కోట్లాది మంది మహిళలకు ద్రోహం
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:11 AM
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు అడ్డుకోవడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళా సాధికారత ...
విపక్షాలపై సీఎం చంద్రబాబు మండిపాటు
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు అడ్డుకోవడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళా సాధికారత దిశగా భారతదేశం వేయాల్సిన చారిత్రక అడుగును అడ్డుకున్నాయని అన్నారు. సమాన గొంతుక, సరైన ప్రాతినిధ్యం కోరుకుంటున్న కోట్లాది మంది భారతీయ మహిళలకు విపక్షాలు ద్రోహం చేశాయని ‘ఎక్స్’లో ఆరోపించారు. ‘నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు దేశానికి గొప్ప అపకారం చేశాయి. 2026 తర్వాత నిర్వహించే జనాభా లెక్కల అనంతరం ఆర్టికల్ 81 కింద విధించిన స్తంభన ముగియనున్న నేపథ్యంలో ఇకపై కేవలం జనాభా ఆధారంగానే సీట్ల పంపిణీని పునఃసమీక్షించనున్నారు. దీంతో దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ రాష్ట్రాల వాణిని కాపాడటానికి, మహిళలకు 33శాతం ప్రాతినిధ్యం కల్పించడానికి ఎన్డీయే నిజాయితీగా ఒక ప్రతిపాదన చేసింది. అయితే దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలపై రాజకీయ అజెండాలు పైచేయి సాధించడం దురదృష్టకరం. ఈ ఫలితంతో సంబరాలు చేసుకుంటున్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సముచిత ప్రాతినిధ్యం కోసం ఒక న్యాయబద్ధమైన, రాజ్యాంగపరమైన రక్షణను పొందే అవకాశం మనం కోల్పోయాం’ అని ఆ పోస్టులో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.