Share News

పార్లమెంట్‌లో జాతికి విద్రోహం.. మహిళలకు అన్యాయం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:23 PM

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని ఆశించామని.. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు బిల్లును అడ్డుకున్నాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నిడదవోలులో నిరసన తెలుపుతున్నామని.. ఇది ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో జాతికి విద్రోహం.. మహిళలకు అన్యాయం: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

తూర్పుగోదావరి, ఏప్రిల్ 18: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో జాతికి విద్రోహం చేశారని.. మహిళలకు అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్‌లో మహిళల 33 శాతం రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న రోజు దేశ చరిత్రలో ‘బ్లాక్ డే’ అంటూ వ్యాఖ్యానించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని ఆశించామని.. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు బిల్లును అడ్డుకున్నాయని మండిపడ్డారు. నిడదవోలులో నిరసన తెలుపుతున్నామని.. ఇది ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు.


మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కుంటిసాకులు చెప్పారని.. ఏ మొహం పెట్టుకుని ఆడబిడ్డలను ఓట్లు అడుగుతారని సీఎం ప్రశ్నించారు. ఆడబిడ్డలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై జనసేన, బీజేపీ నేతలతో మాట్లాడినట్లు చెప్పారు. మహిళల సాధికారత కోసం రిజర్వేషన్లను అడ్డుకోకుండా ఉండాల్సిందని అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ బిల్లును తీసుకువచ్చారని వివరించారు. బిల్లును అడ్డుకోవడానికి వక్రభాష్యం చెప్పారని మండిపడ్డారు. నిన్న(శుక్రవారం) ప్రతిపక్ష పార్టీలు విర్రవీగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మహిళలు చట్టసభలకు వస్తే వారికి న్యాయం జరుగుతుందని ఆశించామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. ‘ఈ విషయాన్ని ఖండిస్తున్నా.. గర్హిస్తున్నా. రేపటి నుంచి దేశంలోని ప్రతి ఇంటికి తీసుకువెళతాం. రాబోయే ఎన్నికలలో వారికి డిపాజిట్లు రాకుండా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్‌ రాజ్‌పై పరువు నష్టం దావా

2029 నుంచే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని ఆశిద్దాం: కేంద్ర మంత్రి భూపతిరాజు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 18 , 2026 | 01:35 PM