట్రంలో రైతుల సమస్యలను వివరంగా తెలిపారు. రాష్ట్రంలో శనగల సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరిగిన విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. శనగల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరారు. పీఎస్ఎస్ స్కీం కింద అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేయడానికి కేంద్రం తక్షణమే అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.


రాష్ట్రంలో మొత్తం 7,13,000 మెట్రిక్ టన్నుల శనగ ఉత్పత్తి జరిగినట్లు కేంద్రానికి తెలిపిన మంత్రి.. ఇప్పటివరకు 94,500 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు పూర్తి చేసినట్లు వివరించారు. కొనుగోలు ల‌క్ష్యాన్ని 1,78,250 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. మిగిలిన 68,750 మెట్రిక్ టన్నుల శనగలను త్వరలోనే కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.


మొక్కజొన్న రైతుల సమస్యను కూడా కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు వివరించారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు మొక్కజొన్నను రైతులు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. మిర్చి, పొగాకు రైతులు క్రాప్ డైవర్షన్ వల్ల మొక్కజొన్న సాగు పెరిగినట్లు వివరించారు. అధిక దిగుబడి కారణంగా మార్కెట్‌లో మొక్కజొన్న సరఫరా పెరిగిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈతనాల ఉత్పత్తిలో బ్రోకెన్ రైస్ వినియోగం పెరగడంతో మొక్కజొన్నకు డిమాండ్ తగ్గినట్లు కేంద్రానికి వివరించారు.


పీడీఎస్ స్కీంలో లేకపోయినా ప్రత్యేక పరిస్థితుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అచ్చెన్నాయుడు వినతి చేశారు. ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషితో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. రైతులకు పూర్తి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

పార్లమెంట్‌లో జాతికి విద్రోహం.. మహిళలకు అన్యాయం: సీఎం చంద్రబాబు

2029 నుంచే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని ఆశిద్దాం: కేంద్ర మంత్రి భూపతిరాజు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 18 , 2026 | 01:57 PM