Share News

కొండపల్లి కోట అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు

ABN , Publish Date - Apr 18 , 2026 | 10:59 AM

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మల కళను కాపాడేందుకు, ఈ హస్తకళాకారులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

కొండపల్లి కోట అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు
Kondapalli Fort

ఎన్టీఆర్‌ జిల్లా, ఏప్రిల్ 18: కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కోటను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జిల్లాలో నేటి(శనివారం) నుంచి మూడు రోజుల పాటు విభిన్నమైన వారసత్వ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈరోజు ఉదయం హెరిటేజ్ ట్రెక్కింగ్ ద్వారా వినూత్నంగా మేళాను కలెక్టర్ లక్ష్మీశా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. కొండపల్లి గ్రామం నుంచి ఖిల్లా పైకి ట్రెక్కింగ్ చేశారు కలెక్టర్, ఎమ్మెల్యే. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కొండపల్లి కోట అభివృద్ధి, పర్యాటకం, వారసత్వ సంపదను కాపాడేలా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మల కళను కాపాడేందుకు, ఈ హస్తకళాకారులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తు తరాలకు మన సంస్కృతిని, సంపదను అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ​ గతంలో ప్రారంభించిన లేజర్ షో వంటి ప్రాజెక్టులను పునఃప్రారంభించి, కోటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ లక్ష్మీశా వెల్లడించారు.


పర్యాటక కేంద్రంగా కొండపల్లి కోట: వసంత కృష్ణప్రసాద్

ఘాట్ రోడ్డు వచ్చిన తర్వాత మూతపడిన పాత నడకదారిని అటవీ శాఖ సహకారంతో పునరుద్ధరిస్తున్నామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. దీనివల్ల పర్యాటకులు ట్రెక్కింగ్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. ​రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండటంతో కొండపల్లి కోటను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. శని, ఆదివారాల్లో పర్యాటకుల రద్దీకి అనుగుణంగా భద్రత, సౌకర్యాలను కల్పిస్తున్నారని అన్నారు. రోప్‌వే ఏర్పాటు గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

తూర్పుగోదావరికి సీఎం చంద్రబాబు.. నేటి షెడ్యూల్ ఇదే..

లోకేశ్ మనసును కదిలించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ ట్వీట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 18 , 2026 | 10:59 AM